పైసలు కావాల్నా.. కాంట్రాక్టులు కావాల్నా..

పైసలు కావాల్నా..  కాంట్రాక్టులు కావాల్నా..

    రంగంలోకి మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్​ నేతలు

    కాంట్రాక్టులు, నామినేటెడ్​ పదవులు, డబ్బులతో ఎర

    వినకుంటే పాత కేసులు తిరగదోడుతమంటూ బెదిరింపులు

    గజ్వేల్​లోని 20 వార్డుల పరిధిలో111 మంది గులాబీ నేతల పోటీ

‘తమ్మీ.. ఇయ్యాళ్టితోనే అయిపోతదా చెప్పు.. పార్టీ మనదే, పవర్​ మనదే.. పైసలు కావాల్నా ఎంతో కొంత ఇప్పిస్తా.. కాదంటవా నామినేషన్​ పోస్టు వచ్చేట్టు చూస్త.. లేకపోతే నీ మీదున్న కేసులు తోడ్తరట.. తర్వాత నీ ఇష్టం. ఎందుకచ్చిన లొల్లి.. నామినేషన్​ విత్​డ్రా చేసుకో’.. ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలోని ఓ మున్సిపాలిటీలో నామినేషన్​ వేసిన తమ పార్టీ ఆశావహుడికి అక్కడి టీఆర్ఎస్​ లీడర్​ బెదిరింపు ఇది. రాష్ట్రవ్యాప్తంగా చాలా మున్సిపాలిటీల్లో అధికార పార్టీ నుంచి చాలామంది ఆశావహులు నామినేషన్లు వేశారు. ఒక్కో వార్డులో ఐదుగురి నుంచి పది మందిదాకా టీఆర్ఎస్  వాళ్లే ఉన్నారు. వారిలో ఒకరికి టికెట్​ ఇస్తే మిగతా తొమ్మిది మంది రెబల్స్​గా మారే చాన్సుంది. దీంతో నష్టం జరుగుతుందన్న హైకమాండ్​ ఆదేశాల మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. క్యాండిడేట్లకు బీఫారాలు అందజేయకుండా ఆపేసి, ఆశావహులతో నామినేషన్లు విత్​డ్రా చేయించే పనిలో పడ్డారు.

ఎమ్మెల్యేల వద్దే బీఫారాలు

మున్సిపల్​ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా ఈ నెల 9న సీఎం కేసీఆర్ , టీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ చార్జిలతో తెలంగాణ భవన్​లో సమావేశమయ్యారు. రెబల్స్​ పట్ల కఠినంగా ఉండాలని సూచించారు. నామినేటెడ్​ పదవులు ఇస్తామని బుజ్జగించి విత్​డ్రా చేయించాలని, వినకుంటే పార్టీ నుంచి బహిష్కరించాలని, భవిష్యత్​లోనూ తీసుకోవద్దని చెప్పారు. తర్వాత ఎమ్మెల్యేలకు బీఫారాలు అందజేశారు. ఇది జరిగి ఐదు రోజులవుతున్నా మెజారిటీ ఎమ్మెల్యేలు, ఇన్​చార్జులు ఇంకా క్యాండిడేట్లకు బీఫారాలను పంపిణీ చేసే ధైర్యం చేయలేకపోతున్నారు. వార్డుల్లో ఒకరికి బీఫామ్​ఇస్తే మిగతావారంతా రెబల్స్​గా మారే ప్రమాదముందని భయపడుతున్నారు. వారితో విత్​డ్రా చేయించాక ఈ నెల 14న​ క్యాండిడేట్ల పేరుతో నేరుగా ఆఫీసర్లకే బీఫారాలు అందజేయాలని భావిస్తున్నారు.

10 లక్షలకు తగ్గకుండా కాంట్రాక్టులిస్తమంటూ..

ఆశావహులతో నామినేషన్లు విత్ డ్రా చేయించేందుకు ఎమ్మెల్యేలు, వారి అనుచరులు, ఇతర లీడర్లు రకరకాల ఆఫర్లతో ముందుకొస్తున్నారు. క్యాష్​ కావాలా, కాంట్రాక్టులు కావాలా? అని అడుగుతున్నారు. మున్సిపాలిటీని బట్టి రూ.లక్ష నుంచి రూ.5 లక్షల దాకా ఆఫర్​ చేస్తున్నారు. టికెట్ దక్కిన అభ్యర్థి నుంచి ఆ సొమ్ము ఇప్పిస్తామని చెప్తున్నారు. రూ.10 లక్షలకు తగ్గకుండా కాంట్రాక్టులు అప్పగిస్తామని ఆశపెడుతున్నారు. ఇంకొన్ని మున్సిపాలిటీల పరిధిలో కో–ఆప్షన్​ సభ్యులుగా చాన్స్​ ఇస్తామని, లేదంటే నామినేటెడ్​ పదవులు ఇప్పిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ ఆఫర్లకు వినకుంటే బెదిరింపులకు దిగుతున్నారు. పార్టీ నుంచి బహిష్కరిస్తామని, భవిష్యత్​లోనూ తీసుకోమని సీఎం చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. కొందరైతే మరో అడుగు ముందుకు వేసి పాత కేసులు తిరగదోడుతామని బెదిరిస్తున్నారు. పోలీసులతోనూ ఫోన్లు​ చేయించి భయపెడుతున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కొందరు టీఆర్ఎస్​ లీడర్లు సొంత పార్టీవాళ్లనే కాకుండా కాంగ్రెస్​, బీజేపీ క్యాండిడేట్లు, ఇండిపెండెంట్లను బెదిరించి, ఏకగ్రీవాల కోసం ప్రయత్నిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.

ఎన్నెన్ని సిత్రాలో..

సిద్దిపేట జిల్లాలో సీఎం కేసీఆర్​ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ మున్సిపాలిటీ లో 20 వార్డులున్నాయి. ఇక్కడ టీఆర్ఎస్​ నుంచి ఏకంగా 111 మంది నామినేషన్ వేశారు. వార్డుకొకరు చొప్పన 20 మందిపోగా మిగతా 91 మందితో విత్​డ్రా చేయించేందుకు అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్​ వంటేరు ప్రతాపరెడ్డి రంగంలోకి దిగారు. ఒక్కొక్కరికి పది లక్షలకు తగ్గకుండా కాంట్రాక్టులు ఇస్తామని, అవకాశమున్నప్పుడు నామినేటెడ్​ పదవులిస్తామని బుజ్జగిస్తున్నట్టు తెలిసింది.

మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలో 15 వార్డులు ఉండగా, టీఆర్ఎస్ నుంచి 55 మంది నామినేషన్లు వేశారు. 40 మందితో విత్​డ్రా చేయించడానికి ఎమ్మెల్యే పడరాని పాట్లు పడుతున్నారు. మున్సిపల్​ చైర్మన్​ స్థానాన్ని ఆశించి, ఒకటో వార్డు నుంచి నామినేషన్​ వేసిన సీనియర్ లీడర్ అశోక్ గౌడ్​ను బుజ్జగించేందుకు స్వయంగా మంత్రి హరీశ్​రావు రంగంలోకి దిగారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లు పార్టీ కేడర్​ చెప్పుకుంటున్నారు.

కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి, కొత్తపల్లి మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్​ నుంచి పోటీ తీవ్రంగా ఉంది. ఒక్కో వార్డు నుంచి సగటున10 మంది నామినేషన్లు వేశారు. దీంతో మంత్రి ఈటల రాజేందర్​ స్వయంగా రంగంలోకి దిగి బుజ్జగిస్తున్నారు. కో ఆప్షన్ సభ్యులుగానో, మార్కెట్​ కమిటీల్లోనో నియమిస్తామని హామీ ఇస్తున్నారు.

సంగారెడ్డి జిల్లాలో ఐడీఏ బొల్లారం, అమీన్ పూర్, సదాశివపేట, సంగారెడ్డి మున్సిపాలిటీల పరిధిలో టీఆర్ఎస్ నుంచి పెద్దసంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. రియల్​ ఎస్టేట్​ జోరుగా సాగే ఈ పట్టణాల్లో కౌన్సిలర్​ పదవులు కోట్లలో పలుకుతున్నాయి. అమీన్ పూర్, బొల్లారం మున్సిపాలిటీల్లో నామినేషన్లను విత్ డ్రా చేసుకునేందుకు రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. సంగారెడ్డి, సదాశివపేటల్లో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు అడుగుతున్నారు. నామినేటెడ్ పదవులు ఇస్తామని ముందుగా అగ్రిమెంట్​ రాసిస్తే విత్​డ్రా చేసుకుంటామని ఆశావహులు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీలో ఎమ్మెల్యే బానోతు హరిప్రియ వర్గానికి చెందిన కొందరు లీడర్లు సొంత పార్టీ నేతలతోపాటు ఇతర పార్టీలకు చెందినవారినీ బెదిరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పోలీసుల సాయంతో పాత కేసులు తిరగదోడుతామని,  నామినేషన్లు విత్​డ్రా చేసుకోవాలని హెచ్చరిస్తున్నట్టు పలువురు వాపోతున్నారు. కొత్తగూడెం మున్సిపాలిటీలోనూ బలమైన అభ్యర్థులను ఎమ్మెల్యే వనమా వర్గీయులు ప్రలోభాలకు గురిచేయడంతో పాటు బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది.

మంచిర్యాల జిల్లా చెన్నూర్, క్యాతన్​పల్లి మున్సిపాలిటీల్లో లోకల్​ ఎమ్మెల్యే​ అనుచరులు టీఆర్ఎస్ నుంచి నామినేషన్​ వేసిన వారిని రకరకాలుగా ​బెదిరిస్తున్నారని సమాచారం. విత్​డ్రా చేసుకోకుంటే ఓపెన్​కాస్టు గనుల్లో కాంట్రాక్టు కార్మికులుగా, సింగరేణిలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న వారి బంధువులను ఉద్యోగాల్లోంచి తొలగిస్తామని హెచ్చరిస్తున్నట్టు తెలిసింది. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం కీలక నాయకుడు ఒకరు పోలీస్​అధికారుల పేర్లు చెబుతూ బెదిరింపులకు గురిచేస్తున్నాడని కొందరు వాపోతున్నారు. సొంత పార్టీ వారినే కాకుండా బీజేపీ వాళ్లను, ఇండిపెండెంట్లనూ విత్​డ్రా చేసుకొమ్మని ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం.