
వాషింగ్టన్: ప్రపంచదేశాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా ప్రెసిడెంట్ పుతిన్ మధ్య కీలక భేటీ ముగిసింది. అమెరికాలోని అలాస్కా స్టేట్ యాంకరజ్ సిటీలో జరిగిన ఈ సమావేశంలో ఇరు దేశాధినేతలు దాదాపు మూడు గంటల పాటు పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా ఉక్రెయిన్, రష్యా యుద్ధం ముగింపు, శాంతి అవగాహన ఒప్పందంపై డిస్కస్ చేశారు. అయితే, ఎలాంటి ఒప్పందం జరగకుండానే ఈ భేటీ ముగిసింది.
ఈ భేటీ అనంతరం సమావేశ వివరాలను ట్రంప్-పుతిన్ సంయుక్తంగా మీడియాకు వెల్లడించారు. అలాస్కాలో జరిగిన ఉన్నత స్థాయి శిఖరాగ్ర సమావేశం ఉత్పాదకమైనదని ఇద్దరూ నాయకులు జాయింట్ స్టేట్మెంట్ ఇచ్చారు. చర్చలు నిర్మాణాత్మక, పరస్పర గౌరవప్రదమైన వాతావరణంలో జరిగాయని తెలిపారు. చర్చలు చాలా ఉపయోగకరం సాగాయని పేర్కొన్నారు. ఈ భేటీ అనంతరం మరోసారి సమావేశమవుదామని పుతిన్ ప్రతిపాదించారు. ఈ సారి మాస్కోలో సమావేశమవుదామని ట్రంప్‌ను ఆహ్వానించారు పుతిన్.
ట్రంప్ ఉంటే యుద్ధం జరిగేది కాదు: పుతిన్
ఈ సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ.. ట్రంప్ తో నాకు మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. చాలా కాలం తర్వాత ట్రంప్‌ను కలిశానని పేర్కొన్నారు. ఈ భేటీలో ఉక్రెయిన్ రష్యా అంశంపై ప్రధానంగా చర్చించామని తెలిపారు. ఉక్రెయిన్ విషయంలో ట్రంప్‌తో ఒక అవగాహన కుదిరిందని వెల్లడించారు. ఈ చర్చల పురోగతిని దెబ్బతీయొద్దని ఈయూను హెచ్చరించారు పుతిన్. 2022లో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఉక్రెయిన్-రష్యా యుద్ధం మొదలయ్యేది కాదని పరోక్షంగా గత బైడైన్ సర్కార్‌ను విమర్శించారు పుతిన్.
ట్రంప్ మాట్లాడుతూ.. సమావేశం ఫలప్రదంగా సాగిందని తెలిపారు. ఈ భేటీలో చాలా అంశాలు చర్చించామని చెప్పారు. కొన్ని అంశాలు మాత్రమే పరిష్కారం కాలేదన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ, ఈయూతో త్వరలో చర్చిస్తానని తెలిపారు. మిత్రదేశాలైన నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (NATO)కు ఫోన్ చేసి సమావేశ వివరాలు వెల్లడిస్తానని చెప్పారు.