టీఆర్ఎస్ కార్యకర్తనే... కానీ ఇంటెన్షనల్గా చేయలేదు

టీఆర్ఎస్ కార్యకర్తనే... కానీ ఇంటెన్షనల్గా చేయలేదు

తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు హైదరాబాద్కు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాన్వాయ్ కు టీఆర్ఎస్ లీడర్ కారు అడ్డు రావడం కలకలం రేపింది. దాదాపు 5 నిమిషాల పాటు అమిత్ షా కాన్వాయ్కు ఆ కారు అడ్డుగా ఉండటంతో భద్రతా సిబ్బంది దాని అద్దాలను పగులగొట్టారు. హరిత ప్లాజా వద్ద ఈ సంఘటన జరగగా ఆ కారును టీఆర్ఎస్ నేత గోసుల శ్రీనివాస్‌దిగా పోలీసులు గుర్తించారు.  

అమిత్ షా కారుకు అడ్డు వచ్చిన ఘటనపై కారు ఓనర్ శ్రీనివాస్ స్పందించారు. తాను ఉద్దేశపూర్వకంగా అలా చేయలేదని వివరణ ఇచ్చుకున్నారు. టూరిజం ప్లాజాలోని మినర్వా హోటల్లో కాఫీ తాగేందుకు వెళ్లానని, ఆ టైమ్ లో తన కారు ముందున్న ఇన్నోవా కారు స్లో కావడంతో ముందుకు వెళ్లలేకపోయానని అన్నారు. అదే సమయంలో అమిత్ షా కాన్వాయ్ వస్తుందని హడావుడి చేస్తూ 15 మంది పోలీసులు తన కారు అద్దాలు పగులగొట్టారని శ్రీనివాస్ చెప్పాడు. ఈ ఘటనతో టెన్షన్ కు గురై కారు డ్రైవ్ చేయలేక పోయానని, దీంతో  పోలీసులే తన కారును ముందుకు నెట్టారని అన్నారు. తాను టీఆర్ఎస్ కార్యకర్తనే అయినప్పటికీ ఇంటెన్షనల్గా కారును అడ్డుగా పెట్టలేదని స్పష్టం చేశాడు. ఏదైనా కేసు అవుతుందేమోనని తానే ముందుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసి, అక్కడ తన  వివరాలన్ని ఇచ్చినట్టుగా శ్రీనివాస్ చెప్పారు.

లక్ష్మణ్ ఫైర్

ఈ ఘటనపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. కేంద్ర హోంమంత్రి పర్యటనకు వస్తే భద్రత ఏర్పాట్లు చేసేది ఇలాగేనా అంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వ భద్రతా వైఫల్యమని ఆరోపించారు. కేంద్ర హోంమంత్రికే ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఇతరులను ఎలా రక్షిస్తారని మండిపడ్డారు.