బండి సంజయ్ కాన్వాయ్‌‌పై టీఆర్ఎస్​ దాడి

బండి సంజయ్ కాన్వాయ్‌‌పై టీఆర్ఎస్​ దాడి
  • నెక్లెస్‌‌ రోడ్‌‌లో వాకింగ్​కు వెళ్లొస్తుండగా అడ్డుకున్న కార్పొరేటర్​ విజయారెడ్డి, ఇతర నేతలు

హైదరాబాద్, వెలుగు: బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కాన్వాయ్‌‌పై టీఆర్ఎస్​నేతలు దాడి చేశారు. కాన్వాయ్​లోని కారును అడ్డుకుని అద్దాలు పగలగొట్టారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్​లోని నెక్లెస్​రోడ్డులో జరిగిన ఈ ఘటన కలకలం రేకెత్తించింది. సోమవారం హైదరాబాద్​లో పలు ఆలయాలను సందర్శించిన బండి సంజయ్.. సాయంత్రం నెక్లెస్‌‌ రోడ్‌‌ కు వెళ్లారు. వాకింగ్ చేసి.. అక్కడున్న పిల్లలతో సరదాగా ఆటలు ఆడారు. తర్వాత నెక్లెస్​రోడ్డు నుంచి బయలుదేరారు. అప్పటికే నెక్లెస్​రోడ్డుకు వచ్చిన టీఆర్ఎస్​ ఖైరతాబాద్‌‌ క్యాండిడేట్  విజయారెడ్డి, ఆమె అనుచరులు సంజయ్​ కాన్వాయ్​ను అడ్డుకున్నారు. సంజయ్​ ఉన్నట్టుగా భావిస్తూ ఓ కారుపై దాడికి దిగారు. అద్దాలు ధ్వంసం చేశారు. కారులో ఉన్నవారిని బయటికి లాగే ప్రయత్నం చేశారు. ఆపేందుకు ప్రయత్నించిన పోలీసులనూ తోసేశారు. బీజేపీ శ్రేణులు ప్రతిఘటించాయి. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కానీ ఆ కాన్వాయ్​లో సంజయ్​ ఉన్న కారు అప్పటికే ముందుకు వెళ్లిపోయింది. చివరికి పోలీసులు విజయారెడ్డిని, టీఆర్ఎస్​ కార్యకర్తలను అక్కడి నుంచి పంపేశారు.

విజయారెడ్డి, కార్యకర్తలపై కేసు నమోదు

హైదరాబాద్, వెలుగు: బీజేపీ రాష్ట్ర చీఫ్​ బండి సంజయ్​పై హత్యాయత్నం అనే ప్రచారం అవాస్తవమని.. ఆయన కాన్వాయ్​పై దాడి రాజకీయ పార్టీల గొడవ అని హైదరాబాద్​ సెంట్రల్​జోన్​ జాయింట్​ పోలీస్​ కమిషనర్​ విశ్వప్రసాద్  పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పేర్కొన్నారు. సంజయ్ కాన్వాయ్​పై టీఆర్ఎస్​ దాడికి సంబంధించి.. విజయారెడ్డి, ఆమె అనుచరులపై రాంగోపాల్​పేట పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత విశ్వప్రసాద్​ఒక ప్రకటన రిలీజ్​ చేశారు. సంజయ్​ ఈవెనింగ్​ వాక్  కోసం నెక్లెస్​రోడ్డుకు వచ్చారని.. దీనిపై రాత్రి 8.30 సమయంలో తమకు సమాచారం వచ్చిందని తెలిపారు. రాంగోపాల్​పేట పోలీసులు స్పాట్ కు వెళ్లి బండి సంజయ్ ను అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా కోరారని.. దానికి సంజయ్​ అంగీకరించారని, అక్కడే ఉన్న రెస్టారెంట్ లో టిఫిన్ చేసి వెళ్తానని చెప్పారని వివరించారు. అదే సమయంలో కొందరు టీఆర్ఎస్​ నేతలు, కార్యకర్తలు అక్కడికి వచ్చారని.. ఇరు పార్టీల వాళ్ల మధ్య గొడవ మొదలైందని చెప్పారు. సంజయ్ అక్కడి నుంచి వెళ్లిపోతుండగా.. కొందరు కారుపై దాడి చేసి, అద్దాలు పగలగొట్టారని వెల్లడించారు. దర్యాప్తు చేస్తున్నామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.