V6 News

భారతీయులకు ట్రంప్ 'గోల్డ్ కార్డు' వరం కాదు: కోట్లు పెట్టినా గ్రీన్ కార్డ్ లాంగ్ వెయిటింగ్ తప్పదు

భారతీయులకు ట్రంప్ 'గోల్డ్ కార్డు' వరం కాదు: కోట్లు పెట్టినా గ్రీన్ కార్డ్ లాంగ్ వెయిటింగ్ తప్పదు

ట్రంప్ గోల్డ్ కార్డు కోసం దరఖాస్తులు స్వీకరించడం మొదలయ్యాయి. అమెరికాలో జీవితాన్ని తెరిచే ఈ కార్డు.. పర్మనెంట్ రెసిడెన్సీ కోసం లక్షలాది డాలర్లు చెల్లించడానికి సిద్ధపడే విదేశీయులకు ఉద్దేశించబడింది. అయితే ఇది వెంటనే భారతీయులకు గ్రీన్ కార్డ్ లభించేందుకు మార్గం కాదని ఇమ్మిగ్రేషన్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గోల్డ్ కార్డు కోసం వ్యక్తిగత దరఖాస్తుదారులు US ట్రెజరీకి లక్ష డాలర్లు డొనేషన్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది, కార్పొరేట్ స్పాన్సర్‌షిప్ అయితే ఇది 2 లక్షల డాలర్లుగా నిర్థేశించబడింది. దీనికి తోడు దరఖాస్తుదారు 15వేల డాలర్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. గోల్డ్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తి తన డిపెండెంట్స్ అంటే జీవిత భాగస్వామి, పిల్లల కోసం కూడా ఇదే తరహాలో లక్ష డాలర్ల డొనేషన్, ప్రాసెసింగ్ ఫీజులు కట్టాల్సి ఉంటుందని గ్లోబల్ ఇమ్మిగ్రేషన్ లా సంస్థ ఫ్రాగొమెన్ సీనియర్ కౌన్సిలర్ మిచ్ వెక్స్లర్ అన్నారు. అంటే ఈ లెక్కన 4 సభ్యులు ఉన్న ఇండియన్ ఫ్యామిలీ గోల్డ్ కార్డ్ ద్వారా అమెరికా వెళ్లాలనుకుంటే అందుకోసం అక్షరాలా రూ.33 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని తేలింది. 

గ్రీన్ కార్డ్ క్యూలో మార్పు లేదు..
ఇంత భారీ మొత్తంలో డబ్బు చెల్లించినప్పటికీ.. ఈ 'గోల్డ్ కార్డు' కొత్త ఇమ్మిగ్రేషన్ కేటగిరీని ప్రత్యేకంగా సృష్టించదు. ఇది ప్రస్తుతం ఉన్న EB-1A, EB-2 NIW  గ్రీన్ కార్డ్ కేటగిరీల కింద దరఖాస్తు చేసుకోవడానికి మాత్రమే సహాయపడుతుంది. ఇమ్మిగ్రేషన్ చట్టాల ప్రకారం ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డ్‌లకు వార్షిక పరిమితి 1.40 లక్షలు, ఇందులో దేశాల వారీగా 7% పరిమితి ఉంది. అత్యధిక సంఖ్యలో దరఖాస్తుదారులు ఉన్న భారత్ వంటి దేశాలకు.. ఈ పరిమితి కారణంగా చాలా కాలం పాటు నిరీక్షించక తప్పదని తేలిపోయింది.

డిసెంబర్ 2025 వీసా బులెటిన్ ప్రకారం.. EB-1 భారత్ కేటగిరీకి ప్రాధాన్యత తేదీ ఏప్రిల్ 15, 2023గా ఉంది, అంటే అంతకంటే ముందు దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఇప్పుడు ప్రాసెసింగ్ మొదలవుతుంది. ఇక EB-2 భారత్ కేటగిరీలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ప్రాధాన్యత తేదీ మే 15, 2013గా ఉంది. ఎప్పుడో అప్లై చేసిన వాళ్లకే ఇప్పుడు ఛాన్స్ వస్తుంటే.. మరి ఇప్పుడు కోట్లు పెట్టి ట్రంప్ గోల్డెన్ కార్డ్ కొన్న దరఖాస్తుదారులకు ఎన్నేళ్లకు గ్రీన్ కార్డ్ కోసం అవకాశం లభిస్తోంది మాటల్లో చెప్పలేం. అంటే EB-1 లేదా EB-2 బ్యాక్‌లాగ్‌లలో సంవత్సరాలు, దశాబ్దాలు ఇరుక్కుపోతారన్నమాట.