ఒకవేళ నన్ను చంపేస్తే.. వరల్డ్ మ్యాప్‎లో ఇరాన్ ఉండదు: ట్రంప్

ఒకవేళ నన్ను చంపేస్తే.. వరల్డ్ మ్యాప్‎లో ఇరాన్ ఉండదు: ట్రంప్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ తాను హత్యకు గురైతే.. దానికి కారణం ఇరాన్ అని తేలితే ఇక వరల్డ్ మ్యాప్‎లో ఆ దేశం ఉండదని హాట్ కామెంట్ చేశారు. న్యూస్ నేషన్‌కు చెందిన కేటీ పావ్లిచ్ టునైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘ఇరాన్ తనను హత్య చేస్తే ఆ దేశాన్ని పూర్తిగా నాశనం చేయాలని అధికారులను ఆదేశించా. ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం కూడా చేశా’’ అని చెప్పారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే ఇరాన్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని వార్నింగ్ ఇచ్చారు. 

ఇటీవల ఇరాన్‎లో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగిన విషయం తెలిసిందే. ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు రోడ్డెక్కి ఆందోళనలు చేశారు. ఈ క్రమంలో నిరసనకారులను ఖమేనీ సర్కార్ ఉక్కుపాదంతో అణివేసింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్నవారిని పిట్టల్లా కాల్చి చంపింది. నిరసనకారులపై మారణకాండను ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకించారు. నిరసనకారులపై బల ప్రయోగం చేస్తే మేం రంగంలోకి దిగాల్సి వస్తోందని ఇరాన్‎ను హెచ్చరించారు. ఒకానొక సమయంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని అంతమొందించేందుకు అమెరికా సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరిగింది. 

►ALSO READ | ట్రంప్ ప్రయాణిస్తున్న విమానం అత్యవసర ల్యాండింగ్.. ట్రంప్ కు ఏదో జరిగిందంటూ ప్రార్థనలు.. సోషల్ మీడియాలో పోస్టులు వైరల్

దీంతో మా నాయకుడిపై ఎవరైనా దురాక్రమణ చేయి చాపితే, ఆ చేతిని నరికివేయడమే కాకుండా వారి దేశాన్ని కూడా తగలబెడతామని ట్రంప్‌కు తెలుసు అంటూ ఇరాన్ సాయుధ దళాల అధికారి అబోల్‌ఫజల్ షెకార్చి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్‎కు కౌంటర్‎గానే ట్రంప్ పై విధంగా రియాక్ట్ అయ్యారు. ఇరాన్ తనను హత్య చేస్తే ఆ దేశాన్ని పూర్తిగా నాశనం చేయాలని అధికారులను ఆదేశించానని ట్రంప్ తెలిపారు. కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం కూడా చేశానని చెప్పారు. అయితే అమెరికా రాజ్యాంగం ప్రకారం ట్రంప్ హత్యకు గురైతే ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అధ్యక్ష పదవి చేపడతారు. కానీ అంతకుముందు అధ్యక్షుడు జారీ చేసిన ఏ ఆదేశాలకూ అతడు చట్టబద్ధంగా కట్టుబడి ఉండడు. అంటే.. ట్రంప్ ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉండదు.