
లండన్: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మళ్లీ పాత పాటే పాడారు. భారత్, పాకిస్తాన్ యుద్ధంలో తాను జోక్యం చేసుకుని ఉండకపోయుంటే, ఆ రెండు దేశాలు కొట్లాడుతూ ఉండేవని పేర్కొన్నారు. స్కాట్లాండ్లో సౌత్ అరిషైర్ లోని టర్న్ బెరీ గోల్ఫ్ రిసార్ట్‌లో బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్తో కలిసి మీడియాతో ట్రంప్ మాట్లాడారు. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా ఆరు ప్రధాన యుద్ధాలను ఆపానని చెప్పారు. వాటిలో భారత్, పాక్ యుద్ధం కూడా ఒకటన్నారు.
హమాస్‌తో ఇజ్రాయెల్ సీజ్ ఫైర్ చర్చలు విఫలమైన నేపథ్యంలో గాజాలో సంక్షోభాన్ని ముగించేలా ఇజ్రాయెల్‌ను ఒప్పిస్తున్నారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఇప్పటికే చాలా చోట్ల సీజ్ ఫైర్లు అమల్లోకి వచ్చాయని, వాటిలో భారత్, పాక్ సీజ్ ఫైర్ కూడా ఉందన్నారు. ‘‘ఇండియా, పాక్ మధ్య యుద్ధం చాలా పెద్దది. ఎందుకంటే, రెండు దేశాల వద్ద అణ్వాయుధాలు ఉన్నాయి. అలాంటి దేశాలు సీజ్ ఫైర్ కు అంగీకరించేలా నేను ఒప్పించాను” అని ట్రంప్ వ్యాఖ్యానించారు.