ఈ సంక్షోభానికి ట్రంపే బాధ్యుడు.. అమెరికా ప్రెసిడెంట్పై సీఐఏ మాజీ డైరెక్టర్ విమర్శలు

ఈ సంక్షోభానికి ట్రంపే బాధ్యుడు.. అమెరికా ప్రెసిడెంట్పై సీఐఏ మాజీ డైరెక్టర్ విమర్శలు
  • ట్రంప్ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారిందని కామెంట్

వాషింగ్టన్: పశ్చిమాసియాలో ప్రస్తుత క్లిష్ట పరిస్థితికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రమే బాధ్యుడని అగ్రరాజ్యం మాజీ రక్షణ కార్యదర్శి, సీఐఏ మాజీ డైరెక్టర్ లియోన్ పనెట్టా విమర్శించారు. యుద్ధానికి, ప్రపంచంపై దాని ప్రభావానికి బాధ్యుడు ట్రంపేనని ఆరోపించారు. 

ఇప్పుడు ట్రంప్ పరిస్థితి‘‘ముందు నుయ్యి వెనుక గొయ్యి’’లా మారిందన్నారు. ఈ సంక్షోభం పూర్తిగా ఆయన స్వయంకృతాపరాధమేనని పనెట్టా అభిప్రాయపడ్డారు. యుద్ధం సంభవిస్తే ఇరాన్ కచ్చితంగా హార్మూజ్ జలసంధిని అడ్డుకుంటుందనేది గత పదేళ్లుగా అందరికీ తెలిసిన విషయేమనన్నారు. అయితే ట్రంప్ ప్రభుత్వం దీనిని సరిగ్గా అంచనా వేయడంలో విఫలమైందని పనెట్టా విమర్శించారు. మిత్రదేశాలతో సంప్రదింపులు జరపకపోవడం వల్ల అమెరికా ఈ సంక్షోభంలో ఒంటరయ్యిందని పనెట్టా ఆవేదన వ్యక్తం చేశారు. 

యుద్ధానికి ముందు తగిన సన్నద్ధత లేకపోవడం వల్ల ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకుంటోందని అన్నారు. ఇరాన్ ప్రతిస్పందనను తక్కువగా అంచనా వేయడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లు ఇప్పుడు కుదేలవుతున్నాయని వివరించారు. ప్రస్తుత పరిస్థితిలో ట్రంప్ వద్ద సులువైన మార్గాలేవీ లేవని పనెట్టా విశ్లేషించారు. యుద్ధం నుంచి తప్పుకుంటే అది అమెరికా వైఫల్యంగా కనిపిస్తుందని, అలాగని ఘర్షణను కొనసాగిస్తే మరింత ప్రాణ, ఆస్తి నష్టం తప్పదని హెచ్చరించారు.