‘నేనే సీఎం’ అని కేసీఆర్ చెప్పినప్పుడల్లా.. త్వరలోనే కేటీఆర్ ముఖ్యమంత్రి కావడానికి ముహూర్తం రెడీ అవుతోందంటూ టీఆర్ఎస్ లీడర్లు చెప్పడం మొదలుపెడుతున్నారు. తానే సీఎం అని కేసీఆర్ అసెంబ్లీలో చెప్పినా, ‘బాజాప్తా చెప్పినకదా ఇంకెందుకు?’ అని కేసీఆర్ స్వయంగా అన్నా కూడా దాని అంతరార్థం కేటీఆర్ పట్టాభిషేకం గురించేనన్న భావమే తీస్తున్నారు. తాజాగా మున్సిపల్ ఎలక్షన్ల రిజల్ట్ వచ్చిన రోజున కూడా సీఎం తానేనని కేసీఆర్ మరోసారి చెప్పినా.. కొందరు మంత్రులు ‘ఇక సీఎం కేటీఆరే, త్వరలోనే ముహూర్తం ఉండవచ్చు’ అంటున్నారు. మున్సిపోల్స్‌లో గెలుపుతో టీఆర్ఎస్లో జోష్ కనిపిస్తోంది. ఈ జోష్‌లోనే మంత్రులు, ఎమ్మెల్యేలు కేటీఆర్ ప్రమోషన్ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.
గెలుపు జోష్‌లో..
రాష్ట్రం ఏర్పాటయ్యాక జరిగిన తొలి మున్సిపల్‌ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఇదే గెలుపు జోష్‌లో తనయుడు కేటీఆర్ కు పాలనా పగ్గాలు అప్పగించేందుకు సీఎం కేసీఆర్ లైన్ క్లియర్ చేస్తున్నారని, దీనిపై ఇప్పటికే ప్రెస్మీట్లో సిగ్నల్ ఇచ్చారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు రాష్ట్రమంతటా కూడా ఇదే అంశంపై చర్చ జరుగుతోంది. ఇటీవలి ప్రెస్మీట్లో సీఎం చెప్పిన మాటలతోపాటు తాజాగా మంత్రులు, ఎమ్మెల్యేల మాటల ఇదే ఇండికేషన్ ఇస్తున్నాయి. కేసీఆర్ రిజల్ట్స్ రోజున మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నేను ఢిల్లీకి వెళ్లాల్సి వస్తే.. ఇక్కడ పిల్లలు తయారయ్యారు. రెడీగానే ఉన్నారు.” అని కేటీఆర్ సిద్దంగా ఉన్నారనే అర్ధం వచ్చేటట్లు చెప్పారంటూ పార్టీ నేతలు అంటున్నారు. ‘‘సమయ సందర్భాలను బట్టి నిర్ణయాలుంటాయి. విష్ ఫుల్ థింకింగ్‌లో మంత్రులు కేటీఆర్ సీఎం కావాలని కోరుకొని ఉండొచ్చు..’’ అని కేసీఆర్పేర్కొన్న విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. ఆ మరుసటి రోజు నుంచే పార్టీ నేతలు ‘కాబోయే సీఎం కేటీఆర్..’ అంటూ జై కొట్టడం కనిపిస్తోంది. ఇప్పటికే పలుమార్లు ఈ మాట చెప్పిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్.. మంగళవారం కూడా అదే తరహాలో మాట్లాడారు. ‘‘కేసీఆర్ లాంటి నాయకుడు దేశానికి అవసరమని అంటున్నారు’’ అని పేర్కొన్నారు. ‘‘మున్సిపల్ ఎన్నికల్లో పార్టీని గెలిపించిన కేటీఆర్‌కు తప్పనిసరిగా ప్రమోషన్ వస్తుంది’’ అని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి చెప్పారు.
