మన వడ్లు కొనేదాక కేంద్రాన్ని వదలం

మన వడ్లు కొనేదాక కేంద్రాన్ని వదలం

తెలంగాణలో రైతులు పండించిన ప్రతి గింజను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. యాసంగి పంటను పూర్తిగా కొనే వరకూ కేంద్రంపై పోరాటం ఆగదని స్పష్టం చేశారు. పంజాబ్‌ తరహాలోనే తెలంగాణ రాష్ట్రంలోనూ రైతుల పండించిన పంటలను పూర్తిగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ నిరసన దీక్షలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ఇవాళ సిద్దిపేట ఆర్డీవో కార్యాలయం ఎదుట మంత్రి హరీశ్ రావు  నిరసన దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ నేతలు సబ్‌ కా సాత్, సబ్‌ కా వికాస్‌ అంటూనే, రాష్ట్రానికో విధానంతో పని చేస్తున్నారని అన్నారు. పంజాబ్‌లో గోధుమలు పండించినా, వడ్లు పండించినా ప్రతి గింజనూ కేంద్రం కొనుగోలు చేస్తోందని, అదే విధానం తెలంగాణ విషయంలోనూ పాటించాలని డిమాండ్ చేశారు. దీనిపై కేంద్రం దిగి వచ్చే వరకూ తమ పోరాటం కొనసాగిస్తామని హరీశ్ తెలిపారు. దశల వారీగా పోరు కొనసాగిస్తామని, రేపు (శుక్రవారం) ప్రతి రైతు ఇంటిపై నల్ల జెండా ఎగరాలని, దీనికి సంబంధించిన వీడియోలు తీసి తనకు పంపాలని కార్యకర్తలు, సర్పంచ్‌లకు సూచించారాయన. వడ్లు కొనాలంటే ఈ జెండా ఎగరేయాలని చెప్పి బీజేపీ కార్యకర్తల ఇంటిపైనా నల్ల జెండాలు పెట్టాలని ఆదేశించారు. ప్రతి ఊరిలో, ప్రతి ఒక్క ఇంటిపైనా నల్ల జెండా కనిపించాలని, ఢిల్లీకి తెలిసొచ్చేలా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 11 ఢిల్లీలో కేంద్రం ప్రభుత్వం కళ్లు తెరిపించేలా పెద్ద ఎత్తున నిరసన చేపట్టబోతున్నామని చెప్పారు.

ఆఫీసుల ముందే ధర్నాలతో ప్రజలకు ఇబ్బంది

రాష్ట్రవ్యాప్తంగా అధికార పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఒక్కో జిల్లాలో ఒక్కో మంత్రి ఈ నిరసన దీక్షల్లో పాల్గొన్నారు. నిర్మల్‌లోని మున్సిపల్ కార్యాలయం ఎదుట మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. వనపర్తి ఆర్డీవో ఆఫీస్ ముందు మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, నిజామాబాద్‌లో మంత్రి ప్రశాంత్ రెడ్డి, మహబూబ్‌నగర్‌‌లో ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, మహబూబాబాద్‌లో మంత్రి సత్యవతి రాథోడ్, వరంగల్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌రావు, కరీంనగర్‌‌లో మంత్రి గంగుల కమలాకర్‌‌ ధర్నాలు చేశారు. అయితే మంత్రులు, ప్రభుత్వ విప్‌లు, ఎమ్మెల్యేలు ఇలా ప్రభుత్వ కార్యాలయాలకు అడ్డంగా టెంట్లు వేసి నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో ఆయా ఆఫీసులకు వచ్చే సామాన్యులు ఇబ్బందుల పాలయ్యారు.

మరిన్ని వార్తల కోసం..

తమిళిసైకి కాదు.. రాజ్ భవన్కు అవమానం

పుట్టగొడుగులూ మనుషుల్లెక్కనే మాట్లాడుకుంటాయట!

ఎండలు, వడగాలులపై తెలుగు రాష్ట్రాలకు హెచ్చరికలు