
- తిట్లు దాటి తన్నుకునే దాకా ఫైట్ చాలెంజ్
- రాష్ట్రంలో హీటెక్కిన డ్రగ్స్ పాలిటిక్స్
- కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నేతల ఫైటింగ్
- రేవంత్ ఇంటిని ముట్టడించిన టీఆర్‌ఎస్వీ
- కర్రలతో తరిమిన కాంగ్రెస్ నేతలు
- రేవంత్ తీరు మారకుంటే మా స్టైల్ మారుతది: ఎమ్మెల్యేలు గువ్వల, గ్యాదరి హెచ్చరికలు
- సారీ చెప్పకుంటే దాడులు: టీఆర్ఎస్ యూత్ వింగ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మొదలైన వైట్ చాలెంజ్ కాస్తా ఫైట్ చాలెంజ్‌గా మారుతున్నది. విమర్శల స్థాయిని దాటి మంగళవారం కొట్టుకునేదాకా పోయింది. మంత్రి కేటీఆర్‌పై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీఆర్‌ఎస్వీ నాయకులు జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవడంతో ఇరు పక్షాలూ బాహాబాహీకి దిగాయి. ఒక దశలో టీఆర్‌ఎస్వీ నాయకులను కాంగ్రెస్ నేతలు కొంతదూరం వెంటబడి తరిమారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
ఆ తర్వాత కూడా ఇరు పార్టీల లీడర్లు పరస్పరం విమర్శలు, ఆరోపణలతో రాజకీయ వేడిని మరింత పెంచారు. రాష్ట్రంలో కొన్ని రోజులుగా డ్రగ్స్ చుట్టూ తిరుగుతున్న రాజకీయాలు మంగళవారం మరింత హీటెక్కాయి. డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న సినీ నటులతో కేటీఆర్‌కు సంబంధాలున్నాయని రేవంత్ ఆరోపించడం, దాన్ని కేటీఆర్ ఖండించడం, కావాలంటే టెస్టులకూ సిద్ధమని ప్రకటించడం తెలిసిందే. గన్ పార్కులో టెస్టులు చేయించుకుందామంటూ కేటీఆర్ కు రేవంత్ వైట్ చాలెంజ్ విసరడం, ఆయనపై కేటీఆర్ న్యాయ పోరాటానికి దిగడంతో డ్రగ్స్ ఎపిసోడ్ కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య రాజకీయ దుమారానికి తెర తీసినట్టయింది. రేవంత్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు సోమవారం గన్‌పార్క్‌కు వెళ్లి కేటీఆర్ కోసం వెయిట్ చేయడం, ఆయన రాకపోవడంతో విమర్శలు చేయడం తెలిసిందే. కేటీఆర్ ప్రతిష్టను దెబ్బతీసేలా రేవంత్ ఆరోపణలు చేస్తున్నారంటూ టీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం నాయకులు మంగళవారం ఆయన ఇంటిని ముట్టడించారు. రేవంత్ దిష్టిబొమ్మ తగలబెట్టబోయారు. ఇది కాంగ్రెస్, టీఆర్ఎస్వీ నేతల మధ్య పెద్ద గొడవకు దారితీసింది. ఇరు వర్గాలు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. టీఆర్‌ఎస్వీ నేతలు రాళ్లు రువ్వడంతో కాంగ్రెస్ నాయకులు వారిపై కర్రలతో తిరగబడ్డారు. రేవంత్ దిష్టిబొమ్మను లాక్కొని వాళ్లను కొంతదూరం దాకా తరిమారు. పోలీసులు కాంగ్రెస్ నాయకులను ఆపి, టీఆర్‌ఎస్వీ నేతలను పంపేయడంతో గొడవ సద్దుమణిగింది.
అమరుల స్తూపానికి శుద్ధి
అమరవీరుల స్తూపాన్ని టీఆర్‌ఎస్ యువజన విభాగం మంగళవారం గోమూత్రంతో, పాలతో శుద్ధి చేసింది. రేవంత్ రాకతో స్తూపం మలినమయిందని, అమరుల ఆత్మలు శోభిస్తున్నాయని నేతలు విమర్శించారు. ‘‘రేవంత్ చంద్రబాబు చెంచా. తక్షణం క్షమాపణ చెప్పాలి. లేదంటే ఆయన ఇంటిని ముట్టడిస్తం. ప్రత్యక్ష దాడులు చేస్తం” అని శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ యువజన విభాగం గ్రేటర్ అధ్యక్షుడు ఆలకుంట హరి తదితరులు హెచ్చరించారు.
టీఆర్ఎస్ పై తిరుగుబాటు తప్పదు: మల్లు
డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం కృషి చేస్తున్న రేవంత్ ఇంటిపై టీఆర్‌ఎస్ దాడి అప్రజాస్వామికమని పీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి అన్నారు. రేవంత్ వైట్ చాలెంజ్ పిలుపుతో కేటీఆర్ పరువుకు ఎలా నష్టమని ప్రశ్నించారు. కేసు వేసి కేటీఆరే పరువు పోగొట్టుకున్నారన్నారు. ఇక్కడ టెస్టులకు రాకుండా, ఢిల్లీకి పోతామంటున్నారంటే ఆయనలో ఎంత భయముందో అర్థమవుతుందన్నారు. రేవంత్ వైట్ చాలెంజ్‌ను ఇప్పటికైనా స్వీకరించాలన్నారు. టీఆర్ఎస్ పై తిరుగుబాటు తప్పదన్నారు. రాష్ట్రాన్ని కేటీఆర్ దోచుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఆరోపించారు. రేవంత్ స్వయం శక్తితో రాజకీయంగా ఎదిగారన్నారు. ‘‘ఫార్మాసిటీ పేరుతో 8 వేల ఎకరాలకు పైగా దళితుల అసైన్డ్ భూములు ఆక్రమించారు. దళితులకు ఎకరాకు రూ.16 లక్షలిచ్చి అమెజాన్ కంపెనీకి రూ.1.3 కోట్లకు అమ్ముకున్నారు. వీటిపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తం” అన్నారు. రేవంత్ ఇంటిపై దాడితో రాష్ట్రాన్ని పాలించే హక్కును టీఆర్‌ఎస్ కోల్పోయిందని బెల్లయ్య నాయక్ అన్నారు.
రేవంత్ డ్రగ్స్ బంధు: జీవన్
రేవంత్ తీరు మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలుంటాయని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్ హెచ్చరించారు. తెలంగాణ చీటర్స్ కమిటీకి రేవంత్ అధ్యక్షుడని ఎద్దేవా చేశారు. రేవంత్ కుటుంబసభ్యులకు డ్రగ్స్ పరీక్షలు చేయించాలని డిమాండ్ చేశారు. ‘‘రేవంత్ ను నేను వ్యక్తిగతంగా తిట్టగలను. కానీ అది పద్ధతి కాదు. రాహుల్‌ను ఖతం పట్టించడానికి రేవంత్ ఒక్కడు చాలు. కాంగ్రెస్ మంత్రులు, సీఎంలే డ్రగ్స్ కేసుల్లో ఉన్నారు” అన్నారు. రాహుల్ డోప్ టెస్టుల్లో దొరికినట్టు అమెరికా పత్రికల్లో కథనాలు వచ్చాయని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ‘‘మేం దళితబంధు అంటుంటే రేవంత్ డ్రగ్స్ బంధు అయిండు. జైళ్లో ఆ ముఠాలతో పరిచయం పెంచుకుని, వాటిని ప్రమోట్ చేసే పనిలో పడ్డడు” అని ఎద్దేవా చేశారు. తెలంగాణకు మచ్చ తేవడమే రేవంత్ అజెండా అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఆరోపించారు. ఆయన చెప్పిన వైట్ చాలెంజ్ ను కాంగ్రెస్ పాలిత పంజాబ్‌తో మొదలు పెడితే బాగుందన్నారు.
రేవంత్ ఫ్యామిలీకి డ్రగ్స్ పరీక్షలు: గువ్వల
రేవంత్ తీరు మారకుంటే తామూ తమ వ్యవహార శైలి మార్చుకోవాల్సి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు హెచ్చరించారు. డ్రగ్స్ పరీక్షల సవాలుపై రాహుల్ స్పందించాలని మంగళవారం డిమాండ్ చేశారు. రేవంత్ చేసిన డ్రగ్స్ విమర్శలు కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ మెడకే చుట్టుకున్నాయన్నారు. కేటీఆర్‌పై నిరాధార విమర్శలు చేస్తున్నారని రేవంత్ పై మండిపడ్డారు. ‘‘ఏ టెస్టుకైనా కేటీఆర్ సిద్ధం. రాహుల్‌ను రేవంత్ ఒప్పించాలి. అమరవీరుల స్తూపం దగ్గర అడుగు పెట్టే అర్హత కూడా రేవంత్‌కు లేదు. గుర్తింపు కోసమే రేవంత్ అడ్డగోలు రాజకీయాలు చేస్తున్నడు. హడావుడి చేసి, దాన్నంతా దందాలకు వాడుకుంటున్నడు. ఇట్లాంటి రాజకీయాలతో జనానికి దగ్గర కాలేరు” అన్నారు.