
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఆరుకు ఆరు స్థానాల్లో గెలుపొందడంతో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయంలో పటాకులు పేల్చి.. స్వీట్లు పంచుకున్నారు. ఈ సంబరాలలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇతర నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ డబ్బుతో ఓటర్లను కొని గెలవాలని చూసిందని వారు ఆరోపించారు. సంఖ్యా బలం లేకున్నా పోటీ చేశారని.. ఎన్నో కుట్రలు చేసి ఏదో ఒక సీటు గెలవడానికి ప్రయత్నించారని వారన్నారు. ప్రతిపక్షాలు నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని సూచించారు. కేసీఆరే తమ నాయకుడని భావించి ఓటర్లందరూ ఓటేశారని మంత్రులు అన్నారు. కేసీఆర్ లాంటి నాయకుడు కావాలని దేశవ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్నారన్నారు.