అంబేద్కర్ ఆశించినదే కేసీఆర్ చేస్తుండు

అంబేద్కర్ ఆశించినదే కేసీఆర్ చేస్తుండు

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ అని టీఆర్ఎస్ ఎంపీలు అన్నారు. ఆయన స్పీచ్​లో ప్రస్తావించిన అంశాన్ని రాజకీయం చేయాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయని విమర్శించారు. గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఎంపీలు మాలోతు కవిత, మన్నె శ్రీనివాస్ రెడ్డి, పసునూరి దయాకర్, బడుగుల లింగయ్య మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఏ వర్గాల ప్రజల గుండెల్లో చూసిన కేసీఆర్ ఉంటారని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాజ్యాంగం గురించి కేసీఆర్ మాట్లాడితే తప్పేంటని, అంబేద్కర్ ఆశించినదే కేసీఆర్ చేస్తున్నారన్నారని కవిత అన్నారు. ఇప్పుటి పరిస్థితులకు తగ్గట్లుగా మెరుగ్గా ఉండాలని కేసీఆర్ చెప్పారన్నారు. మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. తిన్నది అరగడానికి సంజయ్ పాద యాత్ర చేయనున్నారని విమర్శించారు.  కేసీఆర్ వ్యాఖ్యలను వక్రీకరించి దళిత సమాజానికి నుంచి లబ్ధి పొందాలని బీజేపీ, కాంగ్రెస్ చూస్తున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో 119 సీట్లలో బీజేపీకి డిపాజిట్ కూడా రాదన్నారు.