నాగార్జునసాగర్ పై గులాబీ సర్వే.. బైపోల్‌ కోసం పక్కా వ్యూహం

నాగార్జునసాగర్ పై గులాబీ సర్వే.. బైపోల్‌ కోసం పక్కా వ్యూహం

బైపోల్‌లో గట్టెక్కేందుకు రూలింగ్ పార్టీ వ్యూహం
అభ్యర్థిని తేల్చేందుకు కులాలవారీగా అభిప్రాయ సేకరణ
యాదవ, రెడ్డి సామాజిక వర్గాలపైనే ఫుల్ ఫోకస్

నల్గొండ, వెలుగు: ఇటీవల వరుస ఎలక్షన్లలో ఎదురు దెబ్బలు తగలడంతో నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో పకడ్బందీగా ముందుకు పోవాలని రూలింగ్ పార్టీ ఆలోచిస్తోంది. త్వరలో బైపోల్ జరిగే నాగార్జునసాగర్ నియోజకవర్గంలో విజయం సాధించేందుకు ఇప్పటినుంచే ప్లాన్లు వేస్తోంది. ఇందులో భాగంగా 2018 నాటి ఎన్నికల హామీలకు సంబంధించి జీవోలు ఇచ్చింది. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నిర్మాణానికి ఆమోదముద్ర వేసింది. అయితే పోటీలో నిలబెట్టాలనుకునే అభ్యర్థి విషయానికి వచ్చేసరికి మాత్రం హైకమాండ్ మల్లగుల్లాలు పడుతోంది. నియోజకవర్గంలో నెలకొన్న గ్రూపు తగాదాల
వల్ల అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దీంతో ఎవరైతే బాగుంటుందో తేల్చేందుకు హైకమాండ్ సర్వే చేయాలని డిసైడైంది. పార్టీ వర్గాల నుంచి వచ్చిన సమాచారం మేరకు నలుగైదురు పేర్లతో ఫస్ట్ లిస్ట్ ప్రిపేర్ చేసినట్లు తెలిసింది.

నోముల కుటుంబానికి ప్రాధాన్యం
దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుటుంబానికి తొలి ప్రాధాన్యం ఇవ్వా లని ఆలోచిస్తున్నారు. లేదంటే కచ్చితంగా యాదవ సామాజిక
వర్గానికి ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. గత ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ ఎంసీ కోటిరెడ్డికి జిల్లా మంత్రి ఆశీస్సులు ఉండటంతో ఆయన పేరు కూడా హైకమాండ్ పరిశీలనలో ఉంది. అయితే పూర్తిగా నోముల కుటుంబాన్ని తప్పించి వేరే సామాజికవర్గానికి టికెట్ ఇస్తే యాదవుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. పైగా ఈ పరిణామం రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం చూపే చాన్స్ ఉంది. దాంతో రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ పేరును హైకమాండ్ తెరపైకి తీసుకొచ్చినట్లు తెలిసింది. దివంగత మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి యాదవ్‌కు ఆయన స్వయానా అల్లుడు కావడంతోపాటు, నియోజకవర్గ ప్రజలతో మంచి రిలేషన్స్ ఉన్నాయి. వీరితోపాటు మరో ముఖ్యమైన నేత పేరు కూడా ప్రచారంలో ఉంది. రాష్ట్రంలో కీలకమైన పదవిలో ఉన్నటువంటి సీనియర్ లీడర్ పేరును జాబితాలో చేర్చినట్లు తెలిసింది. ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ఇంకా రెండు నెలలు పట్టొచ్చని అంటున్నారు. ఈలోగా రూలింగ్ పార్టీ అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇందులో భాగంగానే సర్వే ప్రారంభించింది. ఈ సర్వేలో ఏ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థి అయితే వర్కవుట్ అవుతుందో పరిశీలిస్తున్నారు. నలుగురైదుగురి పేర్లతో చేస్తున్న సర్వేలో జిల్లా మంత్రి మాట కాదనకుండా, ఏవర్గం నుంచి వ్యతిరేకత లేకుండా సేఫ్ గేమ్ ఆడాలని హైకమాండ్ ఆలోచిస్తోంది.

కులాల వారీగా ఓటర్ల లెక్కలివీ..
నియోజకవర్గంలో సుమారు 2.17 లక్షల మంది ఓటర్లున్నారు. కొత్తగా నమోదవుతున్న ఓటర్లతో కలిపితే మొత్తం 2.2 లక్షల వరకు ఉంటారని అంచనా.
గతంలో చేపట్టిన సర్వే ప్రకారం నియోజకవర్గంలో బీసీ ఓటర్లు 1.3 లక్షల మంది ఉంటే దీంట్లో యాదవులు 50 వేల వరకు ఉండొచ్చని చెబుతున్నారు. ఎస్టీలు 35 వేల వరకు ఉంటారని అంచనా. రెడ్లు 15 వేలు, కమ్మ ఆరు నుంచి ఏడు వేలు, 20 వేలు ఎస్సీలు ఉంటారని గత సర్వే రిపోర్టులు చెప్తున్నాయి. అయితే 2012 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గంలో ఎస్సీలు 47,464, ఎస్టీలు 49,107 మంది ఉన్నారు.

For More News..

ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డిని అరెస్ట్ చేయాలె

అన్​నోన్​ యాప్స్ తో జాగ్రత్త.. ఈ టిప్స్ ఫాలోఅయితే చాలు..

సర్పంచ్‌‌‌‌లూ.. మీ సమస్యలేంది? గ్రామాల్లో ఇంటెలిజెన్స్‌‌‌‌ వర్గాల ఆరా