కారు పార్టీకి నేతల ఝలక్..కాంగ్రెస్, బీజేపీలోకి జంప్

కారు పార్టీకి నేతల ఝలక్..కాంగ్రెస్, బీజేపీలోకి జంప్
  • రోజుకో చోట కాంగ్రెస్​, బీజేపీలో టీఆర్​ఎస్ నేతల చేరికలు
  • కేసీఆర్​ పట్టించుకోవడం లేదని కొందరు
  • గ్రూపు తగాదాలతో ఇంకొందరు 
  • పీకే సర్వే ఎఫెక్ట్​తో మరికొందరు
  • హైకమాండ్​పై సీనియర్ల అసంతృప్తి
  • ఏ క్షణమైనా పార్టీ మారేందుకు ఏర్పాట్లు

హైదరాబాద్, వెలుగు: ఎన్నికలకు ఏడాదిన్నర టైమ్ ఉండగానే రాజకీయ పార్టీల్లో చేరికలు మొదలయ్యాయి. అధికారంలో ఉన్న టీఆర్​ఎస్​ నుంచి ఇతర పార్టీలకు వలసలు జోరందుకున్నాయి. గులాబీ పార్టీలో రోజుకో చోట అసంతృప్తులు, అలకలు బయట పడుతున్నాయి. సీఎం కేసీఆర్​ అపాయింట్​మెంట్​ దొరకడం లేదని,  పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ తమకు టైమ్​ ఇవ్వడం లేదని కొందరు ముఖ్య నేతలు ఇప్పటికే ఇతర పార్టీల్లో చేరారు. గ్రూపులు, లీడర్ల మధ్య విభేదాలతో జిల్లాల్లోని ఇంకొందరు ముఖ్యనేతలు టీఆర్​ఎస్​కు  దూరంగా ఉంటున్నారు.  ప్రశాంత్​ కిశోర్​ సర్వేతో  తమ టికెట్లు కట్​ అవుతాయనే టెన్షన్​తో మరికొందరు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు.  నియోజకవర్గ లీడర్లు మొదలు మండల స్థాయి నేతలు, గ్రామ సర్పంచులు ఇట్లా చాలా మంది వలసబాట పడుతుండటంతో రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్నది. టీఆర్​ఎస్​ అసంతృప్త లీడర్లను తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్​, బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. చేరికల కమిటీలను ఏర్పాటు చేసుకున్నాయి. రోజుకోచోట జాయినింగ్​ ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నాయి. 

కాంగ్రెస్‌‌లోకి..

ఇటీవల చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌‌ఎస్‌‌ సీనియర్‌‌ నేత నల్లాల ఓదెలు ఢిల్లీలో ప్రియాంకాగాంధీ సమక్షంలో కాంగ్రెస్‌‌లో చేరారు. ఆయనతో పాటు ఆయన భార్య మంచిర్యాల జెడ్పీ చైర్‌‌ పర్సన్‌‌ నల్లాల భాగ్యలక్ష్మి కాంగ్రెస్​లో చేరారు. చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌‌ వేధింపులతోనే తాము పార్టీ వీడుతున్నట్టు ఓదెలు దంపతులు ప్రకటించారు. అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే, టీఆర్​ఎస్​ నేత తాటి వెంకటేశ్వర్లు ఇటీవల కాంగ్రెస్​ గూటికి చేరుకున్నారు. ‘టీఆర్‌‌ఎస్‌‌ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌ చాలా జూనియర్‌‌’ అంటూ కామెంట్లు చేసిన మరుసటి రోజే ఆయన పార్టీని వీడారు. జీహెచ్​ఎంసీ మేయర్​ సీటు ఆశించి భంగపడ్డ ఖైరతాబాద్​ టీఆర్​ఎస్​ కార్పొరేటర్​ విజయారెడ్డి  కూడా కాంగ్రెస్​లో చేరారు. పీజేఆర్​ కూతురైన విజయారెడ్డి కాంగ్రెస్​లో  చేరటం టీఆర్​ఎస్​కు షాక్​ ఇచ్చినట్లయింది. తనను ఒక డివిజన్‌‌కే పరిమితం చేయడంపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ టీఆర్‌‌ఎస్‌‌ నుంచి బయటకు వచ్చారు. టీఆర్​ఎస్​ నుంచి  తుంగతుర్తి టికెట్​ ఆశించి గత ఎన్నికల్లో రెబెల్​గా పోటీ చేసిన వడ్డెపల్లి రవి తాజాగా కాంగ్రెస్ లో చేరారు. 

సీనియర్లలో అసహనం

టీఆర్​ఎస్​ పెద్దల తీరుపై పార్టీలోని సీనియర్లు అసహనంతో ఉన్నారు.  మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌‌ రావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వేముల వీరేశం, జలగం వెంకట్‌‌రావు, పాయం వెంకటేశ్వర్లు అసంతృప్తితో ఉన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌‌ రెడ్డి అంటీ ముట్టనట్లే ఉంటున్నారని ఆయన అనుచరులు చెప్తున్నారు. ఉమ్మడి వరంగల్‌‌ జిల్లాలోనూ పలువురు నేతలు టీఆర్‌‌ఎస్‌‌పై అసంతృప్తితో ఉన్నారు. పలు నియోజకవర్గాల్లో టీఆర్​ఎస్​ పార్టీ గ్రూపులుగా విడిపోయింది. స్వయంగా కేటీఆర్‌‌ నచ్చజెప్పినా జిల్లాల్లో గ్రూపు విభేదాలు సద్దుమణగకపోవటంతో.. పార్టీ నుంచి వెళ్లిపోయే వారి సంఖ్య పెరిగిందని సొంత పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. హుజూరాబాద్‌‌ ఉప ఎన్నికకు ముందు టీఆర్‌‌ఎస్‌‌లో చేరి ఏ పదవులు దక్కని నేతలు కూడా ఇతర పార్టీల వైపు చూస్తున్నట్టు పార్టీలో చర్చ జరుగుతున్నది. 

బీజేపీలోకి...

టీఆర్​ఎస్​ పార్టీలో అవకాశాల కోసం ఎదురుచూసిన లీడర్లు విసిగి వేసారి జారుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేరు నుంచి కాంగ్రెస్‌‌‌‌ అభ్యర్థిగా పోటీ చేసిన భిక్షమయ్య గౌడ్‌‌‌‌ టీఆర్​ఎస్ లో చేరి భంగపడ్డారు. తనకు సముచిత ప్రాధాన్యమిస్తామని చెప్పిన లీడర్లు ఆ తర్వాత పట్టించుకోవటం లేదని, రెండేండ్ల పాటు అవకాశాల కోసం ఎదురు చూసిన ఆయన గులాబీ పార్టీకి గుడ్‌‌‌‌బై చెప్పి బీజేపీలో చేరారు. కనీస వేతనాల సలహా మండలి చైర్మన్‌‌‌‌గా పనిచేసిన సామ వెంకట్‌‌‌‌రెడ్డి తాజాగా టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ను వీడి బీజేపీలో చేరారు. ఇప్పటికే కుత్బుల్లాపూర్‌‌‌‌ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌ నుంచి కమల దళంలో చేరారు.

పార్టీ తీరుపై జూపల్లి అసంతృప్తి

తెలంగాణ సాధన కోసం ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చిన తనకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ హైకమాండ్‌‌‌‌పై అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్‌‌‌‌ అభ్యర్థిగా తనపై పోటీ చేసి గెలిచిన హర్షవర్ధన్‌‌‌‌ రెడ్డిని టీఆర్​ఎస్​లో  చేర్చుకొని తనను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ఆగ్రహంతో ఉన్నారు. సీఎం కేసీఆర్‌‌‌‌ నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌ పర్యటనకు, కేటీఆర్‌‌‌‌ కొల్లాపూర్‌‌‌‌ టూర్‌‌‌‌కు జూపల్లి దూరంగానే ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు తన అనుచరులతో సమావేశమైన ఆయన త్వరలోనే టీఆర్​ఎస్​కు గుడ్​బై చెపుతారనే చర్చ జరుగుతున్నది.

పీకే ఫీవర్‌‌‌‌తో కొందరు

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గట్టెక్కడమే లక్ష్యంగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌‌‌‌ కిశోర్‌‌‌‌తో టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ అగ్రిమెంట్‌‌‌‌ చేసుకుంది. నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితి, ఎమ్మెల్యేల పనితీరుపై పలు సర్వేలు చేయిస్తున్న పీకే.. ఇప్పటికే తన రిపోర్టులను కేసీఆర్​కు అందించారు. ఈ నివేదికల ఆధారంగా 40 మందికిపైగా ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని, వాళ్లకు టికెట్లు కట్‌‌‌‌ చేస్తారనే ప్రచారం జరుగుతున్నది. దీంతో కొందరు సిట్టింగ్‌‌‌‌లు, టికెట్లు ఆశిస్తున్న అభ్యర్థులు  కాంగ్రెస్‌‌‌‌, బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇతర పార్టీల్లో చేరేందుకు గ్రౌండ్‌‌‌‌ ప్రిపేర్‌‌‌‌ చేసుకుంటున్నట్టు తెలుస్తున్నది. అందుకే.. అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌‌‌‌ లో ఉన్నారని  కాంగ్రెస్​ నేతలు, బీజేపీ లీడర్లు ధీమాగా చెప్పుకుంటున్నారు.

ఓవర్​ లోడ్​ ఎఫెక్ట్

గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో పాటు, అన్ని నియోజకవర్గాల్లో ముఖ్య నేతలను టీఆర్​ఎస్​ పెద్ద ఎత్తున చేర్చుకుంది. లోక్​సభ ఎన్నికల ఫలితాలు దెబ్బతగలటంతో  ‘గులాబీ ఆకర్ష్‌‌‌‌’కు మరింత పదును పెట్టింది. దీంతో అన్ని నియోజకవర్గాల్లో కొత్తగా చేరిన వారితో కారులో లోడ్‌‌‌‌ పెరిగింది. గులాబీ కండువా కప్పేటప్పుడు లీడర్లకు ఎన్నో హామీలు ఇచ్చిన కేసీఆర్‌‌‌‌, కేటీఆర్‌‌‌‌ ఆ తర్వాత కలవడానికే టైమ్​ ఇవ్వకపోవడంతో టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌లో చేరిన నేతలు అసహనం వెళ్లగక్కుతున్నారు. ప్రత్యామ్నాయం లేకపోవటంతో ఇతర పార్టీల దిక్కులు చూస్తున్నారు.  

కాంగ్రెస్​లో చేరిన ఖమ్మం టీఆర్​ఎస్​ లీడర్లు

సోమవారం గాంధీభవన్‌‌‌‌లో ఖమ్మం రూరల్ మండలానికి చెందిన మాజీ కార్పొరేటర్ రామ్మూర్తినాయక్, మాజీ జడ్పీటీసీ భారతితోపాటు సుమారు వెయి మంది టీఆర్ఎస్ లీడర్లు కాంగ్రెస్‌‌‌‌లో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి రేవంత్ ఆహ్వానించారు. తర్వాత రేవంత్ మీడియాతో మాట్లాడారు. గిట్టుబాటు ధర ఇవ్వలేదని ఖమ్మంలో మిర్చి రైతులు నిలదీస్తే క్రిమినల్ కేసులు పెట్టి, బేడీలు వేసి అరెస్ట్ చేశారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రైతులకు అన్యాయం జరిగితే తిరగబడ్డ ప్రాంతం ఖమ్మం అన్నారు. తెగులు సోకి మిర్చి పంట నష్టపోతే కనీసం పరిహారం ఇవ్వలేదని, 22 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోతే బాధిత కుటుంబాలను పరామర్శించలేదని విమర్శించారు. మంత్రి పువ్వాడ అజయ్ మీద పోరాటం చేస్తున్న విద్యార్థులపై కేసులు పెట్టారని, ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. మంత్రిని బర్తరఫ్ చేయాల్సింది పోయి దగ్గరకు తీసుకున్నారని ఫైర్ అయ్యారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల విధానాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.