అమెరికా దాడుల తర్వాత రాత్రికి రాత్రే పుట్టిన ‘కటాయిబ్ హిజ్బల్లా’
న్యూయార్క్: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేయాలనే కుట్రతోపాటు యూరప్‌లో 18 ఉగ్రవాద దాడులకు ప్లాన్ చేసిన కొత్త టెర్రరిస్ట్ గ్రూప్ ‘కటాయిబ్ హిజ్బల్లా’ కమాండర్ మహ్మద్ బాకర్ సాద్ దావూద్ అల్-సాదీని అరెస్ట్ చేసినట్టు ఎఫ్‌బీఐ వెల్లడించింది. అల్-సాదీని ఎఫ్‌బీఐ అధికారులు శుక్రవారం మాన్‌హట్టన్ కోర్టులో హాజరుపర్చారు.
అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్‌పై దాడి చేసిన తర్వాత రాత్రికి రాత్రే ఆవిర్భవించిన కటాయిబ్ హిజ్బల్లా అనే టెర్రరిస్ట్ గ్రూప్‌కు ఇరాకీ జాతీయుడు అల్-సాదీ కమాండర్‌గా వ్యవహరించాడని ప్రాసిక్యూటర్లు తెలిపారు. ఇరాన్‌కు చెందిన హియా (హరకత్ అషబ్ అల్-యామిన్ అల్-ఇస్లామియా) టెర్రరిస్ట్ సంస్థకు కటాయిబ్ హిజ్బల్లా సంస్థ ప్రాక్సీ గ్రూప్‌గా ఏర్పాటైందని గుర్తించామన్నారు.
‘ఇరాన్ సైనిక సంఘర్షణ ప్రారంభమైన తర్వాత వారాల్లోనే దాదాపు 20 దాడులను నిర్వహించడానికి హియా గ్రూప్ యూరప్ అంతటా టెర్రర్ గ్రూపులను రాత్రికి రాత్రే యాక్టివ్ చేసింది’ అని అధికారులు చార్జ్ షీట్లో పేర్కొన్నారు. కాగా, ఏప్రిల్ 20న అల్-సాదీ అమెరికా అధ్యక్షుడిని బెదిరిస్తూ స్నాప్‌చాట్‌లో ఒక సందేశాన్ని పోస్ట్ చేశాడు. ‘‘అమెరికన్లకు విముక్తి కోసం ట్రంప్‌ను చంపాలి. ఈ సందేశాన్ని మేం
ప్రధానంగా అమెరికన్ భద్రతా సంస్థలు, సీక్రెట్ సర్వీస్, ఎప్‌స్టీన్ ఐలాండ్ బాధితులకు పంపుతున్నాం. ఎప్‌స్టీన్ ఐలాండ్ లో ఎన్నో కుటుంబాల రక్తం చిందింది. పిల్లల ప్రాణాలను తీశారు” అని పేర్కొన్నాడు.
