కాంగ్రెస్, బీజేపీతో జాగ్రత్త… టీఆర్​ఎస్​ నేతలతో కేటీఆర్​

కాంగ్రెస్, బీజేపీతో జాగ్రత్త… టీఆర్​ఎస్​ నేతలతో కేటీఆర్​

‘‘కాంగ్రెస్, బీజేపీతో జాగ్రత్తగా ఉండాలి. ఆ రెండు పార్టీలు మున్సిపల్​ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడించేందుకు లోపాయికారి ఒప్పందం చేసుకోవచ్చు. లోక్​సభ ఎన్నికల్లో  ఆ రెండు పార్టీలు ఒక్కటై మన అభ్యర్థులను ఓడించారు. మళ్లీ అదే తీరుగా చేతులు కలుపుతారు. టీఆర్ఎస్ పార్టీని ఓడించడమే వారి ఉమ్మడి ఎజెండా. మనం అప్రమత్తంగా ఉండాలి’’ అని టీఆర్ఎస్ నేతలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు కట్టడి చేయాలని ఆదేశించారు. అన్ని మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగురాలని, ఆ దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. టీఆర్​ఎస్​ జనరల్​ సెక్రటరీలతో బుధవారం తెలంగాణ భవన్ లో ఆయన సుదీర్ఘంగా 5 గంటలపాటు సమీక్షించారు.

మున్సిపల్ ఎన్నికలు, పార్టీ సభ్యత్వ నమోదు, జిల్లా పార్టీ కార్యాలయాలపై కేటీఆర్ చర్చించారు. ముందుగా అందరితో మాట్లాడిన కేటీఆర్​ తర్వాత ఒక్కో జిల్లా ఇన్​చార్జ్​తో విడిగా సమావేశమయ్యారు. జిల్లాలో పార్టీ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పరిస్థితిపై ప్రధానంగా చర్చించినట్టు తెలిసింది. టీఆర్​ఎస్​ వర్గాలు అందించిన విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడించడానికి కాంగ్రెస్, బీజేపీ కుట్రలు పన్నే ప్రమాదం ఉందని కేటీఆర్ అన్నారు. లోక్​సభ ఎన్నికల సమయంలో ఆ కుట్రలను పసిగట్టడంలో విఫలమయ్యామని, అందుకే 7 ఎంపీ స్థానాలను పోగొట్టుకున్నామని ఆయన వ్యాఖ్యానించినట్లు తెలిసింది. మున్సిపల్ ఎన్నికల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని పార్టీ నేతలకు సూచించారు. కరీంనగర్, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో  కాంగ్రెస్, బీజేపీ  ఒక్కటవుతాయనే  సమాచారం ఉందని అన్నారు. ఇప్పటి నుంచే అందరూ అలర్ట్ గా ఉండాలని ఆదేశించారు.

అంతర్గత కుమ్ములాటలు కట్టడి చేయండి

టీఆర్​ఎస్​లో చాలా జిల్లాల్లో పాత, కొత్త నాయకులు అనే తేడాలు ఉన్నాయని, దీని వల్ల  అంతర్గత కుమ్ములాటలు చోటుచేసుకుంటున్నాయని కేటీఆర్​ అన్నారు. ఇది మున్సిపల్ ఎన్నికలపై ప్రభావం చూపవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్గత కుమ్ములాటలను కట్టడి చేయాలని, కొత్త, పాత నాయకులను ఒకే వేదికపైకి  తేవాలని జనరల్​ సెక్రటరీలను ఆదేశించారు. ఇందుకోసం ఒక్కో జనరల్​ సెక్రటరీకి ఒక్కో జిల్లా బాధ్యతను ఆయన అప్పగించారు. అదేవిధంగా మున్సిపల్​ ఎన్నికల కోసం లోక్​సభ నియోజకవర్గాల వారీగా జనరల్​ సెక్రటరీలను ఇన్​చార్జులుగా నియమించారు. ఆయా నియోజకవర్గంలో జరిగే ఎన్నికలను వారు సమన్వయం చేయనున్నారు. జిల్లాల్లో టీఆర్​ఎస్ కార్యాలయాల నిర్మాణం వేగంగా జరిగేలా చూసేందుకు మరో కమిటీని ఏర్పాటు చేశారు.

అన్ని మున్సిపాలిటీలు మనవే

మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని కేటీఆర్ ఆదేశించారు. కోర్టు విచారణ వచ్చే నెల 9కు వాయిదా పడిందని, జడ్జిమెంట్​ను అనుసరించి ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని అన్నారు. మున్సిపల్ ఎన్నికలు జరిగితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పటికే కొన్ని సర్వేలు చేయించామని, అన్ని మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని వాటిల్లో తేలిందని పార్టీ నేతలకు తెలిపారు.

నెలాఖరు వరకు పార్టీ కమిటీలు పూర్తి: పల్లా

మున్సిపల్ ఎన్నికలను నిర్వహించడానికి టీఆర్ఎస్ సిద్ధంగా ఉన్నా అడ్డుకునేందుకు కొన్ని పార్టీలు కోర్టులకు వెళ్తున్నాయని టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. కేటీఆర్​ జరిపిన సమీక్ష వివరాలను ఆయన మీడియాకు వివరించారు. సభ్యత్వ నమోదు పూర్తయిందని, పార్టీ కమిటీలను ఈ నెల చివరి నాటికి పూర్తిచేయాలని కేటీఆర్ ఆదేశించారని పల్లా తెలిపారు. ఇక జిల్లా పార్టీ కార్యాలయాల నిర్మాణాన్ని దసరా నాటికి పూర్తి చేయాలని, పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు ముగ్గురు ప్రధాన కార్యదర్శులతో ఒక కమిటీని నియమించినట్లు చెప్పారు. ఆ కమిటీలో రాజ్యసభ సభ్యుడు సంతోష్​ కుమార్, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు.

మేం చెబితే వింటారా సార్..!

జిల్లాల్లో అంతర్గత కుమ్ములాటలను కేటీఆర్ ప్రస్తావించినప్పుడు ఓ జనరల్ సెక్రటరీ.. ‘‘మేం చెప్తే సీనియర్ నాయకులు వింటారా సార్” అని అన్నట్లు తెలిసింది.  వెంటనే కేటీఆర్.. ‘‘మీ ప్రయత్నం మీరు చేయండి. నేను కూడా వారితో మాట్లాడుతా” అని చెప్పినట్లు సమాచారం. అయినా వారు సర్దుకోకపోతే.. వారిని ఎలా కట్టడి చేయాలో హైకమాండ్​ చూసుకుంటుందని ఆయన అన్నట్లు తెలిసింది.

మీడియాకు ఎందుకు చెప్తున్నారు?

‘‘సమావేశంలో చర్చించిన విషయాలను మీడియా వాళ్లకు ఎందుకు చెపుతున్నారు? చెప్పొద్దని పదే పదే గుర్తు చేస్తున్నా మళ్లీ అదే తీరుగా ఉంటున్నారు” అని పార్టీ నేతలపై కేటీఆర్ అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. గత వారం సభ్యత్వ నమోదుపై నియోజకవర్గ ఇన్​చార్జ్​ల సమావేశం జరిగిందని, ఆ మీటింగ్ లో ఏ వివరాలు మీడియాకు తెలుపొద్దని గట్టిగా చెప్పినా ఎవరూ పట్టించుకోలేదని ఆయన అన్నట్టు సమాచారం.

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి