
- ట్రేడ్ డీల్ వర్తించకపోతే 100 శాతం.. వర్తిస్తే 15 శాతం
- జపాన్, ఆస్ట్రేలియా, చైనాపైనా ప్రభావం
- ఇండియా ఎగుమతుల్లో బ్రాండెడ్ మందుల వాటా ఒక శాతం కంటే తక్కువ మనం సేఫ్ అంటున్న నిపుణులు
న్యూఢిల్లీ: అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఫార్మాపై 100 శాతం టారిఫ్ వేయడంతో ఆసియా కంటే యూరప్ ఎక్కువగా నష్టపోతుందని ఎనలిస్టులు అంచనావేస్తున్నారు. ప్రస్తుతం అమెరికా ఫార్మా దిగుమతుల్లో యూరప్ నుంచి వచ్చే బ్రాండెడ్, పేటెంట్ మందుల వాటా 60 శాతంగా ఉంది. అమెరికా– యూరప్ మధ్య ట్రేడ్ డీల్ ఇప్పటికే కుదిరింది.
దీంతో ఫార్మాపై 15 శాతం టారిఫ్ పడొచ్చని ఎనలిస్టులు చెబుతున్నారు. వైట్ హౌస్ మాత్రం బ్రాండెడ్ మందులకు ఇది వర్తిస్తుందా? అనే విషయాన్ని స్పష్టం చేయలేదు. " అమెరికా–-యూరప్ ట్రేడ్ డీల్ ప్రకారం, ఫార్మాపై 15శాతం టారిఫ్ పడకపోతే, ఈ డీల్‌కు విలువ లేదు" అని జర్మన్ కెమికల్ ఆర్గనైజేషన్ వీసీఐ ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది.
ఈ దేశాలకు నష్టం..
ట్రంప్ ప్రభుత్వం వచ్చే నెల 1 నుంచి బ్రాండెడ్, పేటెంట్ ఉన్న ఔషధాలపై 100శాతం దిగుమతి సుంకం విధించనుంది. దీంతో ఐర్లాండ్, జర్మనీ, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాలుఎక్కువగా నష్టపోనున్నాయి. యూఎస్‌కు ఈ దేశాల నుంచి బ్రాండెడ్ మందులు ఎక్కువగా వస్తున్నాయి. ఒక్క ఐర్లాండ్ నుంచే 2024లో 50.35 బిలియన్ డాలర్ల విలువైన మందులు సరఫరా అయ్యాయి. ముఖ్యంగా రోష్ , నోవార్టిస్, సనోఫి, బేయర్ వంటి కంపెనీలపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
ఈ కంపెనీలు బ్రాండెడ్ మందులను ఎక్కువగా ఎగుమతి చేస్తున్నాయి. ఆసియాలో జపాన్‌పై తీవ్ర ప్రభావం ఉంటుంది. 2024లో 2.5 బిలియన్ డాలర్ల విలువైన మందులు యూఎస్‌కి ఎగుమతి చేసింది. సుమిటోమో ఫార్మా, టకెడా వంటి కంపెనీలపై ప్రభావం ఉంటుంది. ట్రేడ్ డీల్‌లో భాగంగా ఈయూ, జపాన్‌పై 15 శాతం టారిఫ్ పడొచ్చు. ఈ అంశంపై ఇంకా క్లారిటీ లేదు. ఆస్ట్రేలియా 2024లో 1.37 బిలియన్ డాలర్ల మందులను అమెరికాకు ఎగుమతి చేసింది. సీఎస్‌ఎల్ వంటి కంపెనీల షేర్లు ఇప్పటికే భారీగా పడ్డాయి. ఆస్ట్రేలియా ఆరోగ్య మంత్రి ఈ టారిఫ్‌లను "అన్యాయమైనవి" గా అభివర్ణించారు.
ఇండియా నష్టపోదు
ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం ఇండియా ఫార్మా సెక్టార్‌పై పెద్దగా ఉండదని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. కిందటేడాది సుమారు 10.5 బిలియన్ డాలర్ల విలువైన మందులను అమెరికాకు ఎగుమతి చేశాం. ఇందులో బ్రాండెడ్, పేటెంట్ డ్రగ్స్ వాటా ఒక శాతం కంటే తక్కువ ఉంది. ట్రంప్ టారిఫ్‌ల నుంచి జెనరిక్ మందులకు మినహాయింపు ఉంది. దీంతో ఇండియాపై ప్రభావం తక్కువగా ఉంటుందని ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ (ఐపీఏ) తెలిపింది.
భారత ఫార్మా ఎగుమతుల్లో 80 శాతానికి పైగా వాటా డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, లుపిన్, జైడస్ కలిగి ఉన్నాయి. ఒక రిపోర్ట్ ప్రకారం, 2022లో అమెరికాలో నలుగురిలో ఒకరు భారత ఔషధాలు వాడారు. 2013–-2022 మధ్య ఇండియా మందులతో అమెరికన్ ప్రజలు 1.3 ట్రిలియన్ డాలర్లు ఆదా చేయగలిగారు. వచ్చే 5 ఏళ్లలో మరో 1.3 ట్రిలియన్ డాలర్లు ఆదా జరుగుతుంది. చైనా ఏపీఐలను ఎక్కువగా ఎగుమతి చేస్తుండడంతో ఈ దేశంపైనా ప్రభావం తక్కువ.