హుజూరాబాద్‌‌లో టీఆర్​ఎస్​ తొండాట

హుజూరాబాద్‌‌లో టీఆర్​ఎస్​ తొండాట
  • ప్రభుత్వ కార్యక్రమాల్లో పార్టీ ప్రమోషన్
  • హుజూరాబాద్‌‌లో ఆఫీసర్లను అడ్డంగా వాడుకుంటున్న గులాబీ పార్టీ లీడర్లు
  • టీఆర్ఎస్​ అభ్యర్థి గెల్లు చేతుల మీదుగా చెక్కుల పంపిణీ
  • దళితబంధు సర్వేలో గులాబీ కండువాలతో లీడర్ల హడావుడి
  • పార్టీ ప్రచారంలో సాంస్కృతిక సారథి కళాకారుల ఆటపాటలు
  • అధికారిక కార్యక్రమాల్లో ఉప ఎన్నిక ప్రచారం

ఈ మధ్య వరదల కారణంగా జమ్మికుంట హౌసింగ్ బోర్డు కాలనీలో సుమారు 500 ఇండ్లలోకి నీళ్లు చేరాయి. తాత్కాలిక సాయం కింద 460 కుటుంబాలకు సర్కారు రూ.17.5 లక్షలు రిలీజ్ చేసింది. బాధితులకు రూ.3,800 చొప్పున చెక్కులను రెడీ చేసిన ఆఫీసర్లు.. గత ఆదివారం కాలనీలో పంపిణీ చేపట్టారు. అయితే ఆఫీసర్లు, లేదంటే ప్రజాప్రతినిధులు మాత్రమే చెక్కులు అందజేయాల్సి ఉంది. కానీ ప్రజాప్రతినిధి కాకున్నా టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్​యాదవ్ తో బాధితులకు చెక్కులను పంపిణీ చేయించారు. సీఎం రిలీఫ్ ఫండ్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను కూడా గెల్లు శ్రీనివాస్‌‌ చేతుల మీదుగానే అందజేస్తున్నారు. నేతల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 

హుజూరాబాద్ మండలం కందుగుల గ్రామంలో ఆగస్టు 23న సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ తరపున ధూంధాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ​అభ్యర్థి గెల్లు శ్రీనివాస్​ పాల్గొన్నారు. ఆయనను గెలిపించాలని కోరుతూ రసమయి ప్రసంగించారు. ఇక్కడిదాకా బాగానే ఉన్నా.. ప్రభుత్వం నుంచి వేతనాలు తీసుకుంటున్న సుమారు 15 నుంచి 20 మంది సాంస్కృతిక సారథి కళాకారులు టీఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ ​టీ షర్టులు వేసుకుని.. గెల్లు తరఫున పాటలు పాడి, డ్యాన్సులు చేశారు.

కరీంనగర్, వెలుగు: త్వరలో ఉప ఎన్నిక జరగనున్న హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ లీడర్లు యథేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఓ వైపు పోలీసుల ద్వారా ప్రతిపక్ష నేతలను వేధిస్తూ.. మరోవైపు ఆఫీసర్లను తమ పార్టీ అవసరాలకు, ప్రచార కార్యక్రమాలకు వాడుకుంటున్నారు. ప్రభుత్వానికి, పార్టీకి మధ్య ఉన్న గీతను చెరిపేసి, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్​ను అధికారిక వేదికలపైకి ఆహ్వానిస్తూ  ప్రమోట్ చేస్తున్నారు. ఎలాంటి పదవి లేని ఆయనతో వరద బాధితులకు సాయం, సీఎం రిలీఫ్ ఫండ్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ లబ్ధిదారులకు చెక్కులు ఇప్పిస్తున్నారు. ప్రొటోకాల్ పక్కన పెట్టి పక్క నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయిస్తున్నారు. ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటున్న సాంస్కృతిక సారథి కళాకారులు టీఆర్ఎస్ మీటింగుల్లో గజ్జె కట్టి ఆడుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలైతే హుజూరాబాద్​లో ఏ కార్యక్రమం చేపట్టినా దాన్ని ఓట్లతో ముడిపెడుతున్నారు. కులాలవారీగా కమ్యూనిటీ హాళ్లు, గుళ్లు, గోపురాలకు ప్రభుత్వ సొమ్ము శాంక్షన్ చేస్తూ, టీఆర్ఎస్​కు ఓటేస్తామని కుల పెద్దలతో తీర్మానాలు చేయిస్తున్నారు.

ఆఫీసర్ల బదిలీలతో స్టార్ట్
నిజానికి హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆఫీసర్ల ట్రాన్స్​ఫర్లతోనే అధికార దుర్వినియోగం మొదలైంది. ఈటల రాజీనామా తర్వాత ప్రభుత్వం ఈ నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈటలకు దగ్గరగా ఉంటారనే నెపంతో 5మండలాల్లోని పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్ డిపార్ట్‌‌మెంట్ల ఆఫీసర్లనువేరేచోట్లకు ట్రాన్స్​ఫర్​ చేసింది. హుజూరాబాద్ ఆర్డీఓ బెన్​షా స్థానంలో రవీందర్ రెడ్డిని, ఏసీపీ శ్రీనివాస్ స్థానంలో వెంకటరెడ్డిని నియమించింది. ముగ్గురు సీఐలను, ఇద్దరు ఎస్ఐలను, ఐదుగురు తహసీల్దార్​లను, ఐదుగురు ఎంపీడీఓలను, ఇద్దరు మున్సిపల్ కమిషనర్లను మార్చింది. తమకు అనుకూలంగా పనిచేయడం లేడని.. హుజూరాబాద్ సీఐగా సదన్ కుమార్ బాధ్యతలు చేపట్టి 2 నెలలు కాకముందే తప్పించారు.

పోలీసులతో కక్ష సాధింపులు
అధికార పార్టీ లీడర్లు పోలీసుల సాయంతో ప్రత్యర్థులపై, ముఖ్యంగా ఈటల అనుచరులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారనే ఆరోపణలున్నాయి. ఆయా లీడర్లను ముందుగా పార్టీ మారాలని ఒత్తిడి తెస్తున్న గులాబీ నేతలు.. మాట వినకపోతే పాత కేసులు తిరగదోడుతున్నారు. ఈ మధ్య వీణవంక మండలానికి చెందిన ఈట‍ల అనుచరుడు కరుణాకర్ రెడ్డిపై పార్టీ మారాలని ఒత్తిడి తెచ్చారు. ఆయన ఒప్పుకోకపోవడంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని హెచ్చరించడం చర్చనీయాంశమైంది. ఈటల వెంట ఉన్న నేతల వ్యాపారాలపైనా పోలీసులతో నిఘా పెట్టించి, వాళ్లను లొంగదీసుకుంటున్నారని బీజేపీ నేతలు అంటున్నారు. ఇప్పటికే ఆయా మండలాల్లోని ఈటల అనుచరుల ఇసుక ట్రాక్టర్ల లిస్టును తీసుకున్న పోలీసులు.. రెవెన్యూ, మైనింగ్ ఆఫీసర్ల సాయంతో పలుచోట్ల దాడులు నిర్వహించారు. వీణవంక మండలంలోని ఓ నేతకు చెందిన ఇసుక డంపును సీజ్ చేసి.. పార్టీ మారితేనే ఇసుక రవాణాకు అనుమతిస్తామని ఓ ప్రజాప్రతినిధితో చెప్పించినట్లు తెలిసింది. టీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ ద్వారా అప్పట్లో ఈటలకు వ్యతిరేకంగా కొన్ని వార్తలను ‘సృష్టించి’, ఆ క్లిప్పింగులను వైరల్ చేశారు. దీనిపై బీజేపీ లీడర్లు పోలీస్​స్టేషన్లలో ఫిర్యాదు చేసినా బాధ్యులపై ఇప్పటిదాకా ఎలాంటి కేసులు నమోదు చేయలేదు. జమ్మికుంట, హుజూరాబాద్ టౌన్లలో అధికార పార్టీ నేతలు ఇష్టారీతిగా ఫ్లెక్సీ లు పెట్టినా పట్టించుకోని మున్సిపల్ అధికారులు.. బీజేపీ నేతలు పెట్టే ఫ్లెక్సీలను మాత్రం గంటల వ్యవధిలోనే తొలగిస్తున్నారు.

రూల్స్ పట్టించుకుంటలే
హుజూరాబాద్ నియోజకవర్గంలోనే అన్ని ఎస్సీ కుటుంబాలకు దళితబంధు అమలవుతోంది. వందల కోట్లతో డెవలప్​మెంట్ కార్యక్రమాలు నడుస్తున్నాయి. కమ్యూనిటీ హాళ్లు, టెంపుళ్ల నిర్మాణం, కొత్త పింఛన్లు, రేషన్ కార్డుల జారీ, సీఎం రిలీఫ్ ఫండ్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్​చెక్కుల పంపిణీ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. నిజానికి ఇవన్నీ ప్రభుత్వం చేపడుతున్న అఫీషియల్ కార్యక్రమాలు. కానీ టీఆర్ఎస్ లీడర్లు.. ప్రతి కార్యక్రమాన్ని ఎన్నికల ప్రచారం కోసం, తమ క్యాండిడేట్​ప్రమోషం కోసం వాడుకుంటున్నారు. రూల్స్‌‌కు వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానించి, అందరికీ పరిచయం చేసి, ప్రమోట్ చేస్తున్నారు. రూల్స్ ప్రకారం ఏదైనా ప్రభుత్వ కార్యక్రమం జరిగితే ఆ వేదికపై కేవలం ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు మాత్రమే కూర్చోవాలి. కానీ హుజూరాబాద్ లో జరిగే ప్రతి ఆఫీషియల్ ప్రోగ్రామ్‌‌కు మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను ఆహ్వానిస్తున్నారు. ఆయన పేరును వేదికపైనే అనౌన్స్ చేసి.. ప్రచారం చేసుకుంటున్నారు. చేనేత కార్మికులకు రావాల్సిన నూలు రాయితీ పంపిణీ, సహకార సంఘాల మహిళలకు రుణాల చెక్కుల పంపిణీ, గొర్రెల పంపిణీ.. ఇలా అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ గెల్లు పాల్గొంటున్నారు. ఇంకా ఎమ్మెల్సీగా గవర్నర్ ఆమోద ముద్ర పడని కౌశిక్ రెడ్డి కూడా అధికారిక వేదికపై కనిపిస్తున్నారు. ఆయా వేదికలపై మాట్లాడుతున్న మంత్రులు.. ఈటల రాజేందర్ ను విమర్శిస్తూ, గెల్లును గెలిపించాలని కోరుతున్నారు.

సంబంధం లేని ఎమ్మెల్యేలతో శంకుస్థాపనలు
సాధారణంగా ఏదైనా నియోజకవర్గ పరిధిలో జరిగే అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు అక్కడి లోకల్ ఎమ్మెల్యేలే చేయాలి. సీఎం, మంత్రులకు మాత్రమే మినహాయింపు ఉంటుంది. కానీ హుజూరాబాద్ నియోజకవర్గంలో జరిగే రోడ్లు, డ్రైనేజీలు తదితర అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, చెక్కులు, రేషన్ కార్డుల పంపిణీ లాంటి కార్యక్రమాల్లో పక్క నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు పాల్గొంటున్నారు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్.. ఇల్లందకుంటలో, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి.. కమలాపూర్ మండలంలో, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్.. వీణవంక మండలంలో, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నమనేని నరేందర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్.. జమ్మికుంట మండలంలో జరిగే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వీరంతా టీఆర్ఎస్ అభ్యర్థిని వెంటబెట్టుకుని తిరుగుతున్నారు. ఇటీవల జమ్మికుంట హౌసింగ్ బోర్డు కాలనీ వాసులకు వరద సాయం కింద వచ్చిన చెక్కులను ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, గెల్లు శ్రీనివాస్ తో కలిసి పంపిణీ చేశారు. ఇది రూల్స్‌‌కు పూర్తి వ్యతిరేకం. ఎమ్మెల్యే లేని నియోజకవర్గాల్లో అధికారులు గానీ, మంత్రి గానీ చెక్కులు పంపిణీ చేయాల్సి ఉండగా.. నాన్​లోకల్ ఎమ్మెల్యే, పార్టీ అభ్యర్థి చేతుల మీదుగా పంపిణీ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి హరీశ్ రావు ఇటీవల జమ్మికుంటలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనగా గెల్లు అదే వేదికపై కూర్చున్నారు. హుజూరాబాద్ లో సీఎం లాంచ్ చేసిన దళిత బంధు ప్రోగ్రామ్ లోనూ గెల్లు శ్రీనివాస్ వేదికపైకి వచ్చి కూర్చోవడం గమనార్హం.

హుజూరాబాద్​లో దళితబంధు స్కీం పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ప్రభుత్వం.. 
ఎస్సీ కాలనీల్లో సర్వే చేపట్టింది. ఆఫీసర్లు వారం రోజులు ప్రతి ఇంటికీ వెళ్లి వ్యక్తిగత వివరాలు, పెట్టబోయే యూనిట్ల సమాచారం సేకరించారు. దీన్ని రూలింగ్ పార్టీ లీడర్లు తమకు అనుకూలంగా మలుచుకున్నారు. టీఆర్ఎస్ లీడర్లు గులాబీ కండువాలు వేసుకొని సర్వేలో పాల్గొన్నారు. గుంపులు గుంపులుగా వస్తున్న  గులాబీ నేతలను చూసి హుజూరాబాద్ లోని 6 వార్డులో ఆగస్టు 31న  కొందరు ప్రతిపక్ష నేతలు, స్థానిక ప్రజలు అడ్డుకున్నారు.

పార్టీ కార్యక్రమాలకు ప్రభుత్వ కళాకారులు
ఇటీవల జమ్మికుంటలో స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ వేదికపై సాంస్కృతిక సారథి కళాకారులు కారు గుర్తు ఉన్న గులాబీ కలర్ టీ షర్టులు ధరించి ప్రదర్శన ఇచ్చారు. అఫీషియల్​ కార్యక్రమాల్లో ఇలా పార్టీ టీ షర్టులతో ప్రచారం చేస్తున్న ప్రభుత్వ కళాకారులు.. టీఆర్ఎస్ ధూంధాం వేదికలపైనా ప్రదర్శనలిస్తున్నారు. నిజానికి సాంస్కృతిక సారథి ఉద్యోగులుగా వీరంతా ప్రభుత్వం నుంచి నెలనెలా వేతనాలు తీసుకుంటున్నారు. కేవలం ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి మాత్రమే వీళ్లు ప్రచారం చేయాల్సి ఉంది. కానీ టీఆర్ఎస్ పార్టీ వేదికలపై వీరంతా ఆడిపాడుతున్న తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

ఫిర్యాదు చేసినా పట్టించుకోలే
ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు టీఆర్​ఎస్​ అభ్యర్థిని ఆహ్వానించి.. ఆయన చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడం సిగ్గుచేటు. ఇతర జిల్లాల ఎమ్మెల్యేలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తుంటే అధికార యంత్రాంగం వంతపాడుతోంది. చెక్కులు పంపిణీ చేసిన టీఆర్ఎస్ అభ్యర్థిపై జిల్లా కలెక్టర్​కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. టీఆర్ఎస్ లీడర్లు చేస్తున్న ఆగడాలను ప్రజలు గమనిస్తున్నారు.
‑ ఎర్రబెల్లి సంపత్ రావు, బీజేపీ కరీంనగర్​ జిల్లా ఉపాధ్యక్షుడు

ఏ హోదాలో పాల్గొంటున్నరు?
హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం అధికార యంత్రాంగాన్ని వాడుకుంటోంది. రాష్ర్ట మంత్రులు, వలస వచ్చిన ఎమ్మెల్యేలు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏ హోదాలో పాల్గొంటున్నారో చెప్పాలె
- కసుబోజుల వెంకటేశ్వర్లు,  కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు, జమ్మికుంట