వాషింగ్టన్: రష్యాతో డీజిల్ ఒప్పందంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ ఒప్పందంపై విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నంలో ఆయన ఓ వింత వాదనను తెరమీదకు తెచ్చారు. తాము చేసుకున్న డీజిల్ డీల్ అమెరికా కోసం కాదని, ప్రపంచ మార్కెట్ల ప్రయోజనాల కోసమేనని ట్రంప్ స్పష్టం చేశారు.
మంగళవారం ఆయన వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్ వద్ద మీడియాతో మాట్లాడారు. ప్రపంచ మార్కెట్లు అధిక ధరలతో ఇబ్బందులు పడుతున్నాయని.. డీజిల్ రిఫైనరీలు దెబ్బతిన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచాన్ని ఆదుకోవడానికే రష్యాతో ఇంధన ఒప్పందం చేసుకున్నట్లు ట్రంప్ సమర్థించుకున్నారు. అయితే, రష్యా తన డీజిల్‌ను యావత్ ప్రపంచానికి అందిస్తోందని గుర్తుచేశారు. అక్టోబర్ 9న రష్యాతో జరిగిన ఈ ఒప్పందాన్ని అమల్లోకి తెచ్చేందుకు అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ ఒక తాత్కాలిక లైసెన్స్‌ను జారీ చేసింది. 2027 ఏప్రిల్ 7 వరకు రష్యన్ డీజిల్ గ్లోబల్ మార్కెట్లోకి రవాణా అయ్యేలా ఆంక్షలను సడలిస్తూ వెసులుబాటు కల్పించింది. అయితే, ట్రంప్ సమర్థన ఎలా ఉన్నప్పటికీ.. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఈ డీల్‌ను తీవ్రంగా తప్పుబట్టారు. రష్యా పొందే ఆర్థిక లాభాలు ఆ దేశ యుద్ధ యంత్రాన్ని మరింత బలపడటానికి, ఉక్రెయిన్‌పై మరిన్ని దాడులు చేయడానికి సహకరిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇరాన్‌పై మా చర్యలు ఎట్లుంటయో చూస్తారు!
ఇరాన్‌ను ఉద్దేశించి ట్రంప్ మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. నవంబర్ 3న జరగనున్న మధ్యంతర (మిడ్‌టర్మ్) ఎన్నికల ప్రచారంలో భాగంగా అలాస్కాలోని వాసిల్లాలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఇరాన్‌పై త్వరలో తాము తీసుకునే చర్యలు ఏంటో మీరే చూస్తారన్నారు. ఇరాన్‌కు తగిన విధంగా బదులిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ ఎప్పటికీ అణు ఆయుధాలను పొందకుండా అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని, అవసరమైతే అందుకు అవసరమైన ఆర్థిక భారాన్ని భరిస్తామని స్పష్టం చేశారు.
