ఏఐ సంస్థ 'ఆంత్రోపిక్'పై ట్రంప్ సర్కార్ వేటు.. క్లాడ్ ఏఐ కథ ముగిసినట్టేనా?

ఏఐ సంస్థ 'ఆంత్రోపిక్'పై ట్రంప్ సర్కార్ వేటు.. క్లాడ్ ఏఐ కథ ముగిసినట్టేనా?

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సిలికాన్ వ్యాలీకి చెందిన ప్రముఖ ఏఐ సంస్థ 'ఆంత్రోపిక్' టెక్నాలజీని వాడకూడదని అన్ని ఫెడరల్ ఏజెన్సీలను ఆదేశించారు. దీనివల్ల అమెరికా ప్రభుత్వం, ఏఐ ల్యాబ్‌ల మధ్య ఘర్షణ ముదిరినట్లయింది.

ఆంత్రోపిక్ సంస్థ తన 'క్లాడ్ ఏఐ' సిస్టమ్‌లోని భద్రతా నిబంధనలను తొలగించడానికి నిరాకరించడమే ఈ వివాదానికి ప్రధాన కారణంగా మారింది. అమెరికా రక్షణ అధికారులు ఒత్తిడి తెచ్చినప్పటికీ, సంస్థ సీఈఓ డారియో అమోడెయ్ ససేమిరా అనడంతో ట్రంప్ సీరియస్ అయ్యారు.

ఆంత్రోపిక్ సంస్థను అనవసరమైనదిగా పేర్కొంటూ, అది దేశ భద్రతను దెబ్బతీస్తోందని ట్రంప్ విమర్శించారు. అయితే పెంటగాన్ వంటి సంస్థలు ఇప్పటికిప్పుడు కాకుండా.. మరో ఆరు నెలల పాటు ఈ టెక్నాలజీని వాడుకోవడానికి వెసులుబాటు కల్పించారు. ఈలోగా వేరే ప్రత్యామ్నాయం చూసుకోవాలని ట్రంప్ సూచించారు.

ALSO READ : క్రిప్టోల్లో తెలివిగా ఇన్వెస్ట్ చేస్తున్న తెలుగోళ్లు..

మరోవైపు రక్షణ కార్యదర్శి పీట్ హెగ్‌సెత్ ఒక అడుగు ముందుకేసి.. ఆంత్రోపిక్‌ను 'జాతీయ భద్రతకు ముప్పు'గా ప్రకటించారు. ఇకపై సైనిక కాంట్రాక్టర్లు ఎవరూ ఈ సంస్థతో వ్యాపార ఒప్పందాలు పెట్టుకోకూడదని స్పష్టం చేశారు. అమెరికా రక్షణ అవసరాలకు అనుగుణంగా ఏఐ మోడల్స్‌పై పూర్తి నియంత్రణ ఉండాలని హెగ్‌సెత్ వాదించారు. ఆంత్రోపిక్ నాయకత్వం అమెరికా సైన్యాన్ని తప్పుదోవ పట్టించేలా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. యుద్ధ రంగంలో ఏఐ వాడకంపై ఎలాంటి ఆంక్షలు ఉండకూడదని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ నిర్ణయం అమెరికా టెక్నాలజీ రంగంలో పెను సంచలనంగా మారింది. నైతిక విలువలు వర్సెస్ దేశ భద్రత అనే చర్చకు ఇది దారితీసింది. భవిష్యత్తులో మిలిటరీ అవసరాల కోసం ఏఐ వినియోగం ఏ మలుపు తిరుగుతుందోనన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.