రాష్ట్రానికి నవోదయ స్కూళ్లు ఇయ్యలె

రాష్ట్రానికి నవోదయ స్కూళ్లు ఇయ్యలె

న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రానికి విద్యా సంస్థల కేటాయింపులో కేంద్రం వివక్ష చూపుతున్నదని టీఆర్​ఎస్ లోక్ సభాపక్ష నేత నామా నాగేశ్వర్ రావు అన్నారు. అస్సాం, గుజరాత్, హర్యానా, హిమచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మణిపూర్, త్రిపురకు నవోదయ స్కూళ్లు ఇచ్చారు కానీ, మన రాష్ట్రానికి ఇవ్వడం లేదని ఆరోపించారు. తెలంగాణ ఇండియాలో లేదా? తెలంగాణ పౌరులు భారతీయులు కారా? అని ప్రశ్నించారు. పెండింగ్ నవోదయ స్కూళ్లు ఒక నెలలో బీజేపీ ఎంపీలు తీసుకురావాలని సవాల్ విసిరారు. నవోదయ స్కూళ్లు తీసుకువస్తే దండేసి దండం పెడతామన్నారు. నవోదయ స్కూళ్లు ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ ఎంపీలు శుక్రవారం ఉభయసభల్లో వాయిదా తీర్మానం ఇచ్చారు. ఈ తీర్మానంపై చర్చకు స్పీకర్, రాజ్యసభ చైర్మన్ నిరాకరించారు. దీంతో లోక్ సభలో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేపట్టారు. తర్వాత టీఆర్ఎస్ ఎంపీలు తెలంగాణ భవన్​లో మీడియాతో మాట్లాడారు. విభజన నాటి నుంచి రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని నామా అన్నారు. విద్యా సంస్థలు, నిధులను కేంద్రం ఇవ్వడం లేదన్నారు. 16 వ లోక్​సభ, 17వ లోక్​సభలోనూ ఈ అంశాలు లేవనెత్తినట్లు చెప్పారు. రాష్ట్ర అంశాలకు పార్లమెంట్​లో స్థానం ఇవ్వడం లేదని, అందువల్ల వాకౌట్ చేసినట్లు చెప్పారు. విభజన హామీలు అమలు చేయకుండా కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని ఎంపీ బడుగు లింగయ్య యాదవ్ ఫైరయ్యారు. బీజేపీ ఎంపీలు ఏం మొహం పెట్టుకుని తెలంగాణలో తిరుగుతారన్నారు. తెలంగాణకు అన్యాయం చేస్తే ప్రజలు బీజేపీకి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రాష్ట్ర అంశాల్లో  కేంద్రం మొండిగా వ్యవహరిస్తోందని రాజ్య సభ సభ్యులు కేఆర్ సురేశ్ రెడ్డి అన్నారు. కానీ, రాష్ట్రంలో ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్యను బలపరచడానికి అన్ని చర్యలు కేసీఆర్ తీసుకుంటున్నారని చెప్పారు.