గెలిచే సత్తా ఉన్నవారికే టీఆర్ఎస్ టిక్కెట్లు

గెలిచే సత్తా ఉన్నవారికే టీఆర్ఎస్ టిక్కెట్లు

కరీంనగర్: మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి.. ఎన్నికల్లో గెలిచే సత్తా ఉన్నవారికే టికెట్లు కేటాయిస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హుజూరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి ఈటల రాజేందర్ ప్రెస్ మీట్ ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియా మాట్లాడారు. రాష్టంలో ఉన్న అన్ని జిల్లా పరిషత్ స్థానాలను గెలుచుకున్న ఘనత టీఆర్ఎస్‌కు మాత్రమే దక్కిందని ఆయన అన్నారు. దేశ చరిత్రలోనే ఇది ఒక రికార్డని ఆయన అన్నారు. అదే స్ఫూర్తితో పనిచేసి రాష్ట్రంలోని మొత్తం మున్సిపాలిటీల్లో కూడా గెలువబోతున్నామని ఆయన జోస్యం చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధుల విషయంలో బీజేపీ నేతలు గోరంతలు కొండంతలుగా చెప్పుకుంటున్నారని ఆయన అన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులతోనే మున్సిపాలిటీల అభివృద్ధి జరిగిందని బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన అన్నారు. కేంద్రం సంవత్సరానికి కేవలం 6 నుంచి 7 వేల కోట్లు మాత్రమే నిధులు కేటాయిస్తుంది. ఆ నిధులు కేంద్ర ప్రభుత్వం బిక్ష కాదు, మన హక్కు అని ఈటెల అన్నారు. ఆ మాత్రం దానికే వేల కోట్లు ఇస్తున్నామనడం కరెక్ట్ కాదని ఆయన అన్నారు. అమిత్ షా రాష్ట్రానికి వచ్చినప్పుడు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ప్రభుత్వం వివరణ ఇచ్చిందని ఆయన తెలిపారు.

హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు లేవని, ఆ పార్టీలు కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే కనిపిస్తాయని ఆయన అన్నారు. ఆ పార్టీలు ఎన్నికల గురించి మేల్కొనే లోపు ఎన్నికలే అయిపోతాయని ఆయన అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఎన్నికలంటేనే వణుకని ఆయన వ్యాఖ్యానించారు. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచే సత్తా ఉన్నవారికే తమ పార్టీ తరపున టిక్కెట్లు కేటాయిస్తామని ఆయన అన్నారు. కౌన్సిల్లర్ల నిర్ణయం మేరకే.. ఛైర్ పర్సన్‌ల ఎంపిక ఉంటుందని ఆయన తెలిపారు. అందరిని కలుపుకుని, పార్టీ కోసం పనిచేసేవారికే టిక్కెట్లు ఇస్తామని ఆయన తెలిపారు.

ఇండియా ఒక లౌకిక దేశం.. ఇక్కడ అన్ని మతాలు, వర్గాలు, జాతుల వారు సమానంగా, స్వేచ్ఛ, సౌబ్రాతృత్వంతో జీవించే హక్కు ఉందని ఆయన అన్నారు. పాలకులు తీసుకునే నిర్ణయాలు ప్రజల మధ్య చిచ్చు పెట్టె విధంగా ఉండకూడదని ఆయన అన్నారు. ప్రజల మధ్య లౌకిక స్ఫూర్తి దెబ్బతినకుండా చూడాలని ఆయన కోరారు. క్షణికావేశంలో నిర్ణయం తీసుకునే వారు పైకి రాలేరని ఆయన అన్నారు. రాజకీయాల్లో హత్యలు ఉండవని.. కేవలం ఆత్మహత్యలే ఉంటాయని ఆయన అన్నారు. నిరసనల నేపథ్యంలో.. ఏదైనా డిస్ట్రక్షన్(నాశనం చేయడం) తేలిక. కానీ, కన్‌స్ట్రక్షన్(నిర్మించడం) చేయడం కష్టమని ఆయన అన్నారు. ప్రజలు సంయమనం పాటించాలని ఆయన కోరారు.

For More News..

ఇంత ఘోరమైన చావా? చూస్తేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది..

ఏపీలో ఘోరం.. 68 ఏళ్ల వృద్ధురాలిపై 27 ఏళ్ల యువకుడి అత్యాచారం