లష్కర్ ఓటమిపై ‘కారు’ నేతలు గుర్రు

లష్కర్ ఓటమిపై ‘కారు’ నేతలు గుర్రు

లష్కర్​లో టీఆర్ఎస్ ఓటమిపై పార్టీ పెద్దలు తలసానిపై గుర్రుగా ఉన్నారు. తన కుమారుడికి సీటు ఇస్తే కచ్చితంగా గెలిపించుకుంటానన్న మంత్రి  శ్రీనివాస్ యాదవ్  ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయారు. ఈ ఓటమి తలసానిపై భవిష్యత్ లో కచ్చితంగా ప్రభావం చూపుతుందని టీఆర్ఎస్​నాయకులు చర్చించుకుంటున్నారు.    అనుకూల పరిస్థితులు ఉన్నా  తనయుడిని గెలిపించలేకపోయారనే విమర్శలు వస్తున్నాయి.  లోక్ సభ నియోజకవర్గం పరిధిలో ఉండే మంత్రులు, ఎమ్మెల్యేలకు ఎంపీ అభ్యర్థుల గెలుపు బాధ్యతలను సీఎం కేసీఆర్ అప్పగించారు. పార్టీ అభ్యర్థిని గెలిపించకపోతే సంబంధిత మంత్రులపై చర్యలు ఉంటాయని ఎన్నికలకు ముందు పరోక్షంగా హెచ్చరించారు. దీంతో తలసాని విషయంలో టీఆర్ఎస్ అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. తలసాని సైతం ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీ టికెట్ ప్రకటించిన నాటి నుంచే ఆయన గెలుపు కోసం తీవ్రంగా కృషి చేసినప్పటికీ సీన్ మొత్తం రివర్స్ అయ్యింది.

అతి నమ్మకమే కొంప ముంచిందా?

సికింద్రాబాద్ లో సాయికిరణ్ యాదవ్ ఓటమికి అతి నమ్మకం కూడా కారణమైనట్లు టీఆర్ఎస్​లో చాలా మంది నేతలు అంటున్నారు.  అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ పరిధిలోని ఏడు  స్థానాల్లో ఆరు టీఆర్ఎస్ గెలిచింది. సికింద్రాబాద్ ఎంపీ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి సైతం అంబర్ పేట అసెంబ్లీ  నియోజకవర్గం నుంచి  ఓడిపోయారు. దీంతో అంబర్ పేటలో ఓడిపోయిన అతను సికింద్రాబాద్ లో గెలవటం సాధ్యం కాదన్న భావన టీఆర్​ఎస్​ నేతల్లో అతి విశ్వాసం పెంచింది.  తలసాని అందరినీ కలుపుకుపోయినప్పటికీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు క్షేత్ర స్థాయిలో పార్టీ గెలుపు కోసం కృషి చేయలేదని తెలుస్తోంది. ఈ విషయాన్ని గమనించి అలర్ట్ కావాల్సిన మంత్రి సైతం పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శలు వస్తున్నాయి.  పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు పైపైన పనిచేసినట్లు భావిస్తున్నారు. కార్పొరేటర్లయితే ప్రచారంలో ఎక్కడా కనిపించలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. వీటిని పట్టించుకోకుండా తలసాని అతి విశ్వాసంతో ముందుకెళ్లడం కూడా ప్రతికూల ప్రభావం చూపిందంటున్నారు.

అక్కడా బీజేపీదే ఆధిక్యం

సొంత నియోజకవర్గం సనత్ నగర్ లోనూ తలసాని పార్టీకి ఆధిక్యం తేవటంలో విఫలమయ్యారు.  అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కన్నా ఈసారి తక్కువ వచ్చాయి. బీజేపీకి సనత్ నగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ కన్నా 14 వేల ఓట్లు అధికంగా రావడంతో తలసాని కంగుతిన్నారు. తన నియోజకవర్గంలోనే ఓట్లు తక్కువ రావటంతో ఓటమికి ఇతరులను బాధ్యులను చేయలేని పరిస్థితి ఏర్పడింది. అంబర్ పేట, ముషీరాబాద్ -నియోజకవర్గాల్లో బీజేపీకి భారీగా ఓట్లు పడ్డాయి. ఈ ఎన్నికల్లో ఎంఐఎం, వైసీపీ పోటీ చేయకపోయినప్పటికీ ఆ పార్టీ ల ఓట్లను బదిలీ చేసుకోవటంలో తలసాని విఫలమయ్యారన్న ఆరోపణలు వస్తున్నాయి.

సీఎం సభ సక్సెస్ చేయకపోవటంపైనా విమర్శలు

ఎన్నికల ప్రచార సభ సమయంలోనే సీఎం కేసీఆర్ అసంతృప్తికి లోనయ్యారు. ప్రతిష్ఠాత్మకంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 4 లోక్ సభ నియోజకవర్గాల ప్రచారం కోసం సీఎం కేసీఆర్ సభను ఏర్పాటు చేస్తే  విజయవంతం చేయటంలో నేతలంతా విఫలమయ్యారు. కీలక బాధ్యతలు నిర్వహించిన తలసాని సైతం జన సమీకరణ చేయలేకపోవటంతో సీఎం కేసీఆర్ సభను రద్దు చేసుకున్నారు. ఇదే సభలో పార్టీలోని ఓ నేతపై తలసాని అసభ్య పదజాలం వాడారని వార్తలు వచ్చాయి. సభ విఫలమైన నాటి నుంచి పార్టీ శ్రేణులు పెద్దగా సాయికిరణ్ యాదవ్ విజయం కోసం శ్రమించలేదని తెలుస్తోంది. అయితే గ్రేటర్​లో పాగా వేయాలని పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్న టీఆర్ఎస్ కు సికింద్రాబాద్ ఓటమి షాక్ కు గురిచేసింది. దీంతో తలసానిపై ఈ ఓటమి ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్నది వచ్చే మంత్రివర్గ విస్తరణ నాటికి తేలుతుందని చాలా మంది అంచనా వేస్తున్నారు.