
- పుతిన్, జెలెన్ స్కీ అదే కోరుకుంటున్నరు: ట్రంప్
- వైట్ హౌస్‌లో ట్రంప్‌తో భేటీ అయిన జెలెన్ స్కీ
- ఉక్రెయిన్‌కు మద్దతుగా తరలివచ్చిన యూరప్ నేతలు
- ఈ మీటింగ్ సక్సెస్ అయితే.. రష్యా, ఉక్రెయిన్, అమెరికా త్రైపాక్షిక భేటీ
- శాంతి ఒప్పందానికి ఇదే మంచి చాన్స్ అన్న యూఎస్ ప్రెసిడెంట్
వాషింగ్టన్: రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు ఇదే మంచి చాన్స్ అని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా యుద్ధాన్ని ముగించాలని కోరుకుంటున్నారని, ఆయన అలాస్కా సమిట్‌కు రావడమే గొప్ప విషయమన్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఆగుతుందని, ఇందులో తనకు సందేహమే లేదన్నారు.
సోమవారం మధ్యాహ్నం వాషింగ్టన్‌లోని వైట్ హౌస్ ఓవల్ ఆఫీస్ లో ప్రెసిడెంట్ ట్రంప్‌తో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలోదిమిర్ జెలెన్ స్కీ భేటీ అయ్యారు.ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. మూడున్నరేండ్లుగా సాగుతున్న ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచం అలసిపోయిందన్నారు. త్రైపాక్షిక భేటీతోనే ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకొచ్చని, లేదంటే చావులు కొనసాగుతాయన్నారు. ఈ మీటింగ్‌లో అన్నీ అనుకున్నట్టు జరిగితే.. రష్యా, ఉక్రెయిన్, అమెరికా మధ్య త్రైపాక్షిక సమావేశం ఉంటుందని చెప్పారు. తాత్కాలిక కాల్పుల విరమణ కాకుండా దీర్ఘకాలిక శాంతి కోసమే తాను కృషి చేస్తున్నట్టు తెలిపారు. యుద్ధానికి ముగింపు పలికేందుకు తాను కూడా సిద్ధంగానే ఉన్నానని జెలెన్ స్కీ చెప్పారు. ఉక్రెయిన్‌లో మరణాలను ఆపేందుకు విశేష కృషి చేస్తున్నందుకుగాను ట్రంప్‌కు ధన్యవాదాలు తెలిపారు. ట్రంప్, జెలెన్ స్కీ ముందుగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. తర్వాత ఇరువురు మాత్రమే క్లోజ్డ్ డోర్ మీటింగ్ లో పాల్గొన్నారు. గత సమావేశంలో ట్రంప్, జెలెన్ స్కీ భేటీలో తీవ్ర వాగ్వాదం జరిగిన నేపథ్యంలో ఈసారి జెలెన్ స్కీకి మద్దతుగా యూరప్ దేశాల నేతలు తరలి వచ్చారు. యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మాక్రన్, జర్మనీ చాన్స్ లర్ ఫ్రెడ్రిక్ మెర్జ్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఫిన్లాండ్ ప్రెసిడెంట్ అలెగ్జాండర్ స్టబ్, నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్ కూడా వైట్ హౌస్‌కు వచ్చారు.
మీటింగ్ అవగానే పుతిన్‌కు కాల్ చేస్తా..
జెలెన్ స్కీ, యూరోపియన్ నేతలతో మీటింగ్ అయిపోగానే రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు తాను ఫోన్ చేసి మాట్లాడతానని ట్రంప్ చెప్పారు. ‘‘ఈ మీటింగ్ తర్వాత పుతిన్ కు కాల్ చేస్తా. మనం త్రైపాక్షిక భేటీకి వెళ్లొచ్చు. లేదా వెళ్లకపోవచ్చు. వెళ్లకపోతే యుద్ధం కంటిన్యూ అవుతుంది. యుద్ధానికి ముగింపు పలికేందుకు ఇదే మంచి చాన్స్ అని నేను అనుకుంటున్నా. మనం ఈ మీటింగ్‌ను ముగించగానే నేను కాల్ చేస్తానని ఆయన (పుతిన్) అనుకుంటూ ఉంటారు” అని ట్రంప్ తెలిపారు. కాగా, రష్యాతో యుద్ధం ముగిసి, ఉక్రెయిన్ లో శాంతి నెలకొంటే పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నానని జెలెన్ స్కీ చెప్పారు. ‘‘యుద్ధం వల్ల ఎన్నికలు నిర్వహించలేదు. దేశ ప్రజలకు ప్రజాస్వామ్యయుత, పారదర్శకమైన ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది” అని ఆయన వెల్లడించారు. కాగా, యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ లో ప్రస్తుతం మార్షల్ లా అమలులో ఉన్నందున ఎన్నికలు రద్దయ్యాయి.
మీడియా సమావేశంలో నవ్వులు..
గత ఫిబ్రవరిలో ట్రంప్‌తో జరిగిన భేటీకి సూట్లో కాకుండా మిలటరీ స్టైల్లో టీషర్ట్ ధరించి వచ్చిన జెలెన్ స్కీపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆ మీటింగ్ లో వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో తాజా మీటింగ్ కు జెలెన్ స్కీ బ్లాక్ సూట్ ధరించి వచ్చారు. ఆ సూట్ బాగుందంటూ మీడియా ప్రతినిధులు కాంప్లిమెంట్ ఇవ్వగా.. ట్రంప్ స్పందిస్తూ.. తాను కూడా అదే చెప్పానన్నారు. ఈ సందర్భంగా జెలెన్ స్కీ నవ్వుతూ థ్యాంక్స్ చెప్పారు. యుద్ధాన్ని ఆపేందుకు వ్యక్తిగతంగా ఎంతో కృషి చేస్తున్నందుకు గాను ట్రంప్‌కు జెలెన్ స్కీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. ఉక్రెయిన్‌లో చిన్నారుల మరణాల గురించి తెలియజేస్తూ.. అలాస్కా భేటీ సందర్భంగా పుతిన్‌కు లేఖ పంపిన అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ కు, ఫ్రాన్స్, ఈయూ, ఫిన్లాండ్, యూకే, జర్మనీ వంటి దేశాలన్నింటికీ ధన్యవాదాలు తెలిపారు. ఉక్రెయిన్‌కు మద్దతు తెలిపినందుకు గాను మెలానియా ట్రంప్ కు తన భార్య ఒలెనా జెలెన్ స్కీ కూడా లేఖ పంపారని ట్రంప్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ‘‘ఇది మీకు కాదు, మీ భార్యకు” అంటూ జెలెన్ స్కీ జోకు పేల్చడంతో ట్రంప్‌తో సహా అందరూ నవ్వారు. అంతకుముందు కూడా ట్రంప్, జెలెన్ స్కీ మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు నవ్వుతూ సమాధానాలు చెప్పారు. మొత్తంగా గత భేటీకి భిన్నంగా ఈ భేటీ నవ్వులతో, ఆహ్లాదకరంగా సాగింది.