Green Card Shortcut: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్నాళ్ల కిందట ప్రకటించిన 'ట్రంప్ గోల్డ్ కార్డ్' వీసా కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంపన్నులు, నిపుణుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. కోటీశ్వరులను, అత్యంత నైపుణ్యం గల వ్యక్తులను ఆకర్షించే లక్ష్యంతో ఈ కొత్త రెసిడెన్సీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ట్రంప్. ఈ గోల్డ్ కార్డ్ గ్రీన్ కార్డ్ తరహాలోనే అమెరికాలో శాస్వత నివాసం అందించడమే కాకుండా, అమెరికా పౌరసత్వం పొందటానికి వేగవంతమైన మార్గాన్ని ఇస్తుందని ట్రంప్ ప్రభుత్వం వెల్లడించింది.
ట్రంప్ గోల్డ్ కార్డ్ కావాలనుకునే వ్యక్తిగత దరఖాస్తుదారులు అమెరికా ప్రభుత్వానికి 1 మిలియన్ డాలర్లు (సుమారు రూ.9 కోట్లు) గిఫ్ట్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. కార్పొరేట్ సంస్థల ద్వారా ఉద్యోగుల కోసం దరఖాస్తు చేసుకుంటే మాత్రం ఒక్కో ఉద్యోగికి 2 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.18 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మెుత్తంతో పాటు దరఖాస్తుదారులు నాన్ రీఫండబుల్ ప్రాసెసింగ్ ఫీజు రూపంలో మరో 15వేల డాలర్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీకి కట్టాల్సి ఉంటుంది.
ALSO READ : ఇండియా జీడీపీ గ్రోత్ రేట్ 7.2 శాతం..
గోల్డ్ కార్డ్ పొందిన వారికి గ్రీన్ కార్డ్ హోల్డర్లతో సమానమైన శాశ్వత నివాస హక్కులు అమెరికాలో లభిస్తాయి. వీరు అమెరికాలో నివసించడానికి, పని చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే నిర్ణీత గడువు తర్వాత వీరు అమెరికా సిటిజన్షిప్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. గతంలో ఉన్న EB-5 ఇన్వెస్టర్ వీసా మాదిరిగా కాకుండా.. ఈ గోల్డ్ కార్డ్ పొందేవారికి అమెరికాలో తప్పనిసరిగా ఉద్యోగాలను సృష్టించాలనే నిబంధన లేదు. ఇది పెట్టుబడిదారులకు అతిపెద్ద ఊరటగా చెప్పుకోవచ్చు.
దరఖాస్తుదారులు గోల్డ్ కార్డ్ కోసం గిఫ్ట్ రూపంలో చెల్లించే మెుత్తం తిరిగి వెనక్కి రాదు. దరఖాస్తు తిరస్కరించబడినా లేదా తర్వాత వీసా రద్దు చేయబడినా ఈ సొమ్ము చిల్లిగవ్వ కూడా వెనక్కి ఇవ్వదు అమెరికా. ఈ కార్యక్రమం కేవలం ధనవంతులు లేదా అత్యధిక నైపుణ్యం కలిగిన నిపుణులకే పరిమితం, ఎందుకంటే దరఖాస్తుదారులు EB-1 లేదా EB-2 వంటి ఇప్పటికే ఉన్న మెరిట్ ఆధారిత వీసా ప్రమాణాలను కూడా పాటించాల్సి ఉంది. ఇలా వచ్చిన డబ్బును అమెరికా అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తామని ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ కొత్త వీసా విధానం అమెరికన్ ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా టెక్నాలజీ వంటి రంగాల్లో ప్రతిభను నిలుపుకోవడానికి సహాయపడుతుందని భావిస్తున్నారు. అయితే ఇంత ఖర్చు చేసి అమెరికా వెళ్లేవారు ఎంతమందో రానురాను తెలియాల్సి ఉంటుంది.

