టీఆర్‌ఎస్‌లో మహిళలకు అవమానాలు

టీఆర్‌ఎస్‌లో మహిళలకు అవమానాలు

టీఆర్‌ఎస్‌లో మహిళలకు అవమానాలు
అందుకే పార్టీ నుంచి బయటికి వచ్చా: గండ్ర నళిని

హైదరాబాద్, వెలుగు:‘టీఆర్ఎస్​లో ఇంత అవమానకరమైన పరిస్థితులు ఉంటాయని ఊహించలేకపోయా.. మహిళలను మరీ ఇంత చిన్నచూపు చూస్తారని అనుకోలేదు. ఆరేండ్లు పార్టీ కోసం అహర్నిశలు శ్రమించా.. ఏ ఎన్నికలు వచ్చినా కష్టపడి పని చేశా.. ఒక ఉద్యమకారుడు, మాజీ ఎంపీ బిడ్డను. కేసీఆర్​ను ఎన్నిసార్లు కలుద్దామన్నా అపాయింట్​మెంట్​ దొరకలె. ఇంక నావల్ల కాలేదు. అందుకే పార్టీకి రాజీనామా చేశా..’ అని టీఆర్ఎస్​ మాజీ నాయకురాలు, కరీంనగర్​ నేత గండ్ర నళిని నారాయణ రెడ్డి అన్నారు. గతంలో కరీంనగర్​, వేములవాడ నుంచి పోటీ చేసిన గండ్ర నళిని నిజామాబాద్​మాజీ ఎంపీ, తెలంగాణ ఉద్యమకారుడైన ఎం.నారాయణ రెడ్డిబిడ్డ.

సహనం నశించి బయటకు వచ్చా
‘మా నాన్న 1969 ఉద్యమ కాలంలో తెలంగాణ కోసం పార్లమెంట్ లో ప్రసంగాలు చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేశారు. కేసీఆర్​ కూడా నాన్న దగ్గరికి వచ్చి సలహాలు తీసుకునేవారు. లంచ్​లు చేసేవారు. అట్లాంటి కుటుంబం నుంచి వచ్చి టీఆర్ఎస్ ​కోసం ఎంతో పని చేస్తే చెప్పరానంత అవమానానికి గురి చేశారు. కుటుంబ పార్టీగా తయారైంది టీఆర్ఎస్. అందరికీ పదవులు ఇచ్చుకున్నారు. దగ్గరి వాళ్లకూ  ఒక్కో కుటుంబంలో మూడేసి పదవులిస్తారు. మాలాంటి వాళ్లకు అపాయింట్ మెంట్​ కూడా ఇవ్వరు. ఆ పార్టీలో ఉండడంలో అర్థం ఏముందని సహనం నశించి బయటకు వచ్చేశా. ఏం చేయాలో తర్వలో డిసైడ్​ చేసుకుంటా..’ అని నళిని వెల్లడించారు. 
పదవులియ్యలె.. మర్యాద దక్కలె
చదువుకున్న తనలాంటి వారిని పట్టించుకోకుండా బయట నుంచి వచ్చిన ఎవరికో పదవులు అంటగడుతున్నారని నళిని అన్నారు. కరీంనగర్​లో పంచాయతీ ఎలక్షన్ల నుంచి కార్పొరేషన్​ వరకు, జనరల్ ఎలక్షన్లలో కూడా పార్టీ కోసం పనిచేశాననీ, చివరకు ఈ మధ్య జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తానుండే బంజారాహిల్స్ లో కూడా  టీఆర్ఎస్​ అభ్యర్థి గెలుపు కోసం కష్టపడ్డానని చెప్పారు. ‘ఎంత కష్టపడ్డా గుర్తింపు లేదు. పదవులు ఇవ్వకపోయినా పరవా లేదు. కనీస మర్యాద కూడా లేకుండా చూడడం అవమానకరం. ఒక రాజకీయ కుటుంబం, తెలంగాణ ఉద్యమ నేపథ్యమున్న నాకే ఈ పరిస్థితి ఉందంటే.. ఇట్లాంటి వాళ్లు పార్టీలో ఇంకెందరున్నారో అనిపిస్తున్నది. పైసల పార్టీగా మారిపోయింది టీఆర్ఎస్.. అసలు టాటా, బిర్లాలాంటోళ్లకు టికెట్లిచ్చుకుంటే ఏ బాధ ఉండదు’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తాను ఆ పార్టీని వదలక తప్పలేదన్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ తోపాటు రాజీనామా చేసిన తాను ఏం చేయాలో త్వరలో నిర్ణయించుకుంటానన్నారు.