ఇండియాపై సెకండరీ టారిఫ్ లు ఉండకపోవచ్చన్న ట్రంప్

ఇండియాపై సెకండరీ టారిఫ్ లు ఉండకపోవచ్చన్న ట్రంప్
  • రెండు మూడు వారాల్లో నిర్ణయం తీసుకుంటమని వెల్లడి

న్యూయార్క్: రష్యా నుంచి ఆయిల్​ కొనుగోలు చేసే దేశాలపై సెకండరీ టారిఫ్​లు ఉండకపోవచ్చని  అమెరికా ప్రెసిడెంట్​ డొనాల్డ్​ ట్రంప్​ అన్నారు. అయితే.. దీనిపై వెంటనే కాకుండా రెండు మూడు వారాల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రష్యా నుంచి ఆయిల్​ కొనుగోలు చేస్తున్న దేశాల్లో చైనా తర్వాత భారత్​ సెకండ్ ప్లేస్​లో ఉందని తెలిపారు.  

‘‘ఇప్పటికే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​పుతిన్​ ఒక ఆయిల్​ క్లయింట్​ను కోల్పోయారు. ఆ క్లయింట్​ ఇండియా. సుమారు 40 శాతం ఆయిల్​ను రష్యా నుంచి ఇండియా కొనుగోలు చేస్తున్నది. ఇప్పుడు ఆ కొనుగోళ్లను ఆపేసినట్లు తెలిసింది. మేం విధించే సెకండరీ టారిఫ్​లు  ఆయా దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. రష్యా, ఉక్రెయిన్​ యుద్ధానికి తెరపడాలని మేం ఆశిస్తున్నం. ఇండియాపై విధించిన టారిఫ్​లు కూడా  ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్​ శాంతి చర్చలకు దారితీశాయి. 

ఇండియాపై సెకండరీ టారిఫ్​లు అమలు చేయాలనుకుంటే చేయొచ్చు.. కానీ, అలా అమలు చేసే పరిస్థితి నాకు రాకపోవచ్చు” అని శుక్రవారం రాత్రి (భారత కాలమానం ప్రకారం) అలాస్కాలో పుతిన్​తో భేటీకి ముందు ఫ్యాక్స్​ న్యూస్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్​ వ్యాఖ్యానించారు. పుతిన్​తో భేటీ అనంతరం కూడా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సెకండరీ టారిఫ్​లపై రెండు మూడువారాల్లో సమీక్షిస్తామని తెలిపారు. పుతిన్​, ట్రంప్​ సమావేశం అనంతరం అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్​ బెస్సెంట్..​ బ్లూమ్​బర్గ్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.

 రష్యా, ఉక్రెయిన్​ యుద్ధాన్ని ఆపేందుకు  పుతిన్​ ఒప్పుకుంటే సెకండరీ టారిఫ్​లు ఉండకపోవచ్చనని, ఒకవేళ అలాంటి పరిస్థితి లేకపోతే మాత్రం రష్యా నుంచి ఆయిల్​ కొనుగోలు చేసే దేశాలపై టారిఫ్​లు రెట్టింపు అయ్యే చాన్స్​ ఉందని చెప్పారు. కాగా, ప్రస్తుతం భారత్​పై 50 శాతం టారిఫ్​లను అమెరికా విధిస్తున్నది. ఇందులో రష్యా ఆయిల్​ను ఇండియా కొనుగోలు చేస్తున్నదని చెప్పి 25 శాతం సెకండరీ టారిఫ్​లను ఈ నెల 27 నుంచి అమలు చేస్తామని గత నెలలో ట్రంప్​ ప్రకటించారు. అయితే.. ట్రంప్​ తాజా వ్యాఖ్యల నేపథ్యంలో  25 శాతం సెకండరీ టారిఫ్​లకు బ్రేక్​ పడే అవకాశం 
ఉందని మార్కెట్​ నిపుణులు  అంచనా వేస్తున్నారు.