కేటీఆర్​ మినిస్టర్ కావాలె..వేదికలపై నేతల డిమాండ్

కేటీఆర్​ మినిస్టర్ కావాలె..వేదికలపై నేతల డిమాండ్
  • కొద్దిరోజులుగా బహిరంగ వేదికలపైనే నేతల డిమాండ్లు
  • ఆయన్ను మినిస్టర్ చేస్తే మంచిదన్న హోంమంత్రి
  • కేబినెట్  విస్తరణ ప్రచారంతో తెరపైకి

హైదరాబాద్, వెలుగు బ్యూరోటీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మంత్రి పదవి ఇవ్వాలన్న డిమాండ్ ఆ పార్టీలో కొద్దిరోజులుగా తరచూ వినిపిస్తోంది. ఆయన మంత్రిగా ఉంటే మంచిదంటూ సీఎంకు అత్యంత సన్నిహితుడైన హోంమంత్రి మహమూద్ అలీ కామెంట్ చేశారు. ఆయనతో పాటే మరికొందరు ఎమ్మెల్యేలు, నేతలు కూడా కొన్నిరోజులుగా ఇదే గళం వినిపిస్తున్నారు. కొందరు పరోక్షంగా ఆ అర్థం వచ్చేలా మాట్లాడుతుంటే మరికొందరు బహిరంగ వేదికలపై నేరుగానే ఈ మాటను చెబుతున్నారు. త్వరలోనే రాష్ట్ర కేబినెట్ విస్తరణ జరుగుతుందని ప్రచారం జరుగుతున్న సమయంలో ఈ డిమాండ్ పదేపదే తెరపైకి రావడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్ర కేబినెట్ విస్తరణలో కేటీఆర్ ను తీసుకునేందుకు కసరత్తు జరుగుతోందనడానికి ఈ డిమాండ్లే సంకేతమని  భావిస్తున్నారు.  టీఆర్ఎస్  రెండోసారి అధికారంలోకి వచ్చాక పూర్తి స్థాయి మంత్రివర్గాన్ని  ఏర్పాటు చేసుకోలేదు. మొదట్లో సీఎం కేసీఆర్ తో పాటు హోంమంత్రి మహమూద్ అలీ మాత్రమే కేబినెట్లో ఉన్నారు. 2 నెలల తర్వాత మరో 10 మందిని తీసుకున్నారు. కేబినెట్లో సీఎంతో పాటు 17 మందికి అవకాశం ఉండగా ప్రస్తుతం 11 మందే ఉన్నారు. ఇంకో ఆరుగురికి చోటుంది. గ‌తంలో మంత్రులుగా  చేసి రెండోసారి అవకాశం దక్కనివారిలో కేటీఆర్, హరీశ్ సహా మరికొందరు ముఖ్య నేతలు ఉన్నారు.

వరుస ఎలక్షన్లలో..

అసెంబ్లీ ఎలక్షన్ల తర్వాత మంత్రివర్గం ఏర్పాటుకు ముందే కేటీఆర్‌కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా  సీఎం కేసీఆర్​ బాధ్యతలు అప్పగించారు. ఆయన నేతృత్వంలోనే లోక్ సభ ఎలక్షన్లు, పరిషత్, పంచాయతీ ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ వెళ్లింది. ఇందులో లోక్ సభ ఎలక్షన్లలో పార్టీకి ఊహించని షాక్‌ తాకింది. తొమ్మిది ఎంపీ సీట్లే వచ్చాయి. సిట్టింగ్ సీట్లను కూడా కోల్పోవడం పార్టీకి షాక్‌కు గురైంది. ప్రతిపక్ష బీజేపీకి 4, కాంగ్రెస్ కు 3 ఎంపీ సీట్లు దక్కాయి. పరిషత్ ఎన్నికల్లో మాత్రం టీఆర్ఎస్ అన్ని  జెడ్పీలను గెలుచుకుంది. లోక్ సభ ఎన్నికల కంటే ముందే ఓ గ్రాడ్యుయేట్, రెండు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ మద్దతిచ్చిన క్యాండిడేట్లు ఘోరంగా ఓడారు. వీటన్నింటితో కేటీఆర్​ నేతృత్వంలో మిశ్రమ ఫలితాలు వస్తున్నాయన్న చర్చ జరిగింది.

కేబినెట్​ విస్తరణ అంచనాలతో..

రాష్ట్ర కేబినెట్ విస్తరణ ఎప్పుడు, ఎవరెవరికి అవకాశం వస్తుందన్న దానిపై ఇప్పటికే చాలా సార్లు ప్రచారం జరిగింది. ప్రతిసారి కేటీఆర్ కు అవకాశం ఉంటుందా లేక ఈ నాలుగేండ్లూ పార్టీ వ్యవహారాల బాధ్యతలనే కొనసాగిస్తారా అని టీఆర్ఎస్​లో, బయటా విపరీతంగా చర్చలు జరిగాయి. అయితే ఈసారి కేబినెట్​ విస్తరణ తప్పకుండా ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో కేటీఆర్​ను కేబినెట్లోకి తీసుకోవాల్సిందేనంటూ టీఆర్ఎస్  సీనియర్ నేతలు మాట్లాడుతుండటం గమనార్హం. కొద్దిరోజులుగా జరుగుతున్న పార్టీ కార్యక్రమాలు, ఇతర వేదికలపై టీఆర్ఎస్​ సీనియర్​ లీడర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఈ ప్రస్తావన తెస్తున్నారు. తాజాగా హైదరాబాద్​కూక‌ట్ ప‌ల్లిలో జ‌రిగిన టీఆర్ఎస్​ కార్యకర్తల స‌మావేశంలో కేటీఆర్ సమక్షంలోనే ఎమ్మెల్యే మాధవ‌రం కృష్ణారావు కేబినెట్లో చోటు అంశాన్ని ప్రస్తావించారు. ‘‘ఒక బాధ ఉంది మాకు. కేటీఆర్  గారికి మంత్రి పదవి లేకపోవడం వల్ల కార్యకర్తలకు ఇబ్బంది కలుగుతోంది. మీరు మంత్రిగా ఉండటం వల్ల హైదరాబాద్​ నగర ప్రజలకు ఎంతో ఉపయోగం జరిగింది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. కానీ ఏడెనిమిది నెలల నుంచి మేం బాధ పడుతున్నాం. మళ్లీ మీరు మంత్రి పదవి తీసుకుని ప్రజలకు సేవ చేయాలని కోరుతున్నం” అని కేటీఆర్​నే కోరారు. పార్టీ నేతలు కలిసినప్పుడు, అవకాశం ఉన్నప్పుడల్లా ఎమ్మెల్యేలు, సీనియర్ మంత్రులు ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నట్టు తెలుస్తోంది. త్వర‌లో చేప‌ట్టబోయే కేబినెట్ విస్తర‌ణ‌లో కేటీఆర్ కు మంత్రి ప‌ద‌వి ఇవ్వాలన్న అభిప్రాయాన్ని కేసీఆర్ కు చేరేలా నేతలు మాట్లాడుతున్నారని పార్టీ వర్గాలంటున్నాయి. ఇటీవలి ఓ కార్యక్రమంలో కేసీఆర్  సన్నిహితుడు హోంమంత్రి మహమూద్  అలీ కూడా కేటీఆర్​ విషయాన్ని ప్రస్తావించారు. కేటీఆర్ పరిశ్రమల మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ చాలా అభివృద్ధి చెందిందన్నారు.

ఏమిటీ వ్యూహం?

నేతలంతా కేటీఆర్ కు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తుండటం టీఆర్ఎస్ లో చర్చనీయాంశంగా మారింది. ఇది నేతలు చేస్తున్న డిమాండేనా, లేకుంటే మరేదైనా స్ట్రాటజీ ఉందా అని కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా అయ్యాక సర్కారు అధికారిక కార్యక్రమాలకు కేటీఆర్ దూరమయ్యారు. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కీలక​కార్యక్రమాలతో పాటు గ్రేటర్ పరిధిలో అన్నీ తానే అయి కేటీఆర్ ఉండేవారు. ఇప్పుడు ఆయన మంత్రి కాకపోవడంతో ప్రోటోకాల్ లేదు. హోదా, ప్రోటోకాల్ ఉండాలనే ఇలాంటి డిమాండ్ తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. దీనికి అనుగుణంగా గ్రౌండ్  ప్రిపేర్  చేసే ప్రయత్నం జరుగుతోందేమోనని గతంలో మంత్రిగా చేసి, ఈసారి పదవి దక్కని సీనియర్ నేత అన్నారు.