నన్ను హ్యాపీగా ఉంచాలి..రష్యాతో వ్యాపారం చేస్తే మరిన్ని సుంకాలు: ట్రంప్ వార్నింగ్

నన్ను హ్యాపీగా ఉంచాలి..రష్యాతో వ్యాపారం చేస్తే  మరిన్ని సుంకాలు: ట్రంప్ వార్నింగ్
  • నేను సంతోషంగా లేనని మోదీకి తెలుసు: ట్రంప్​
  • రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే మరిన్ని టారిఫ్​​లు విధిస్తమని వార్నింగ్​
  • భారత్‌‌‌‌‌‌‌‌ సుంకాలు తగ్గించాలని కోరింది: అమెరికా సెనేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రాహమ్‌‌‌‌‌‌‌‌
  • రష్యానుంచి చమురు దిగుమతి తగ్గించామని చెప్పిందని వెల్లడి
  • ట్రంప్‌‌‌‌‌‌‌‌ను ప్రసన్నం
  • చేసుకోవడానికే మోదీ ప్రభుత్వం పాకులాడుతున్నదంటూ కాంగ్రెస్​ ఫైర్​

న్యూయార్క్‌‌‌‌‌‌‌‌:రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు దిగుమతి వ్యవహారంపై ఇండియాకు అమెరికా ప్రెసిడెంట్​ డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. ఈ విషయంలో భారత్ తమకు సహకరించకపోతే.. భారతీయ దిగుమతులపై ప్రస్తుతం ఉన్న సుంకాలను మరింత పెంచుతామని అన్నారు. 

ఆదివారం ‘ఎయిర్ ఫోర్స్ వన్’ విమానంలో విలేకరులతో మాట్లాడారు. రష్యాతో వ్యాపారాన్ని కొనసాగిస్తే భారత్‌‌‌‌‌‌‌‌పై వేగంగా మరిన్ని సుంకాలు విధించే అవకాశం ఉన్నదని చెప్పారు. ‘‘బేసికల్‌‌‌‌‌‌‌‌గా ప్రధాని మోదీ చాలా మంచి వ్యక్తి. రష్యా చమురు విషయంలో నేను సంతోషంగా లేనని ఆయనకు తెలుసు. నన్ను సంతోషపెట్టడం వారికి ముఖ్యం. వారు రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే.. మనం వారిపై వేగంగా సుంకాలను విధించొచ్చు’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.  

ప్రస్తుతం భారత్-–అమెరికా మధ్య టారిఫ్‌‌‌‌‌‌‌‌ల ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇరుదేశాలు వాణిజ్య చర్చలు జరుపుతున్నాయి.  ప్రస్తుతం 191 బిలియన్ డాలర్లుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 500 బిలియన్ డాలర్లకు చేర్చాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. 

భారతదేశం-–అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయడానికి ఇప్పటివరకు ఇరుదేశాల ప్రతినిధుల మధ్య ఆరు రౌండ్ల చర్చలు జరిగాయి. ప్రధాని మోదీ తనతో మాట్లాడుతూ రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపేస్తానని హామీ ఇచ్చినట్లు ట్రంప్‌‌‌‌‌‌‌‌ ఇటీవల ప్రకటించారు. ఇప్పుడు మళ్లీ భారత్‌‌‌‌‌‌‌‌పై సుంకాలు విధిస్తామంటూ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. 

టారిఫ్‌‌‌‌‌‌‌‌లు తగ్గించాలని భారత్‌‌‌‌‌‌‌‌  కోరింది..

టారిఫ్‌‌‌‌‌‌‌‌లను తగ్గించాలని అమెరికాను భారత్‌‌‌‌‌‌‌‌ కోరినట్టు ఆ దేశ సెనేటర్, ట్రంప్​ సహాయకుడు లిండ్సే గ్రాహమ్‌‌‌‌‌‌‌‌ తెలిపారు.  రష్యా చమురు దిగుమతులను తగ్గించుకున్నామని భారత రాయబారి వినయ్‌‌‌‌‌‌‌‌ మోహన్‌‌‌‌‌‌‌‌ క్వాత్రా తనతో చెప్పారన్నారు. ఈ విషయాన్ని అధ్యక్షుడు ట్రంప్‌‌‌‌‌‌‌‌కు చెప్పి, 25 శాతం సుంకం తగ్గించేలా చూడాలని ఆయన కోరారంటూ గ్రాహమ్‌‌‌‌‌‌‌‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

  గత నెల క్వాత్రా నివాసానికి తాను వెళ్లానని, ఆ సమయంలోనే తమ మధ్య టారిఫ్‌‌‌‌‌‌‌‌ అంశం చర్చకు వచ్చినట్లు చెప్పారు. కాగా, ట్రంప్‌‌‌‌‌‌‌‌ సమక్షంలోనే ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌ విమానంలో లిండ్సే గ్రాహమ్ మీడియాతో ఈ విషయం చెప్పడం గమనార్హం.

మోదీ సర్కారుపై కాంగ్రెస్‌ ఫైర్​

భారత్‌పై అమెరికా ప్రెసిడెంట్​ ట్రంప్‌ సుంకాలు విధిస్తామని చేసిన వ్యాఖ్యలు, అమెరికా సెనేటర్​లిండ్సే గ్రాహమ్‌ కామెంట్స్‌పై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది.  ట్రంప్‌ను ప్రసన్నం చేసుకోవడానికే మోదీ ప్రభుత్వం పాత మిత్రదేశమైన రష్యా నుంచి చమురు కొనుగోళ్లను తగ్గించిందని ఆరోపించింది. కేవలం తన పీఆర్‌‌ స్టంట్స్‌  కోసం దేశ ప్రయోజనాలను మోదీ తాకట్టు పెడుతున్నారని  విమర్శించింది.

 ‘‘ట్రంప్‌ను సంతోషపెట్టడానికి నరేంద్ర మోదీ మన చిరకాల మిత్రదేశం రష్యా నుంచి చమురు కొనడం ఆపేశారని ఈ ప్రకటన ద్వారా స్పష్టమవుతున్నది. కేవలం తన ఇమేజ్ కాపాడుకోవడానికి మోదీ దేశానికి ఎందుకు నష్టం చేస్తున్నారు?” అని ప్రశ్నించింది. నమస్తే ట్రంప్‌, హౌడీ మోడీ, బలవంతపు హగ్‌లు, పొగడ్తలతో ముంచెత్తే సోషల్​ మీడియా పోస్టులు దేశానికి ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదని కాంగ్రెస్​ జనరల్‌ సెక్రటరీ జైరాం రమేశ్‌ ఎద్దేవా చేశారు.