- కట్టుదిట్టమైన కోటలో ఉన్నా.. ఎత్తుకొచ్చారని వ్యాఖ్య
- భూమిమీద ఇంత గొప్ప ఆపరేషన్ మేమే చేయగలమని కామెంట్
మార్ ఏ లాగో(ఫ్లోరిడా): వెనెజువెలా ప్రెసిడెంట్ నికోలస్ మదురో, ఆయన భార్య సీలియా ఫ్లోరెస్ కట్టుదిట్టమైన భద్రత ఉన్న కోట లాంటి ప్యాలెస్ లో ఉన్నా.. తమ స్పెషల్ ఫోర్సెస్ చాకచక్యంగా ఎత్తుకొచ్చాయని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తమ బలగాలు చేపట్టిన ఆపరేషన్ ను లైవ్ లో చూశానని.. అదంతా ఒక టీవీ షో మాదిరిగా అద్భుతంగా అనిపించిందన్నారు.
వెనెజువెలాపై దాడి, మదురో దంపతుల క్యాప్చర్ తర్వాత శనివారం ఉదయం ఫ్లోరిడాలోని తన మార్ ఏ లాగో ఎస్టేట్ లో ‘ఫాక్స్ న్యూస్’ చానెల్ తో ట్రంప్ మాట్లాడారు. ‘‘మదురో ఆపరేషన్ లో అమెరికన్ కమెండోలెవరూ చనిపోలేదు. ఇద్దరు ముగ్గురికి గాయాలు అయినా.. వారు బాగానే ఉన్నారు. ఈ ఆపరేషన్ లో ఓ హెలికాప్టర్ దెబ్బ తిన్నప్పటికీ, అది కూడా సేఫ్ గా తిరిగి వచ్చింది” అని ఆయన చెప్పారు. వాస్తవానికి నాలుగు రోజుల ముందే ఈ ఆపరేషన్ చేపట్టేందుకు తాను ఆదేశాలు ఇచ్చానని, కానీ ప్రతికూల వాతావరణం కారణంగా వాయిదా పడిందన్నారు.
‘‘మదురో కరాకస్ నడిబొడ్డున అత్యంత కట్టుదిట్టమైన భద్రతతో, మందమైన స్టీల్ డోర్లు, కిటికీలతో కూడిన కోటలాంటి ప్యాలెస్ లో ఉన్నారు. తనను ఎవరూ ఏమీ చేయలేరని అనుకున్నారు. కానీ మా స్పెషల్ ఫోర్సెస్ పెద్ద ఎత్తున విమానాలు, ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లతో దాడులు చేశాయి. మెరుపు వేగంతో ప్యాలెస్ లోకి వెళ్లి మదురో దంపతులను ఎత్తుకొచ్చాయి. ఇదంతా నేను లైవ్ లో చూశాను. ఒక అద్భుతమైన టీవీ షోను చూస్తున్న అనుభూతి కలిగింది.
అత్యంత క్లిష్టమైన ఈ ఆపరేషన్ ను మా బలగాలు ఎంతో చాకచక్యంగా ముగించాయి. ఈ భూమి మీద ఇంత గొప్ప ఆపరేషన్ ను అమెరికా బలగాలు మాత్రమే సాధ్యం చేయగలవు” అని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇటీవల ఇరాన్ లో అణు స్థావరాలను ధ్వంసం చేయడం తర్వాత మళ్లీ ఆ స్థాయి ఆపరేషన్ గా ఇది నిలిచిందన్నారు. కాగా, మదురో దంపతులను యూఎస్ యుద్ధనౌక ‘ఐవో జిమా’ ద్వారా న్యూయార్క్ కు తరలిస్తున్నారని, అక్కడ వారిని ప్రాసిక్యూట్ చేస్తామన్నారు.
వెనెజువెలాను మేమే నడిపిస్తాం..
ఇకపై వెనెజువెలాను తామే నడిపిస్తామని ట్రంప్ చెప్పారు. న్యాయబద్ధంగా సురక్షితమైన అధికార మార్పిడి జరిగేంత వరకూ ఆ దేశాన్ని నడిపిస్తామన్నారు. అయితే, ఈ విషయంలో ఇతర వివరాలేవీ ట్రంప్ వెల్లడించలేదు. ఇక వెనెజువెలాలో ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఫిక్స్ చేసేందుకు అమెరికన్ కంపెనీలు వెళ్తాయని, దేశం కోసం డబ్బులు సంపాదించడం మొదలుపెడతాయని చెప్పారు.
వెనెజువెలాపై రెండో దాడికి కూడా తాము సిద్ధమయ్యామని, కానీ ఇప్పుడు ఆ అవసరం ఉండదని భావిస్తున్నామన్నారు. అమెరికా, వెనెజువెలా మధ్య భాగస్వామ్యం నెలకొంటుందని, దానివల్ల వెనెజువెలా పౌరులు ‘స్వతంత్ర, సురక్షిత, సంపన్న’ ప్రజలుగా మారతారని ఆయన చెప్పుకొచ్చారు. మదురో చట్టవిరుద్ధమైన నియంతగా వ్యవహరించారని విమర్శించారు.
