
రాష్ట్రంలో పాలన పడకేసిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. సర్పంచ్ లకు రాష్ట్రం నుంచి నిధులు లేవని.. కేంద్రం నిధులు సద్వినియోగం చేసుకోవడం లేదన్నారు. కూట్లే రాయి తీయలేనోడు..ఏట్లో రాయి తీస్తా అన్నట్టు కేసీఆర్ మాటలు ఉన్నయని ఎద్దేవా చేశారు. తెలంగాణ అభివృద్ధిలో ఆమడదూరంలో ఉంటే..రాయలసీమ రతనాల సీమ చేస్తానని కేసీఆర్ అంటున్నాడని విమర్శించారు. కేసీఆర్ కుటుంబ పాలన, అవినీతిపై బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. రాష్ట్రానికి కల్వకుంట్ల పాలననుండి..బీజేపీ విముక్తి కల్పిస్తుందన్నారు.
తెలంగాణ రాష్ట్రం మీద అమిత్ షా ప్రత్యేక దృష్టి సారించారని.. సెప్టెంబర్ 17న అమిత్ షా హైదరాబాద్ లో పర్యటిస్తారని చెప్పారు. 18న నడ్డా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీలోకి చేరికలు ఉంటాయన్నారు లక్ష్మణ్. తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించే భాద్యత అమిత్ షా తీసుకుంటారని అన్నారు. టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా బీజేపీతో టచ్ లో ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రత్యామ్నాయ శక్తి బీజేపీ అని ప్రజలు విశ్వసిస్తున్నారని అన్నారు లక్ష్మణ్.