వైఎస్సార్​ ​టీపీ చీఫ్ షర్మిల నైట్ హాల్ట్ షెల్టర్ కూల్చివేతపై ఆగ్రహం

వైఎస్సార్​ ​టీపీ చీఫ్ షర్మిల నైట్ హాల్ట్ షెల్టర్ కూల్చివేతపై ఆగ్రహం

ధర్మారం, వెలుగు: ‘పాదయాత్ర చేస్తున్న వారిని అడ్డుకొని దాడులు చేయడం కాదు.. నియోజకవర్గంలో అభివృద్ధి చేసి చూపించాలి’ అని వైఎస్సార్​​టీపీ చీఫ్ షర్మిల అన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం చామనపల్లి వద్ద షర్మిల పాదయాత్రను ఆదివారం టీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. చామనపల్లి శివారులో నైట్ హాల్ట్ కోసం వేసిన టెంట్లను తొలగించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వచ్చి గొడవ చేస్తున్న వారిని చెదరగొట్టారు. అనంతరం షర్మిల పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న తనపై మహిళ అని కూడా చూడకుండా దాడులకు దిగుతారా అని ప్రశ్నించారు.

మంత్రి కొప్పుల ఈశ్వర్​ దత్తత తీసుకున్న గ్రామంలో ఎంత అభివృద్ధి జరిగిందో కన్పిస్తున్నదని,  డబుల్​ బెడ్​ రూం ఇళ్లు ఇస్తామని ఇవ్వలేదని, కనీసం రోడ్లు కూడా వేయలేకపోయారని విమర్శించారు. ‘గ్రామంలో వరదలు వస్తే ఆదుకున్న పాపాన పోతలేరు. ముంపు గ్రామంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తే పట్టించుకుంటలేరు. ప్రజలకు సేవ చేయాలని అధికారం ఇస్తే  పని చేస్తలేరు.. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి వస్తే మా ఫ్లెక్సీలు పీకేస్తరా.. మా కార్యకర్తల మీద దాడులకు దిగుతారా.. దమ్మున్న నాయకుడైతే ప్రజల కోసం పని చేయాలి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని సూచించారు. టీఆర్ఎస్ నాయకులు చేసే దాడులకు వైఎస్ఆర్​టీపీ భయపడదని, ప్రజల కోసం పోరాటం చేస్తుందని పేర్కొన్నారు.