TRS​ నేతల ఉరుకులు: మెంబర్​షిప్​ 60% లక్ష్యం

TRS​ నేతల ఉరుకులు: మెంబర్​షిప్​ 60%  లక్ష్యం

నెలాఖరులోగా లక్ష్యం పూర్తి చేయడానికి టీఆర్​ఎస్​ నేతల ఉరుకులు

టీఆర్‌‌ఎస్‌‌  మెంబర్​షిప్  లక్ష్యాన్ని చేరుకునేందుకు పార్టీ ఇన్‌‌చార్జులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పరుగులు పెడుతున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు గడువు శనివారంతోనే ముగిసింది. ఆ రోజు సాయంత్రం వరకు టార్గెట్​లో 60 శాతం మేర సభ్యత్వాలు మాత్రమే పూర్తయినట్టు సమాచారం. కొన్ని సెగ్మెంట్ల పరిధిలో మాత్రం 80 శాతానికిపైగా మెంబర్​షిప్‌‌ అయినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో నిర్ణీత సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని పార్టీ హైకమాండ్​ ఆదేశించింది. సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇన్​చార్జులతో పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ సోమవారం ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్‌‌లో సమావేశం అవుతున్నారు. మిగతా టార్గెట్‌‌ సాధించడానికి తీసుకోవాల్సిన చర్యలను వివరించనున్నారు.

60 లక్షల లక్ష్యంతో..
ఒక్కో సెగ్మెంట్​లో 50 వేల సభ్యత్వాల చొప్పున రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో 59.50 లక్షల మెంబర్​షిప్​  చేయాలని.. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మరో 50 వేల సభ్యత్వాలు చేసి, మొత్తంగా 60 లక్షల మెంబర్​షిప్​ నమోదు చేయాలని టీఆర్ఎస్​ టార్గెట్​గా పెట్టుకుంది. పార్టీ ఎన్నారై శాఖలున్న 40 దేశాల్లోనూ మెంబర్​షిప్‌‌లు చేయిస్తోంది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్​ జూన్‌‌ 27న తెలంగాణ భవన్‌‌లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి, సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. జూలై 20 తేదీలోగా మెంబర్​షిప్​ డ్రైవ్‌‌ పూర్తి చేయాలని, ఆ వెంటనే గ్రామాల్లో గ్రామ కమిటీలు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో డివిజన్‌‌, వార్డు కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనుబంధ సంఘాలకు కార్యవర్గాలను నియమించాలని సూచించారు.

ఇంకా దూరమే..
2017లో చేపట్టిన టీఆర్‌‌ఎస్‌‌ సభ్యత్వ నమోదులో 75 లక్షల టార్గెట్​ పెట్టుకోగా 43 లక్షల మెంబర్​షిప్‌‌లు అయ్యాయి. అయితే తమకు 75 లక్షల మంది సభ్యులున్నారని పార్టీ నేతలు చెప్పుకొన్నారు. పార్టీ రాష్ట్ర ఆఫీస్‌‌కు 43 లక్షల సభ్యత్వం పుస్తకాలు మాత్రమే వచ్చాయని, ఆన్‌‌లైన్‌‌లోనూ అన్నే మెంబర్​షిప్‌‌లు అప్‌‌లోడ్‌‌ అయ్యాయని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదే విషయాన్ని వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌ కేటీఆర్‌‌ సైతం అంగీకరించారు. ఈసారి కూడా దాదాపు అదే సంఖ్యలో మెంబర్​షిప్​లు అవుతున్నట్టు సమాచారం. పార్టీ నేతలు, ముఖ్య కార్యకర్తలు మినహా మరెవరూ డబ్బులు చెల్లించి టీఆర్‌‌ఎస్‌‌ సభ్యత్వాన్ని తీసుకునేందుకు ముందుకు రావడం లేదని ఆ బాధ్యతలు చూస్తున్న సీనియర్‌‌ నాయకుడొకరు చెప్పారు. స్థానిక ముఖ్య నేతలతో కలిసి ఇల్లిల్లూ తిరుగుతూ.. ఆధార్‌‌ నంబర్లు తీసుకుని మెంబర్​షిప్‌‌ రశీదులు ఇస్తున్నామన్నారు. గతంతో పోలిస్తే టీఆర్ఎస్​ సభ్యత్వాలు తీసుకుంటున్న యువత సంఖ్య బాగా తగ్గిందని అన్నారు. బీజేపీ మెంబర్​షిప్‌‌  డ్రైవ్​ కూడా జరుగుతుండటంతో తమ టార్గెట్‌‌ రీచ్‌‌ కాలేకపోతున్నట్టు వ్యాఖ్యానించారు.

సభ్యత్వ నమోదు ద్వారా పార్టీకి ఇప్పటివరకు సమకూరిన రూ.7.5 కోట్లలో చాలా వరకు ఎమ్మెల్యేలే సొంతంగా చెల్లించారని కొందరు ద్వితీయ స్థాయి నేతలు చెబుతున్నారు. సభ్యత్వ నమోదు సొమ్మును చెల్లించడం కోసం తెలంగాణ భవన్​కు వచ్చిన ఆ నేతలను పలకరించగా.. ‘పైసలిచ్చి ఎవరు సభ్యత్వం తీసుకుంటారు, మా సారే డబ్బులు పంపారు’ అని పేర్కొన్నారు.

మిగతా మెంబర్షిప్ ఎట్లా?

పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ 23 రోజులుగా కొనసాగుతోంది. ఇప్పటికే వీలైనంత వరకు మెంబర్​షిప్​లు ఇచ్చేశామని, మిగతా టార్గెట్‌ ఎలా నింపాలో తెలియడం లేదని ఒక నేత అన్నారు. తొలిదశలో పార్టీలో యాక్టివ్‌గా ఉండేవారికి, తర్వాతి ఫేజ్‌లో ఇంటింటికీ వెళ్లి సభ్యత్వాలు చేయించామని చెప్పారు. కార్మిక సంఘాలు, వివిధ యూనియన్ల వారిని గంపగుత్తగా పార్టీ మెంబర్లుగా చేర్పించామన్నారు. అయితే కొన్ని కుటుంబాల వాళ్లు పార్టీ మెంబర్​షిప్‌ తీసుకోవడానికి ఇష్టపడటం లేదని.. తమకు రాజకీయాలతో సంబంధం లేదని, వదిలేయాలని ముఖం మీదే చెప్తున్నారని తెలిపారు. టార్గెట్​లో కనీసం 80 శాతమైనా పూర్తి చేయాలని సభ్యత్వ నమోదు ఇన్‌చార్జులను హైకమాండ్​ ఆదేశించినట్టు తెలిసింది. కనీసం గతసారి కన్నా ఏడెనిమిది లక్షల సభ్యత్వాలు ఎక్కువగా చేయించాలని స్పష్టం చేసినట్టు సమాచారం. దీంతో ప్రజాప్రతినిధులు, నేతలు పరుగులు పెడుతున్నారు.

క్రియాశీల సభ్యత్వమే కావాలి

టీఆర్ఎస్​లో యాక్టివ్‌గా తిరిగే కార్యకర్తలంతా తమకు క్రియాశీల సభ్యత్వమే కావాలని పట్టుబడుతున్నారు. సాధారణ సభ్యత్వం తమకెందుకని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. డాక్టర్లు, ప్రైవేట్‌ టీచర్లు, లాయర్లు, ఇతర రంగాల వారికి క్రియాశీల సభ్యత్వాలు ఎందుకు ఇస్తున్నారని, వారు పార్టీ కార్యక్రమాల్లో ఎప్పుడైనా పాల్గొంటున్నారా అని పలుచోట్ల నిలదీస్తున్న ఘటనలూ జరుగుతున్నాయి.