ట్యాంక్‌బండ్‌ అంబేద్కర్‌‌ విగ్రహం వద్ద వైఎస్సార్‌‌టీపీ నిరసన

ట్యాంక్‌బండ్‌ అంబేద్కర్‌‌ విగ్రహం వద్ద వైఎస్సార్‌‌టీపీ నిరసన

హైదరాబాద్, వెలుగు: దేశానికి కొత్త రాజ్యాంగం కావాలని సీఎం కేసీఆర్‌‌ చెప్పడం సిగ్గుచేటని, సీఎం తన కామెంట్లను వెనక్కి తీసుకుని, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని వైఎస్సార్‌‌టీపీ డిమాండ్‌ చేసింది. ఇంకోసారి కొత్త రాజ్యాంగ విషయాన్ని లేవనెత్తితే ప్రజలు ఉరికిచ్చి కొడతారని హెచ్చరించింది. ఆదివారం హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ వద్దనున్న అంబేద్కర్‌‌ విగ్రహానికి పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏపూరి సోమన్న ఆధ్వర్యంలో లీడర్లు రాజగోపాల్‌, సత్యవతి పాలాభిషేకం చేశారు. రాజ్యాంగాన్ని మార్చాలంటూ అవహేళన చేసిన సీఎం కేసీఆర్.. ముక్కు నేలకు రాసి, క్షమాపణ చెప్పాలని సోమన్న డిమాండ్‌ చేశారు. మార్చాల్సింది రాజ్యాంగాన్ని కాదని.. కేసీఆర్‌నే అని మండిపడ్డారు. తలపొగరుతో మాట్లాడుతున్న కేసీఆర్‌‌కు ప్రజలే సరైన టైమ్‌లో బుద్ధి చెబుతారన్నారు. 72 ఏండ్ల దేశ చరిత్రలో ఏ ఒక్కరూ రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పలేదని, అంత గొప్ప రాజ్యాంగాన్ని కేసీఆర్‌‌ లాంటి నియంత మార్చాలని చెప్పడం సిగ్గుచేటన్నారు. మొదటి నుంచి దళితులంటే కేసీఆర్ చిన్నచూపేనని, అందుకే దళిత సీఎం, మూడెకరాల భూమి, కార్పొరేషన్‌ లోన్లు ఇవ్వడం లేదన్నారు. దళితులను మరోసారి మోసం చేసేందుకు దళిత బంధు తెచ్చారన్నారు.  రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పడం దళితుల పట్ల కేసీఆర్‌‌కు ఉన్న వివక్ష ఏమిటో అర్థమవుతోందని సత్యవతి అన్నారు.