బ్లాక్ మెయిల్ రాజకీయాలు బంజేయాలే

బ్లాక్ మెయిల్ రాజకీయాలు బంజేయాలే

న్యూఢిల్లీ, వెలుగు: బీజేపీ, కాంగ్రెస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయని టీఆర్ఎస్ ఎంపీలు విమర్శించారు. బీజేపీ కాంగ్రెస్ ఇద్దరూ దొంగలేనని, కలిసి పని చేస్తున్నారని ఆరోపించారు. పార్లమెంటులో తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోడీ కామెంట్లను ఎంపీలు ఖండించారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. మోడీ రాజకీయ కుట్రకు తెరలేపారని ఆరోపించారు. ప్రధాని మాటలతో తెలంగాణ ప్రజలు బాధ పడుతున్నారని ఎంపీ మాలోతు కవిత అన్నారు. అభివృద్ధిలో గుజరాత్​ను తెలంగాణ దాటేసిందని ఓర్చుకోలేక పోతున్నారన్నారు. కాకినాడ ప్లీనరీలో చేసిన తీర్మానం ప్రకారం తెలంగాణ ఇచ్చి ఉంటే విద్యార్థులు బలయ్యేవారు కాదన్నారు. ప్రధాని ప్రసంగం పట్ల తెలంగాణ బీజేపీ నేతలు రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకోవాలని కవిత సూచించారు.

గోబెల్స్ ప్రచారంలో మోడీకి నోబెల్..  

తెలంగాణపై ప్రధాని మోడీ ద్వేషాన్ని చూపారని ఎంపీ వెంకటేశ్ నేత మండిపడ్డారు. గోబెల్స్ ప్రచారంలో మోడీకి నోబెల్ ప్రైజ్ దక్కుతుందన్నారు. అబద్దాలు ప్రచారం చేయడంలో బీజేపీ నేతలకు ఆస్కార్ అవార్డులు ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పోరాటం, విద్యార్థుల బలిదానాల వల్ల తెలంగాణ వచ్చిందన్నారు. రాజ్యాంగాన్ని అవమాన పరిచేలా మోడీ మాట్లాడటం సిగ్గు చేటని మండిపడ్డారు. ఏడేండ్లయినా విభజన హామీలు పూర్తి చేయలేదన్నారు. ఇప్పటికీ జల వివాదాలపై ట్రిబ్యునల్ ఏర్పాటు చేయకపోవడం, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకపోవడం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టులకు నీతీ ఆయోగ్ సూచనల మేరకు నిధులు కేటాయించకపోవడం తెలంగాణపై వివక్షేనని అన్నారు.