
రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాల్లో 13 చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారు. ఎనిమిది చోట్ల సిట్టింగ్ ఎంపీలకే అవకాశం ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు తెలిసింది. మరో ఐదు స్థానాల్లోనూ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసినట్లు సమాచారం. మిత్రపక్షం ఎంఐఎం పోటీ చేసే హైదరాబాద్ స్థానం నుంచి తమ అభ్యర్థిని దింపబోమని ఇప్పటికే కేసీఆర్ ప్రకటించారు. మిగతా మూడు సీట్లపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ మూడు స్థానాల్లో నల్గొండ, మహబూబాబాద్, వరంగల్ ఉన్నాయి. ఇక్కడ పలువురి పేర్లు వినిపిస్తున్నప్పటికీ మరిన్ని చర్చల తర్వాత ఓ నిర్ణయానికి రానున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో 16 స్థానాల్లో గెలిచి, జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నది. అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలకు వెళ్లి, ముందస్తుగానే అభ్యర్థులను ప్రకటించి భారీ విజయాన్ని సాధించి రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్.. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లోనూ అద్భుత ఫలితాలు రాబట్టుకోవాలని కసరత్తు చేస్తోంది. కేడర్‌ను ఎన్నికలకు సన్నద్ధం చేసేపనిలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్బిజీ బిజీగా ఉన్నారు. ఈ నెల 6నుంచి ఆయన లోక్ సభ ఎన్నికల సన్నాహాక సమావేశాలను మొదలుపెట్టనున్నారు.
మీకు ఓకే.. పనిలో పడండి!
పేర్లు ఖరారైన అభ్యర్థులను సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ కు పిలిపించుకొని మాట్లాడినట్లు సమాచారం. మెదక్, జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్ ను సీఎం శుక్రవారం ప్రగతి భవన్ కు పిలిచి ఎన్నికలపై చర్చించినట్టు తెలిసింది. ఇద్దరు ఎంపీలతో కలిసి లంచ్ చేసిన ఆయన.. వారిద్దరికీ టికెట్ పై భరోసా ఇచ్చినట్లు, జాగ్రత్తగా పనిచేసుకోవాలని, అందరిని కలుపుకుపోవాలని సూచించినట్లు సమాచారం. సిట్టింగ్ లకే అవకాశం దక్కనున్న స్థానాల్లో.. మెదక్ , జహీరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, భువనగిరి, ఖమ్మం ఉన్నాయి. కరీంనగర్ నుంచి వినోద్‌కుమార్ , నిజామాబాద్ నుంచి కవిత, మహబూబ్ నగర్ నుంచి జితేందర్ రెడ్డి, ఆదిలాబాద్ నుంచి జి.నగేశ్ , భువనగిరి నుంచి బూర నర్సయ్యగౌడ్, ఖమ్మం నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎంపీగా కొనసాగుతున్నారు. ఇక, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల స్థానాలను పలువురు నేతలు ఆశించినా రెండుచోట్ల సీఎం కేసీఆర్ కొత్త నేతలకు టికెట్లు ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది . సికింద్రాబాద్ నుంచి పౌల్ట్రీ వ్యాపారి, ఇంజినీరింగ్ కాలేజీల అధినేత రంజిత్‌రెడ్డి, మల్కాజిగిరి నుంచి వ్యాపారవేత్త నవీన్ రావు అభ్యర్థిత్వాలు ఫైనల్ చేసినట్లు సమాచారం. ఇక, చేవెళ్ల నుంచి మహేందర్ రెడ్డి పేరు ఓకే అయినట్లు తెలిసింది . పెద్దపల్లి నుంచి జి.వివేక్ వెంకటస్వామి, నాగర్ కర్నూల్ నుంచి పి. రాములు పేర్లను ఇది వరకే ఖరారు చేశారు.
మంత్రులకు బాధ్యతలు
ఎంపీల గెలుపు బాధ్యతను సీఎం కేసీఆర్ మంత్రులకు అప్పగించారు. పాత జిల్లాల వారీగా నియోజకవర్గ ఇన్ చార్జీలను నియమించారు. కేసీఆరే స్వయంగా మూడు సీట్ల బాధ్యతలు పర్యవేక్షించనున్నారు. అందులో మెదక్ , జహీరాబాద్, ఖమ్మం ఉన్నాయి. లోక్ సభ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని, లేనిపక్షంలో పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కేసీఆర్ స్పష్టం చేశారు. ఎంపీలను గెలిపించి తీరాలని మంత్రులకు సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు . ప్రతికూల ఫలితాలు వస్తే అందుకు ఇన్ చార్జులే బాధ్యులవుతారని హెచ్చరించినట్టుగా తెలిసింది . పార్టీని ఎన్నికలకు సన్నద్ధం చేసే బాధ్యతను వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అప్పగించారు.
ఖమ్మంలో పొం గులేటి వైపే మొగ్గు
ఖమ్మం ఎంపీ సీటునూ సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికే ఖరారు చేయనున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ స్థానంపై మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆశలు పెట్టుకున్నా పొంగులేటి వైపే మొగ్గు చూపే అవకాశముంది. ప్రత్యర్థి పార్టీ నేతలు కూడా పొంగులేటి మాటకు కట్టుబడి ఉండటం ఆయనకు కలిసివచ్చే అంశం. ఇప్పటికే వైరా ఇండిపెండెంట్ ఎమ్మెల్యేను పార్టీలోకి తెచ్చిన పొంగులేటి. అవసరమైతే మరో ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలను కారెక్కించేందుకు సిద్ధం గా ఉన్నట్టు తెలుస్తోంది .
ఈ సీట్లు మార్చుతారా?
మహబూబాబాద్, వరంగల్ ఎంపీ అభ్యర్థులను మార్చుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది . ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి రామచంద్రు నాయక్, మాజీ ఎమ్మెల్యే మాలోతు కవిత పేర్లు మహబూబాబాద్ స్థా నానికి పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఇక్కడి నుంచి తిరిగి తనకే అవకాశం దక్కుతుందని సిట్టింగ్ ఎంపీ సీతారాం నాయక్ ధీమాగా ఉన్నారు. వరంగల్ నుంచి మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిని పోటీ చేయించే అవకాశమున్నట్టు ప్రచారంలో ఉంది . ప్రస్తుతం అక్కడ పసునూరి దయాకర్ ఎంపీగా ఉన్నారు. ఆయన తనకే టికెట్ దక్కుతుందని నమ్ముతున్ నారు.
గుత్తా లేదా పల్లా !
నల్లగొండ ఎంపీగా కాంగ్రెస్ నుంచి గెలిచిన గుత్తా సుఖేం దర్ రెడ్డి రాష్ట్ర కేబినెట్ బెర్త్ ఆశిస్తున్నారు. తదుపరి విస్తరణలో తనకు చోటు దక్కుతుందని ఆయన నమ్మకం పెట్టుకున్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డికి రాష్ట్రంలో పదవి ఇస్తే.. నల్లగొండ ఎంపీ స్థానాన్ని శాసన మండలి విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇవ్వవొచ్చని ప్రచారం జరుగుతోంది . మరోవైపు గుత్తాను ఎంపీగా పోటీ చేయించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి.
సికింద్రాబాద్ పై స్పెషల్
బీజేపీ సిట్టింగ్ స్థానంగా ఉన్న సికింద్రాబాద్‌ను గెలిచి తీరాలని టీఆర్‌ఎస్ లక్ష్యంగా పెట్టుకుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి అన్ని స్థానాల్లోనూ టీఆర్‌ఎస్ భారీ మెజార్టీతో గెలిచింది . సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులు బీజేపీకి లాభిస్తాయని కమలనాథులు నమ్మకం పెట్టుకున్నారు. అయితే.. బూత్ స్థాయి నుంచి ఓటర్లను ఆకర్షించి, ఈ సీటును కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్ ముందుకు సాగుతున్నది.
టఫ్ సీట్లలోనే సీఎం ప్రచారం
టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్న ఖమ్మం, మహబూబాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, నల్లగొండ, భువనగిరి సీట్లపై సీఎం కేసీఆర్ ఎక్కువగా ఫోకస్ పెట్టారు . ఆయన ఎన్నికల ప్రచారం కూడా ఇక్కడే ఉండనున్నట్టు తెలుస్తోంది. మిగతా ఎంపీ సీట్లను టచ్ చేస్తూ ఐదు నుంచి ఆరు సమావేశాలునిర్వహించే అవకాశముంది.