
రేపు సాయంత్రం కరీంనగర్ సభతో TRS లోక్ సభ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. సభ ఏర్పాట్లను మంత్రి ఈటల రాజేందర్ పరిశీలించారు. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు రాష్ట్రానికి ఎంత అవసరం అనేది కేసీఆర్ వివరిస్తారని ఈటల చెప్పారు. దేశంలో సంకీర్ణ రాజకీయాలపైనా ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేస్తారని అన్నారు.
కరీంనగర్ బహిరంగ సభతోనే టీఆర్ఎస్ లోక్ సభ ఎన్నికల ప్రచారం మొదలుకానుంది. అంతకుముందే కేసీఆర్.. లోక్ సభ ఎన్నికల టీఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్ ను విడుదల చేస్తారు. కరీంనగర్ నుంచి సిట్టింగ్ ఎంపీ వినోద్ మళ్లీ బరిలో దిగుతున్నారు.
ఏప్రిల్ 11న లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ప్రచారానికి 24 రోజుల పాటు సమయం ఉంది. దీంతో… రాష్ట్రంలోని 17 లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో సీఎం కేసీఆర్ ప్రచారం నిర్వహించాలని నిర్ణయించారు. హైదరాబాద్ మినహా మిగిలిన 16 నియోజకవర్గాల్లో కేసీఆర్ బహిరంగ సభల్లో పాల్గొంటారు.