టీఆర్ఎస్ నేతల్లో నామినేటెడ్ ఆశలు

టీఆర్ఎస్ నేతల్లో నామినేటెడ్ ఆశలు
  • వినోద్​కు ప్లానింగ్​ బోర్డు వైస్​ చైర్మన్​ పదవి ఇవ్వడంతో హడావుడి మొదలు
  • తమకు చాన్స్​ ఇవ్వాలంటూ కొందరు నేతల ప్రయత్నాలు
  • రెన్యువల్‌ కోసం మరికొందరు నేతల లాబీయింగ్‌

హైదరాబాద్‌‌, వెలుగుటీఆర్‌‌ఎస్‌‌ నేతల్లో నామినేటెడ్‌‌ పోస్టుల భర్తీ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. చాలా మంది ఆశావహులు తమకు అవకాశం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. లోక్​సభ ఎలక్షన్లలో ఓడిపోయిన మాజీ ఎంపీ బి.వినోద్​కుమార్​ను తాజాగా ప్లానింగ్‌‌ బోర్డు వైస్‌‌ చైర్మన్‌‌ పదవిలో నియమించడంతో.. మరికొందరికి కూడా నామినేటెడ్​ పోస్టులు ఇవ్వవచ్చని నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సీఎంగా కేసీఆర్‌‌ రెండోసారి గద్దెనెక్కిన తర్వాత రెండు నామినేటెడ్‌‌ పోస్టులను భర్తీ చేశారు. కొద్దినెలల కింద సివిల్‌‌ సప్లయ్స్​ కార్పొరేషన్‌‌ చైర్మన్‌‌గా సిద్దిపేటకు చెందిన నేత మారెడ్డి శ్రీనివాస్‌‌రెడ్డిని నియమించారు. ఇప్పుడు వినోద్​కు అవకాశమిచ్చారు.


పదుల సంఖ్యలో కార్పొరేషన్​ పోస్టులు..

రాష్ట్రంలో 75 కార్పొరేషన్‌‌ చైర్మన్‌‌ పదవులు ఉన్నాయి. ప్రస్తుతం తొమ్మిది కార్పొరేషన్ల పోస్టులు ఖాళీగా ఉండగా.. మరో ఆరింటి చైర్మన్ల పదవీకాలం ముగిసింది. ఇక పదవీకాలం ముగిసిన నలుగురికి సర్కారు ఎక్స్‌‌టెన్షన్‌‌ ఇచ్చింది. మొత్తంగా అక్టోబర్‌‌ నాటికి సగానికిపైగా కార్పొరేషన్​ చైర్మన్ల పదవీకాలం ముగియనుంది. ఆ పోస్టులను ఆశిస్తున్న కొందరు నేతలు ఇప్పటికే టీఆర్‌‌ఎస్‌‌ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌ కేటీఆర్‌‌ను, ఆయనకు సన్నిహితంగా ఉండే నేతలను కలిసి, తమకు ఇప్పించాలని కోరుతున్నారు. అయితే ప్రగతి భవన్‌‌కు టచ్‌‌లో ఉండే కొందరు నేతలకు పదవులపై హామీ లభించినట్టు సమాచారం. ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు దక్కని పలువురు నేతలు సైతం నామినేటెడ్‌‌ పోస్టులు ఇవ్వాలని కోరుతున్నారు.

ఎవరెవరికి?

ఎస్సీ కార్పొరేషన్‌‌, టీఎస్‌‌ ఆర్టీసీ, గిరిజన కో-ఆపరేటివ్‌‌ ఫైనాన్స్‌‌ కార్పొరేషన్‌‌, ఇండస్ట్రియల్‌‌ డెవలప్​మెంట్‌‌ కార్పొరేషన్‌‌, రోడ్స్‌‌ డెవలప్మెంట్‌‌ కార్పొరేషన్‌‌, మూసీ రివర్‌‌ ఫ్రంట్‌‌ డెవలప్మెంట్‌‌, సాంస్కృతిక సారథి, ఫారెస్ట్‌‌ డెవలప్మెంట్‌‌ కార్పొరేషన్‌‌ చైర్మన్‌‌ పోస్టులతో పాటు కేబినెట్‌‌ హోదా గల మిషన్‌‌ భగీరథ వైస్‌‌ చైర్మన్‌‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పదవీకాలం ముగిసిన ఆరు కార్పొరేషన్లలో ఒకరిద్దరికి తప్ప మిగతా వారికి ఎక్స్‌‌టెన్షన్‌‌ దక్కే అవకాశమున్నట్టు ప్రచారం జరుగుతోంది. అక్టోబర్‌‌లో పదవీకాలం ముగిసే చైర్మన్లలో దాదాపు సగం మందిని పక్కనబెట్టి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వనున్నట్టు చెప్తున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రావణ్‌‌కుమార్‌‌రెడ్డికి కీలక పదవి దక్కవచ్చని, టీఆర్‌‌ఎస్‌‌ ఎల్పీ కార్యదర్శిగా ఉన్న రమేశ్‌‌రెడ్డికి నామినేటెడ్‌‌ పదవి దక్కవచ్చని అంటున్నారు. తెలంగాణ భవన్‌‌ మీడియా ఇన్‌‌చార్జీగా పనిచేస్తున్న నాయినేని రాజేశ్వర్‌‌రావుకు పదవిపై కేటీఆర్‌‌ హామీ ఇచ్చినట్టు చెప్తున్నారు. ఈ ముగ్గురూ పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నవారు కావడంతో చాన్స్​ ఇవ్వాలని హైకమాండ్​ భావిస్తున్నట్టు సమాచారం.

గ్రేటర్​ నేతలకు పార్టీ పదవులే!

ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు దక్కని పలువురు సీనియర్‌‌ నేతలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు సైతం కార్పొరేషన్‌‌ పదవులు ఆశిస్తున్నారు. కొందరు నేతల కుటుంబ సభ్యులకు జెడ్పీ చైర్మన్‌‌ పదవులు ఇచ్చిన నేపథ్యంలో మరో పదవి ఇచ్చేది లేదని కేటీఆర్‌‌ తేల్చిచెప్పినట్టు ప్రచారంలో ఉంది. పార్టీ అవసరాల కోసం సీట్లను త్యాగం చేసిన మిగతా నేతలు, పార్టీ కోసం పనిచేస్తున్న వారికి ఏదో ఒక పదవి ఇవ్వాలనే యోచనలో ఉన్నట్టు చెప్తున్నారు. గ్రేటర్‌‌ హైదరాబాద్​ సిటీకి చెందినవారిలో చాలా మంది పదవులు ఆశిస్తున్నారని, వారికి పార్టీ పదవులే ఇస్తారని తెలుస్తోంది. పలువురు మాజీ మంత్రులకు సైతం పార్టీ పదవులే ఇస్తారని, శాసన మండలిలో ఖాళీలు లేకపోవడంతో వారిని పార్టీ పనికే ఉపయోగించుకోవాలని భావిస్తున్నారని సమాచారం.