మన పథకాలను వివరిస్తే చాలు.. గెలుపు ఖాయం

మన పథకాలను వివరిస్తే చాలు.. గెలుపు ఖాయం

ఎన్నికల్లో పోటీ చేసిన తమ పార్టీ అభ్యర్థులతో  టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కాన్ఫరెన్స్ లో ఆయన ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రచారంపై అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. గత ఆరు సంవత్సరాలుగా ప్రజలకు ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిందని అన్నారు.  పెన్షన్‌ల నుంచి మొదలుకొని సాగునీటి ప్రాజెక్టుల దాకా కేసీఆర్ కిట్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, నూతన జిల్లాల వికేంద్రీకరణ  ఇలా అనేక కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందని, సుమారు 45 వేల కోట్ల రూపాయతో  సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్న ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వమని అన్నారు.

ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధులు గెలవాలంటే.. తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తే సరిపోతుందన్నారు కేటీఆర్. తెలంగాణ పట్టణాలు దేశంలోనే ఆదర్శ మున్సిపాలిటీలుగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కంకణం కట్టుకుని ఉన్నదని, నూతన మునిసిపాలిటీ చట్టాన్ని కఠినంగా అమలు చేసి ప్రజలకు మరింత పారదర్శక వేగవంతమైన పౌర సేవలను అందిస్తామని ఆయన అన్నారు.

పార్టీ అభ్యర్థులు ఈ నాలుగు రోజుల్లో కనీసం మూడు నుంచి ఐదు సార్లు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలను మంచి సమాచారాన్ని అందించి ఓట్లు అడగాలని మంత్రి అన్నారు. ప్రతి వార్డు అవసరాల మేరకు, పట్టణాల అవసరాల మేరకు స్థానిక మేనిఫెస్టోను విడుదల చేయాలన్నారు. ఎన్నికలకు సంబంధించి పార్టీ కార్యాలయం ఎప్పటికప్పుడు నివేదిక తెప్పించుకుంటుందన్నారు.

కాంగ్రెస్ పార్టీ హయాంలో చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, ఖర్చు చేసిన నిధులను పోల్చుకుంటే టిఆర్ఎస్ ప్రభుత్వం పది రెట్లు పట్టణాల కోసం కేటాయించిందని చెప్పారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ పాలనను టీఆర్ఎస్ పార్టీ పాలనను బేరీజు వేసుకుని ప్రజలను ఓటు వేయాలని కోరాలని పార్టీ  అభ్యర్ధులకు కేటీఆర్ సూచించారు. పార్టీ అభ్యర్థులు గెలుపు మనదే అన్న ధీమాలో ప్రచారంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించవద్దని, బి ఫారం కోసం ప్రయత్నం చేసిన తోటి నాయకులతో కలుపుకుని సమిష్టిగా ఐక్యంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.  ప్రస్తుత నివేదికల ప్రకారం టీఆర్ఎస్ పార్టీకి పురపాలక ఎన్నికలలో విజయం తథ్యమని అన్నారు. ఫలితాల తర్వాత గెలిచిన అందరూ అభ్యర్థులతో మరోసారి సమావేశం అవుతాన్నరు కేటీఆర్.