సీఎం వస్తే సీన్‌ మారిపోతది : కేటీఆర్

సీఎం వస్తే సీన్‌ మారిపోతది : కేటీఆర్

సర్వేలో కాంగ్రెస్‌ కన్నా ముందున్నం
బీజేపీ అసలు సీన్‌లోనే లేదు
బైపోల్స్‌ కోసం 30 మంది ఇన్‌చార్జులు
రెఫరెండం సవాల్‌ను
సీరియస్‌గా తీసుకోం.. ఉప ఎన్నికపై మీడియాతో కేటీఆర్ చిట్‌చాట్

హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఉపయోగమని, అదే టీఆర్ఎస్ గెలిస్తే ఆ నియోజకవర్గ జనానికి లాభమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇదే నినాదంతో ఎన్నికల ప్రచారం చేస్తామని చెప్పారు. తొలిసారి అక్కడ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఉపఎన్నికపై బుధవారం మీడియాతో కేటీఆర్ చిట్‌చాట్ చేశారు.

ట్రక్కు లేకుంటే అప్పుడే గెలిచేటోళ్లం

ట్రక్కు గుర్తు లేకపోతే అసెంబ్లీ ఎన్నికల్లోనే అక్కడ పార్టీ గెలిచేదని, ఆ ట్రక్కు వల్లే ఉత్తమ్ గెలిచారని కేటీఆర్‌ అన్నారు. గెలిస్తే సీఎం అవుతానని ప్రచారం చేసుకోవడం వల్లే ఆయన గెలవగలిగారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారన్న సానుభూతి సైదిరెడ్డి విజయానికి పనికొస్తుందని అన్నారు. సైదిరెడ్డి లోకల్ కాదన్న ప్రచారం అవాస్తవమన్నారు. హుజూర్‌నగర్ పరిధిలోని 5 జెడ్పీటీసీలను గెలిచామని, ఉప ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తామని వివరించారు. రైతు బంధు, రైతు బీమా, సాగర్ నీళ్లు లాంటి అంశాలు తమకు కలిసొస్తాయని వివరించారు. సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలోకి అడుగుపెడితే సీన్ మారి పార్టీకి మరింత మెరుగైన ఫలితం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ అభ్యర్థి ఇప్పటికే ఓ సెట్ నామినేషన్ వేశారని, ఎన్నికల ఇన్‌చార్జులు గురువారం నుంచి ప్రచారం ఉధృతం చేస్తారని చెప్పారు.

సర్వేల్లో మేమే ముందున్నాం

ఉప ఎన్నికలో కాంగ్రెస్‌తోనే తమకు పోటీ అని, బీజేపీ సీన్‌లో లేదని కేటీఆర్‌ చెప్పారు. తాజాగా ఓ సంస్థ చేసిన సర్వేలో టీఆర్ఎస్ ఫస్ట్ ప్లేస్‌లో ఉందని తెలిసిందన్నారు. టీఆర్ఎస్‌కు 54.6 శాతం, కాంగ్రెస్‌కు 41 శాతం ఓట్లు, బీజేపీకి 2.55 శాతం ఓట్లు  వచ్చాయన్నారు. ఉత్తమ్‌కు మాట మీద నిలబడే తత్వం లేదని, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాలు విసిరి ఏం చేశారో  అందరికీ తెలుసని కామెంట్ చేశారు. ‘ఉప ఎన్నిక రెఫరెండం’ అనే సవాల్‌ను సీరియస్‌గా తీసుకోమన్నారు.

ప్రతి ఎన్నిక మాకు సీరియస్సే

ఏ ఎన్నికైనా టీఆర్ఎస్ సీరియస్‌గా తీసుకుంటుదని కేటీఆర్‌ అన్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో సీఎం కూడా పాల్గొంటారని, ఎన్ని సభలకు హాజరవుతారో త్వరలో నిర్ణయం జరుగుతుందని చెప్పారు.
తానూ ప్రచారం చేస్తానని.. రోడ్ షోనా, ఎన్నికల సభనా? పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. హరీశ్‌రావు కూడా పాల్గొంటారా అని అడగ్గా ఎవరు ప్రచారం చేయాలో పార్టీ నిర్ణయిస్తుందని చెప్పారు.

ఫలితాలతో పార్టీ సత్తా తెలుస్తుది

అక్టోబర్‌ 24న వచ్చే ఫలితాలతో టీఆర్‌ఎస్‌ సత్తా తెలుస్తుందని కేటీఆర్‌ చెప్పారు. హుజూర్‌నగర్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎక్కువ ఓట్లు వస్తే.. తమకు జిల్లా పరిషత్ ఎన్నికల్లో 18 వేల మెజార్టీ ఓట్లు వచ్చాయని గుర్తు చేశారు. ఉప ఎన్నిక కోసం 30 మంది ఇన్‌చార్జులను వేశామని తెలిపారు.

మెట్రో ఘటనపై వివరాలు తెలుసుకునే స్పందించా

మెట్రో ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకున్నాకే ట్వీట్ చేశానని కేటీఆర్‌ చెప్పారు. ఎలాంటి సమాచారం లేకుండా మంత్రి హోదాలో స్పందిస్తే బాగుండదన్నారు. బాధితులకు న్యాయం జరుగుతుందని అన్నారు.

త్వరలో నామినేటెడ్ పోస్టులు

ప్రభుత్వంలోని నామినేటెడ్ పోస్టులు త్వరలో భర్తీ అవుతాయని కేటీఆర్‌ తెలిపారు. ఉప ఎన్నికకు ముందా.. తరువాత అనేది సీఎం నిర్ణయిస్తారని చెప్పారు.

‘మహా’ ఎన్నికల్లో పోటీ గురించి తెల్వదు

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీ చేస్తుందా అని అడగ్గా తనకు తెలియదని కేటీఆర్‌ చెప్పారు. అక్కడ కూడా పార్టీ కార్యాలయాలు తెరిచారనగా నవ్వుతూ ‘ఏమో’ అన్నారు.

టీఆర్ఎస్ గెలుపు కోసం పని చేస్త: శంకరమ్మ

టీఆర్ఎస్ క్యాండిడేట్‌ సైదిరెడ్డి గెలుపు కోసం పని చేస్తానని శంకరమ్మ తెలిపారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా హుజూర్‌నగర్ నుంచి పోటీ చేసి ఆమె ఓడిపోయారు. ఉప ఎన్నికలో పార్టీ టికెట్ ఇవ్వాలని కొన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. బుధవారం తెలంగాణ భవన్‌కు మంత్రి జగదీశ్‌రెడ్డితో వచ్చి కేటీఆర్‌తో శంకరమ్మ సమావేశమయ్యారు. భేటీ తరువాత టీఆర్ఎస్ విజయం కోసం పని చేస్తానని చెప్పారు. కేసీఆర్‌పై నమ్మకం ఉందని, పార్టీలో కొనసాగుతానని తెలిపారు.

కాంగ్రెస్‌ బలంగా ఉంది

ఉప ఎన్నికను ఆషామాషీగా తీసుకోవద్దు
ఇన్‌చార్జీలకు కేటీఆర్‌ ఆదేశం

హైదరాబాద్‌, వెలుగు: కాంగ్రెస్‌ బలంగా ఉందని, హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికను ఆషామాషీగా తీసుకోవద్దని  టీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హెచ్చరించారు. ఉప ఎన్నికలు ముగిసేవరకు హుజూర్‌నగర్‌ దాటి రావొద్దని పార్టీ ఇన్‌చార్జీలను ఆయన ఆదేశించారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఉప ఎన్నికల ఇన్‌చార్జీలతో ఆయన సమావేశమయ్యారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలకు జడ్పీ చైర్మన్‌లు, ఎమ్మెల్సీలు, పార్టీ జనరల్‌ సెక్రటరీలను ఇన్‌చార్జీలుగా నియమించారు. గెలుపే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. స్థానిక నేతలందరిని సమన్వయం చేసుకుంటూ కలిసి పని చేయాలన్నారు. పోటీలో ఉన్న ప్రతిపక్ష అభ్యర్థి పీసీసీ చీఫ్‌ భార్య అని, నల్గొండ నేతలంతా ఒక్కటైనట్టుగా తెలుస్తోందని, ఇలాంటి పరిస్థితుల్లో వాళ్లు ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోరని చెప్పినట్టుగా తెలిసింది. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో పార్టీ గెలిచి తీరాలని, ఒకవేళ ప్రతిపక్షం గెలిస్తే ఇక టీఆర్‌ఎస్‌ పని అయిపోయిందని ప్రచారం చేస్తారని హెచ్చరించారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ హుజుర్​నగర్​లో ఎన్నో జిమ్మిక్కులు చేసి గెలిచిందని, అయినా 8 వేల ఓట్ల తేడాతోనే టీఆర్ఎస్​అభ్యర్థి ఓడిపోయారని గుర్తు చేశారు. ట్రక్కు గుర్తుకు ఉత్తమ్‌ మెజార్టీకి మించి ఓట్లు వచ్చాయని అన్నారు. అప్పుడు అన్ని ఓట్లు వచ్చాయి కాబట్టి ఈజీగా గెలుస్తామని అనుకోవద్దని సూచించారు. ఎన్నికల్లో ప్రత్యర్థి బలాలను సరి చూసుకుని పని చేయాలన్నారు. గ్రామ, వార్డు స్థాయి నుంచి ప్రతి ఓటు పార్టీకి పడేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు గుర్తు చేస్తూ, ఏ ఇంటికి ఎంత ప్రయోజనం చేకూర్చామో వివరించి ఓట్లు అడగాలన్నారు. మహిళలు, వృద్ధులు, రైతుల ఓట్లలో ఒక్కటి కూడా పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉప ఎన్నికలతో పాటే మున్సిపల్‌ ఎన్నికలపైనా ఫోకస్‌ పెట్టాలన్నారు. ఈ ఎన్నికలు ముగియగానే మున్సిపల్‌ ఎన్నికలు వచ్చే అవకాశముందని, ఇప్పుడు అవకాశాన్ని చేజార్చుకుంటే జిల్లాలో మళ్లీ కాంగ్రెస్‌ బలం పుంజుకునే అవకాశముందని హెచ్చరించినట్టుగా తెలిసింది.

కాంగ్రెస్​, బీజేపీ కలిసి ఓడిస్తయేమో.. జాగ్రత్త

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీ కలిసి టీఆర్‌ఎస్‌ కేండిడేట్‌ను ఓడించే ప్రమాదముందని కేటీఆర్‌ తెలిపారు. నిజామాబాద్‌, కరీంనగర్‌ ఎంపీ ఎన్నికల్లో కుమ్మక్కైనట్టుగానే హుజూర్‌నగర్‌లోనూ ఆ రెండు పార్టీలు ఏకమయ్యే ప్రమాదముందని హెచ్చరించారు.