అర్వింద్..ఎక్కడ పోటీ చేసినా వెంటపడి ఓడిస్త: కవిత

అర్వింద్..ఎక్కడ పోటీ చేసినా వెంటపడి ఓడిస్త: కవిత

హైదరాబాద్‌‌, వెలుగు: నిజామాబాద్‌‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌‌ తీరు మార్చుకోకపోతే మెత్తగా తంతామని.. కొట్టికొట్టి చంపుతామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. అర్వింద్‌‌ ఎక్కడ పోటీ చేసినా వెంటపడి ఓడిస్తానన్నారు. శుక్రవారం టీఆర్‌‌ఎస్ఎల్పీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘‘కుక్క కాటుకు చెప్పుదెబ్బ అంటరు తెలంగాణల.. మామూలుగా చెప్తే కుక్కకు అర్థం కాదు.. ఇంకోసారి నేను పార్టీ మారుతానని, ఇదని.. అదని మాట్లాడితే.. అడ్డమైన కూతలు కూస్తే చెప్పు తీసుకొని నిజామాబాద్‌‌ చౌరస్తాలా కొడుత బిడ్డా ఏమనుకుంటున్నవో..” అని ఫైర్ అయ్యారు. ‘‘అన్‌‌ పార్లమెంటరీ అనుకోండి.. ఇంకోటి అనుకోండి.. 16 ఏండ్ల ప్రజాజీవితంలో చాలా ఓపికతో ఉన్న నాతో ఇవ్వాల ఇంత మాట అనిపిచ్చిండు అంటే వాడు ఎంత చీప్‌‌ ఫెలోనో అర్థం చేసుకోవాలె.. ఇలా మాట్లాడుతున్నందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్తున్న.. కానీ తప్పక, బాధతో, ఆవేదనతో మాట్లాడుతున్న” అని అన్నారు. ‘‘ఖర్గేకు ఫోన్‌‌ చేసి అడగండి.. ఆయన నాకు పార్లమెంట్‌‌లో తెలుసు.. నాలాంటి ఫస్ట్‌‌ టైం పార్లమెంట్‌‌ మెంబర్లందరినీ దగ్గరకు కూడేసుకొని అనేక విషయాలు ఆయన చెప్పేటోడు.. వంద మందితోని ఫ్రెండ్‌‌షిప్‌‌ ఉంటది.. నీలాగా పిచ్చోళ్లతోని ఎవరూ మాట్లాడరు.. మంచోళ్లతోని, పాలిటిక్స్‌‌ల పొలైట్‌‌గా ఉండేటోళ్లతోని అందరూ మాట్లాడుతరు.. ఇంకోసారి లైన్‌‌ దాటితే ఊరుకోము.. కొట్టికొట్టి చంపుతాం’’ అని హెచ్చరించారు.

ఖర్గేతో మాట్లాడలే.. బీజేపీ ఆఫర్ వచ్చింది..

తనను బీజేపీలో చేరాలంటూ ఆఫర్‌‌ వచ్చిన మాట నిజమేనని కవిత చెప్పారు. ‘‘రాజకీయాల్లో ఎంతోమంది స్నేహితులు ఉంటారు. అలాంటి వాళ్ల నుంచే పార్టీలో చేరాలని ఆహ్వానం అందింది. తెలంగాణలో షిండే మోడల్‌‌ అమలు చేయడంపై నాతో మాట్లాడారు. ఇక్కడ షిండే మోడల్‌‌ నడువదని, బ్యాక్‌‌డోర్‌‌ పాలిటిక్స్‌‌కు తెలంగాణలో స్థానం లేదని చెప్పి వాళ్ల ఆఫర్‌‌ రిజెక్ట్‌‌ చేశా” అని తెలిపారు. అయితే పార్టీలో చేరాలంటూ సంప్రదించిన వాళ్ల పేర్లు చెప్పేందుకు ఆమె నిరాకరించారు. ఈడీ, ఐటీ దాడులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. ‘‘బీజేపీ నాయకులు ఏమైనా గంగలో మునిగిన పునీతులా? వాళ్లపై ఐటీ, ఈడీ దాడులు ఎందుకు చేయరు? ప్రతిపక్ష పార్టీల్లో ఉన్నప్పుడు ఐటీ, ఈడీ దాడులు ఎదుర్కొన్న వాళ్లు.. జై మోడీ అనగానే వాషింగ్‌‌ పౌడర్‌‌ నిర్మాలా క్లీన్‌‌ అయిపోతున్నారు” అని ఎద్దేవా చేశారు. తాను కాంగ్రెస్‌‌లో చేరుతున్నట్టు ఎవరో కాంగ్రెస్‌‌ నాయకుడు చెప్పాడని అర్వింద్‌‌ అంటున్నాడని, బీజేపీ ఎంపీకి కాంగ్రెస్‌‌ నాయకులతో ఏం పని అని ప్రశ్నించారు. నిజామాబాద్‌‌లో కాంగ్రెస్‌‌ మద్దతుతో, 186 మందితో నామినేషన్లు వేయించి యాక్సిడెంటల్‌‌గా అర్వింద్‌‌ ఎంపీగా గెలిచాడన్నారు. ఇది నిజామాబాద్‌‌, తెలంగాణ ప్రజల దురదృష్టమన్నారు. తన జీవితంలో ఏకైక నాయకుడు కేసీఆరేనని, తెలంగాణ వాసనలేని ఏ పార్టీలో తాను చేరబోనన్నారు. కాంగ్రెస్‌‌లో చేరేందుకు ఖర్గేతో మాట్లాడాననేది శుద్ధ తప్పు అని కొట్టిపారేశారు.

ఆయనవి చిల్లర మాటలు

అర్వింద్‌‌ది సంకుచిత మనస్తత్వమని, ఆయనవి చిల్లర మాటలని కవిత అన్నారు. నిజామాబాద్‌‌ ఎంపీగా ఆయన ఉండటం దురదృష్టమన్నారు. పార్లమెంట్‌‌లో ఎంపీగా ఆయన పనితనం గుండుసున్నా అని, పసుపు బోర్డు తెస్తానని రైతులను మోసం చేశారని మండిపడ్డారు. ఆయనది ఫేక్‌‌ డిగ్రీ అని, ఆ సర్టిఫికెట్‌‌పై తానే సీఈసీకి కంప్లైంట్‌‌ చేస్తానని చెప్పారు. అర్వింద్‌‌ బురదలాంటోడని, ఆయనపై రాయి వేస్తే ఆ బురద తమపైనే పడుతుందనే ఇన్నాళ్లు ఏం మాట్లాడినా మౌనంగా ఉన్నానని తెలిపారు. అర్వింద్‌‌ ప్రెస్‌‌మీట్‌‌లో నీచంగా మాట్లాడారని, ఆయన మాటలు చూస్తుంటే ఇలాంటి రాజకీయాలు అవసరమా అని బాధేస్తున్నదన్నారు. తాను ఎప్పుడూ సమస్యలపైనే మాట్లాడుతానని, మొదటిసారి వ్యక్తి మీద మాట్లాడుతున్నానని, ఇంకెప్పుడు ఆయనపై మాట్లాడబోనని చెప్పారు.