అధికార పార్టీలో ముందస్తు ఎన్నికల హడావుడి

అధికార పార్టీలో ముందస్తు ఎన్నికల హడావుడి
  • ఎన్నికల వ్యూహాలకు టీఆర్ఎస్​ పదును
  • ఇతర పార్టీల్లోని యాక్టివ్​లీడర్లను చేర్చుకోవడంపై నజర్
  • నామినేటెడ్  పదవుల భర్తీపై ఫోకస్​
  • అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు

సిద్దిపేట, వెలుగు: వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు హడావుడి మొదలైనట్టే కనిపిస్తోంది. ముందస్తు ఎన్నికలు రావొచ్చన్న ఊహాగానాలతో అధికార పార్టీ వ్యూహాలకు పదును పెడుతోంది.  ఇతర పార్టీల నుంచి చేరికలు, నామినేటెడ్​పదవుల భర్తీ, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో హడావుడి చేస్తోంది.  ఇతర పార్టీల్లో యాక్టివ్​గా ఉండే లీడర్లను నయానోభయానో చేర్చుకునేందుకు అధికార టీఆర్ఎస్​ లీడర్లు ప్లాన్​చేస్తున్నారు. దీంతోపాటు జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్​ నియోజకవర్గాల్లో పార్టీని స్ట్రాంగ్ ​చేయడంపై అధికార పార్టీ నేతలు ఫోకస్​పెట్టారు.

జిల్లాలోని దేవాలయ, మార్కెట్ కమిటీలకు పాలకవర్గాలను నియమించడంతోపాటు మరికొన్ని పదవుల పందేరానికి కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే సిద్దిపేట నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ ద్వితీయ శ్రేణి నేతలను పార్టీలో చేర్చుకునేందుకు రోడ్ మ్యాప్​ క్రియేట్​చేశారు. రానున్న రోజుల్లో మరిన్ని చేరికలు జరిగేలా వ్యూహాలు పన్నుతున్నారు. ఇందుకు సంబంధించి జిల్లా ముఖ్యనేత ఇప్పటికే నియోజకవర్గ లీడర్లతో సమావేశం పెట్టారు. ఎన్నికల సమయంలో పార్టీలోకి చేరికలతో విపక్షాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలన్నదే అధికార పార్టీ వ్యూహంగా తెలుస్తోంది. 

పార్టీని స్ట్రాంగ్ చేయడంపై ఫోకస్​

జిల్లాలో పార్టీని మరింత స్ట్రాంగ్ ​చేయడానికి వీలైనంత ఎక్కువగా చేరికలను ప్రోత్సహించేందుకు అధికార పార్టీ లీడర్లు ముందుకు సాగుతున్నారు. ఇటీవల సిద్దిపేట నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజెపీలోని యాక్టివ్ ​లీడర్లకు గాలం వేశారు. ఇందులో కొంతమందిని భయపెట్టి బలవంతంగా చేర్చుకున్నట్లు సమాచారం. మరికొందరు సిచ్యువేషన్​బట్టి సైలంట్​గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా పార్టీలోకి ఇతరులను తీసుకొచ్చేందుకు జిల్లాకు చెందిన ముఖ్య లీడర్లు ప్లాన్​చేశారు. ఇందుకు తగ్గట్టుగా ఫీల్డ్​లో ఇతర లీడర్లు ప్రతిపక్ష పార్టీల్లో యాక్టివ్​లీడర్లతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈక్రమంలో పార్టీలో చేరేందుకు కొందరు లీడర్లు పదవులతోపాటు ఇతర డిమాండ్లను ముందుకు తెస్తున్నట్లు తెలుస్తోంది. ఆ డిమాండ్లపై సానుకూలంగా స్పందిస్తూ రానున్న రోజుల్లో చేరికలను మరింత పెంచడానికి ఓ ముఖ్య నేత తీవ్రంగా ట్రై చేస్తున్నారు. ఇదిలా ఉంటే దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాల్లో సైతం చేరికలపై అధికార పార్టీ ఫోకస్ ​పెట్టినట్లు తెలుస్తోంది.

పాలకవర్గాల నియామకం షురూ 

జిల్లాలోని దేవాలయ, మార్కెట్ కమిటీ పాలక వర్గాల నియామకాలు మొదలయ్యాయి. సిద్దిపేట, గజ్వేల్ మార్కెట్ కమిటీలతోపాటు కొండపోచమ్మ ఆలయ కమిటీల నియామకం పూర్తి కాగా.. కొమురవెల్లి పాలకవర్గాన్ని ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తున్నారు. పార్టీలోని అసంతృప్తి నేతలను బుజ్జగిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరిగే అవకాశాలు ఉండటంతో ఎలాంటి ప్రతికూల ఫలితాలు రాకుండా ఇప్పటినుంచే అధికార పార్టీ లీడర్లు ప్లాన్​చేస్తున్నారు. దీంతోపాటు పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో పార్టీ కేడర్​ పాల్గొనేలా వారిని యాక్టీవ్​ చేస్తున్నారు. కీలకమైన ఎన్నికల సమయంలో కష్టపడి పనిచేయాలని కేడర్​కు హితబోధ చేస్తున్నారు.