పనులు కాకపోతే ప్రజల్లోకి పోవుడెట్ల!: టీఆర్​ఎస్​ ఎమ్మెల్యేల గోడు

పనులు కాకపోతే ప్రజల్లోకి పోవుడెట్ల!: టీఆర్​ఎస్​ ఎమ్మెల్యేల గోడు
  • అసెంబ్లీ​ సాక్షిగా గళమెత్తిన అధికార పార్టీ సభ్యులు
  • ఏమని చెప్పి ఓట్లడగాలి?
  • నియోజక వర్గాలకు ఏ ముఖం పెట్టుకొని వెళ్లాలి
  • రోడ్లు, హాస్పిటళ్లు.. వరుసగా  సమస్యల ఏకరువు
  • సీఎం దృష్టికి తీసుకెళుతామంటూ మంత్రుల జవాబు

హైదరాబాద్​, వెలుగు:

మా నియోజకవర్గాల్లో ఏ ముఖం పెట్టుకొని తిరగాలి..? ఓటర్లకు ఏమని చెప్పుకోవాలి… అని స్వయంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు గోడు వెళ్లబోసుకుంటున్నారు. తమ నియోజకవర్గ సమస్యలను పట్టించుకోకుంటే ప్రజలకేం జవాబు చెప్పుకుంటామని లోలోపల కుమిలిపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల్లో ఒకటీ రెండైనా నెరవేర్చకపోతే, మున్సిపల్​ ఎన్నికలప్పుడు జనంలోకి పోవుడెట్లా అని నిలదీస్తున్నారు. అసెంబ్లీ జీర్​ అవర్​లో సమస్యలను ఏకరవు పెట్టేందుకు  పోటీ పడుతుండటం ప్రభుత్వ వర్గాల్లో  చర్చనీయాంశంగా మారింది. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవటం లేదని,  గత్యంతరం లేకనే అసెంబ్లీలో మాట్లాడుతున్నామని  ఒక సీనియర్​ ఎమ్మెల్యే అన్నారు.

ఎన్నికలప్పుడు హామీలు, ఆశలు కల్పించి ఓట్లు అడిగి గెలిచామని, ఇప్పుడు గ్రామాలకు వెళ్లే పరిస్థితి లేదని కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారంనాడు కొందరు ఎమ్మెల్యేలు  ఏకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినంత పనిచేశారు. మంగళవారం కూడా టీఆర్‌‌ఎస్‌‌ సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీసినంత పని చేశారు.  జీరో అవర్​లో 37 మంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలోని సమస్యలను లేవనెత్తారు.  సొంత పార్టీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేక మంత్రులు ఇబ్బంది పడ్డారు. ‘పరిశీలిస్తాం.. పరిగణలోకి తీసుకుంటాం. సీఎం దృష్టికి తీసుకెళ్తాం’ అని  ఒక్క మాటతోనే బదులిచ్చారు.

జీరో అవర్​ భలే ఛాన్స్

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తీరు మారిపోయింది. గడిచిన అయిదేళ్లు జీరో అవర్​ లేకుండానే సమావేశాలు  జరిగాయి. చాలాకాలం తర్వాత ఈ బడ్జెట్​ సమావేశాల్లో జీరో అవర్​  పునరుద్ధరించినట్లయింది. సభా నిబంధనల ప్రకారం జీరో అవర్​లో ఒక్కో  సభ్యుడు ఒక సమస్యను మాత్రమే సంబంధిత శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుంది.

కానీ ఒక్కే ఎమ్మెల్యే మూడు నాలుగు సమస్యలు ప్రస్తావించేందుకు ఆరాట పడుతున్నారు.  టీఆర్​ఎస్​ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గాలకు నిధులేమీ కేటాయించలేదు. నియోజకవర్గ అభివృద్ధి పథకం (సీడీపీ) కింద ఒక్కో ఎమ్మెల్యేకు నిర్దేశించిన రూ.3 కోట్ల నిధులను విడుదల చేయలేదు. దీంతో తమ ప్రాంత ప్రజలు, అనుచరులు, పార్టీ కార్యకర్తలు అడిగే చిన్న సమస్యలు, ఇచ్చే అర్జీలను పరిష్కరించలేకపోతున్నామని ఎమ్మెల్యేలు చెబుతున్నారు.

రోడ్లు బాగు చేయండి సారూ

సభలో సభ్యులు లేవనెత్తిన వాటిల్లో ఎక్కువగా రోడ్ల సమస్యలే ఉన్నాయి. వైద్య, విద్య, నీటిపారుదల సమస్యలు సభ దృష్టికి తెచ్చినా ఎక్కువగా రోడ్లపైనే మాట్లాడారు. అనేక చోట్ల నిధులు విడుదల చేయకపోవడంతోనే పనులు ఆగిపోతున్నాయని ప్రస్తావించారు. రోడ్లతోపాటు రైల్వే ఓవర్‌‌ బ్రిడ్జి, అండర్‌‌ ఓవర్‌‌ బ్రిడ్జి, అండర్‌‌పాస్‌‌లు నిర్మించాలని ఎక్కవ మంది ఎమ్మెల్యేలు ఏకరువు పెట్టారు. కొత్త జిల్లాలు, మండలాల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావించారు.

అసెంబ్లీలో సభ్యులు లేవనెత్తిన సమస్యలు

సుంకె రవిశంకర్‌‌, చొప్పదండి : బోయినపల్లి, కుదురుపాక రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. త్వరగా పనులను పూర్తి చేయించాలి .

ఉపేందర్‌‌ రెడ్డి, పాలేరు : మా దగ్గర కూడా రోడ్లు బాలేదు. బిల్లులు పెండింగ్‌‌లో ఉన్నాయి. పేమెంట్స్‌‌ విడుదల చేయాలి. అందరూ ఇబ్బందులు పడుతున్నరు.

ఆత్రం సక్కు, అసిఫాబాద్‌‌: ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం సహకరించాలి. వైద్యం, విద్యలో చాలా వెనుకబడి ఉన్నాం.

గండ్ర వెంకటరమణారెడ్డి, భూపాలపల్లి : భూపాలపల్లిలో వంద పడకల ఆస్పత్రి కట్టారు. దీనికి సిబ్బంది, మౌలిక సదుపాయాలు లేక ప్రారంభానికి నోచుకోలేదు. వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలి.

అబ్రహం, ఆలంపూర్‌‌: ఆలంపూర్‌‌ ఏపీ బోర్డర్‌‌లో ఉంది. ఇక్కడ పేషెంట్స్‌‌ కర్నూలు పోతే అక్కడ చూడట్లేదు. ఆలంపూర్‌‌, గద్వాల వారికి ఏపీలో కూడా ఆరోగ్య శ్రీ కూడా అమలయ్యేలా చొరవ తీసుకోవాలి.  మహబూబ్‌‌నగర్‌‌ ఆస్పత్రిలో స్పెషలిస్ట్‌‌ డాక్టర్లు ఉండేలా చూడాలి.

గొంగిడి సునీత : ఆలేరు వద్ద జాతీయ రహదారి నిర్మిస్తున్నారు. దీంతో ప్రతీ గ్రామానికి రోడ్డు కట్ అవుతున్న ఆర్‌‌ అండ్‌‌ బీ రోడ్డును నేషనల్‌‌ హైవే వాళ్లు పట్టించుకోవడంలేదు. వంగపల్లి నుంచి వయా మోటకొండూరు, మోత్కూరు ఐదు మండలాలకు కనెక్టివిటీ రోడ్డు అది. ఎత్తు పెంచి రోడ్లు నిర్మిస్తున్నారు. అండర్‌‌పాస్‌‌ కోసం తప్పనిసరిగా నిధులు మంజూరు చేయాలి.

భేతి సుభాష్‌‌ రెడ్డి, ఉప్పల్‌‌: రోడ్లు ఇబ్బందిగా ఉన్నాయి. భూసేకరణ చేయాల్సి ఉంది. నిధులు విడుదల చేస్తే అది త్వరగా చేయవచ్చు. వరంగల్‌‌ రోడ్డు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

చిరుమర్తి లింగయ్య, నకిరేకల్‌‌ : చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయానికి ప్రతీ అమవాస్యకు 25వేల మంది దాకా వస్తారు. అక్కడ ఒకటే రోడ్డు ఉంది. రాకపోకలకు ఇబ్బంది అవుతోంది. ఘాట్‌‌ రోడ్డు వేయాలి.

రాజేందర్‌‌ రెడ్డి, నారాయణపేట : నారాయణపేట జిల్లా ఏర్పాటై 8నెలలు అవుతోంది, వివిధ అధికారులు అడ్జస్ట్‌‌మెంట్‌‌ బేసెస్‌‌పైనే ఉన్నారు. మా జిల్లాకు పర్మినెంట్‌‌ పోస్టులు కేటాయించాలి. ఫర్నిచర్‌‌, ఫండ్స్‌‌ ఇతర సౌకర్యాలు లేవు. వేతనాలు ఉమ్మడి మహబూబ్‌‌నగర్‌‌ జిల్లా ద్వారానే వస్తున్నాయి.

 నోముల నర్సింహయ్య, నాగార్జున సాగర్‌‌: నెల్లికల్‌‌ లిఫ్ట్‌‌ను పూర్తిగా మంజూరు చేశారు. పరిపాలనా ఆమోదం మాత్రమే ఉంది. ఆమోదం ఇవ్వాలి. కృష్ణానది పక్కనే ఉన్నా నీరు రావడంలేదు.

అంజయ్య యాదవ్‌‌, షాద్‌‌నగర్‌‌ : చటాయిపల్లి ఆర్వోబీ వద్ద నిర్మాణం కాకవపోడంతో గంటల తరబడి ట్రాఫిక్‌‌తో ఇబ్బందులు పడుతున్నారు. ఐదేళ్ల నుంచి ప్రయత్నం చేస్తే మంజూరు అయ్యింది. డబ్బులు విడుదల చేస్తే పనులు ప్రారంభం అవుతాయంటున్నారు. నోట్‌‌ చేసుకోవడం కాదు. అక్కడికి సందర్శించి చూడాలి.

ఆళ్ల వెంకటేశ్వర్లు : డబుల్‌‌ రోడ్డుకు సంబంధించి మూడున్నర సంవత్సరాల క్రితం మంజూరైన ఇంకా టెండర్లు కంప్లీట్‌‌ కాలేదు. ఇబ్బందులు పడుతున్నారు. వేముల నుంచి దేవరకద్ర వరకు గల రోడ్డు  వర్క్‌‌ మొదలు కాలేదు.

మనోహర్‌‌ రెడ్డి, పెద్దపల్లి : నియోజకవర్గంలో నిధులు లేక నిరుపయోగంగా ఉంది. రైల్వే త్రిబుల్‌‌ లైన్లు వస్తున్నాయి. ఐదు ఓవర్‌‌ బ్రిడ్జిలు ప్రపోస్‌‌ చేశారు.చర్యలు తీసుకోవాలి.

కేసీఆర్ కిట్లూ ఇస్తలేరు

ఎమ్మెల్యే విఠల్‌‌ రెడ్డి

ముథోల్‌‌  హాస్పిటల్​లో అయిదేళ్లుగా ఆపరేషన్‌‌ థియేటర్‌‌ మూలనపడింది. అంబులెన్స్‌‌ లేదు. డెలీవరీలు  కావడంలేదు. కేసీఆర్‌‌ కిట్‌‌ ఇవ్వటం లేదు. దాన్ని అప్‌‌గ్రేడ్‌‌ చేయాలి. లోకేశ్వరం దగ్గర  అర్లీ బ్రిడ్జి కూలిపోయే స్థితిలో ఉంది, తొందరగా నిధులు మంజూరు చేయాలి…

– మంగళవారం అసెంబ్లీలో ముథోల్‌‌ ఎమ్మెల్యే విఠల్‌‌ రెడ్డి

 

 

రోడెక్కాలంటే భయం భయం

బోథ్‌‌ నియోజవర్గంలో కరంజి నుంచి గుబిడి గ్రామానికి 8 కిలోమీటర్ల దూరం. ఇప్పటికీ రోడ్లు లేదు. వర్షకాలం వచ్చిందంటే భయం భయం. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఆ ఊరోళ్లు ఓట్లు వేయకుండా తీర్మానం చేశారు.  ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

– బోథ్‌‌ ఎమ్మెల్యే బాపూరావు రాథోడ్​

కొన్ని నిధులైనా ఇవ్వాలే

విద్యాసాగర్‌‌రావు

కోరుట్లలో వంద పడకల హాస్పిటల్​  నిర్మిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చాం. ఇప్పటికీ పనులు మొదలు కాలేదు. ఇలాగైతే మున్సిపల్‌‌ ఎన్నికల్లో ఓటర్లకు ఏం చెప్పుకోవాలి. టీఆర్ఎస్‌‌ మొదటి ప్రభుత్వంలో కూడా అడిగినం. రోడ్లపై నడవలేని పరిస్థితి ఉంది. మొన్న ఎన్నికల్లో నాతో వంద రూపాయల స్టాంప్‌‌ పేపర్‌‌పై సంతకం పెట్టించుకున్నరు. ఆర్నెల్లలో రోడ్డు వేస్తేనే ఓట్లు వేస్తమన్నారు. కొన్ని నిధులైనా ఇవ్వాలి.

సోమవారం అసెంబ్లీలో  కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌‌రావు