అస్సాం సీఎంపై దాడికి టీఆర్​ఎస్​ లీడర్​ యత్నం

అస్సాం సీఎంపై దాడికి టీఆర్​ఎస్​ లీడర్​ యత్నం
  • రాష్ట్రంలో రజాకార్ల పాలన నడుస్తున్నది: హిమంత బిశ్వశర్మ 
  • వచ్చే ఎన్నికల్లో బీజేపీదే గెలుపని ధీమా

హైదరాబాద్, వెలుగు: వినాయక నిమజ్జనానికి ముఖ్య అతిథిగా వచ్చిన అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మపై టీఆర్​ఎస్​ నాయకుడు దాడికి ప్రయత్నించాడు. స్టేజీపై బిశ్వశర్మ  ఉండగా.. దూసుకువచ్చి మైక్​ గుంజేసుకొని ఇష్టమున్నట్లు కామెంట్లు చేశాడు. దీంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. శుక్రవారం సాయంత్రం హిమంత బిశ్వశర్మ ఎంజే మార్కెట్‌‌ వద్ద శోభాయాత్రకు వచ్చారు. వేదికపై  ఆయన ఉండగా..భాగ్యనగర్‌‌ ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి భగవంతరావు మాట్లాడుతున్నారు. ఇంతలో టీఆర్‌‌ఎస్‌‌ నాయకుడు నందకిశోర్‌‌ వ్యాస్‌‌ స్టేజీపైకి దూసుకొచ్చాడు.  భగవంతరావు నుంచి మైక్‌‌ గుంజుకొని అస్సాం సీఎం వైపు కోపంతో చూస్తూ ఏవో కామెంట్లు చేయసాగాడు. దీంతో అతడ్ని భాగ్యనగర్‌‌ ఉత్సవ సమితి సభ్యులు పక్కకు లాక్కెళ్లారు. 

అనంతరం స్టేజీ కింది నుంచి అస్సాం సీఎంపై నందకిశోర్  తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. దీంతో టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌, బీజేపీ నేతలు ఒకరిపైకి ఒకరు దూసుకువచ్చారు. పోలీసులు నందకిశోర్‌‌‌‌ను అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు. అస్సాం సీఎం పర్యటనలో భద్రతా వైఫల్యంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. జడ్‌‌‌‌ ప్లస్‌‌‌‌ సెక్యూరిటీ ఉన్న సీఎం స్టేజీపై ఉన్నప్పుడు టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నేతను పైకి ఎలా అనుమతిస్తారని పోలీసులను  ప్రశ్నించింది. 

రాష్ట్రంలో రజాకార్ల పాలన: హిమంత బిశ్వశర్మ
రాష్ట్రంలో రజాకార్ల పాలన సాగుతున్నదని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ  మండిపడ్డారు. ఎంజే మార్కెట్ దగ్గర శోభాయాత్రలో ఆయన మాట్లాడారు. ప్రజలతో మాట్లాడకుండా తనను అడ్డుకోవాలని చూస్తున్నారని, సీఎంని ఇట్ల అవమానిస్తరా? అని ప్రశ్నించారు. అస్సాంలో ఇన్ని అడ్డంకులు ఉండవని, అందరికీ మాట్లాడే ఫ్రీడం ఇస్తామని తెలిపారు. ప్రధాని మోడీ నేతృత్వంలో మన దేశాన్ని విశ్వగురు చేయాలని ప్రజలకు  పిలుపునిచ్చారు. అంతకు ముందు ఆయన  గచ్చిబౌలిలోని ఓ హోటల్ లో ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలుపు బీజేపీదేనని, దీన్ని అడ్డుకోవడం ఎవరి తరం కాదన్నారు. రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరడం అంతే వాస్తవమని పేర్కొన్నారు. ‘‘తెలంగాణ ప్రజలు నిజాం పాలనను కోరుకోవడం లేదు. వారు ప్రజాస్వామ్య పాలనను కోరుకుంటున్నరు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయ పార్టీలు పెట్టుకోవచ్చు. కానీ, సీఎం కేసీఆర్ ఎన్నికల సమయంలో ఇక్కడి ప్రజలకు ఇచ్చిన హామీలను ముందుగా నెరవేర్చాలి. దేశంలో ఎంత మంది జట్టు కట్టి ఎన్ని కూటములు పెట్టినా ప్రజల మనసులో మోడీ ఉన్నంతకాలం బీజేపీకి తిరుగులేదు” అని అన్నారు.

టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌, బీజేపీ ఫ్లెక్సీ లొల్లి
అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మకు స్వాగతం పలికేందుకు ఎంజే మార్కెట్​లో బీజేపీ నేతలు ఫ్లెక్సీ ఏర్పాటు చేసేందుకు శుక్రవారం మధ్యాహ్నం సిద్ధమవగా.. అదే టైంలో టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నేతలు మంత్రి తలసాని శ్రీనివాస్‌‌‌‌ యాదవ్‌‌‌‌ ఫ్లెక్సీని తెచ్చి ఏర్పాటు చేశారు. తాము ఫ్లెక్సీ పెట్టాలనుకున్న చోట మీరెలా పెడతారంటూ బీజేపీ నేతలు ప్రశ్నించడంతో వాగ్వాదం మొదలైంది. దీంతో శోభాయాత్రలో వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు జోక్యం చేసుకొని ఫ్లెక్సీని తొలగించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.