- అద్భుతం జరిగితే తప్ప వినాశనం తప్పదని వార్నింగ్
- తనకిష్టం లేకున్నా తప్పేలా లేదని కామెంట్
- ప్రపంచ చరిత్రలో ఇది కీలక ఘట్టం కాబోతోందని వెల్లడి
వాషింగ్టన్/ టెహ్రాన్: ‘‘ఈ రోజు రాత్రి ఒక నాగరికత పూర్తిగా అంతం కాబోతోంది” అంటూ ఇరాన్‌ను ఉద్దేశించి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్‌లోని నాగరికతను సమూలంగా తుడిచిపెట్టేస్తామని, చివరి నిమిషంలో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప వినాశనం తప్పదని పేర్కొన్నారు. నిజానికి అది తనకు ఇష్టం లేదు.. కానీ తప్పేలా లేదని ఆయన అన్నారు. గడువులోగా తమతో డీల్ కుదుర్చుకోకుంటే ఇరాన్ వినాశనం తప్పదని ట్రంప్ స్పష్టం చేశారు. మంగళవారం రాత్రి 8 గంటల (భారత్‌లో బుధవారం తెల్లవారుజామున 5:30 గంటల) తో ట్రంప్ విధించిన గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలోనే ‘ట్రూత్ సోషల్’ వేదికగా ట్రంప్ చేసిన హెచ్చరికలు ప్రపంచవ్యాప్తంగా వణుకు పుట్టిస్తున్నాయి. ట్రంప్ వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన కేవలం సైనిక స్థావరాల మీద మాత్రమే కాకుండా, ఇరాన్ మూలాలను దెబ్బతీసేలా ఒక భారీ యుద్ధానికి తెరలేపినట్లు స్పష్టమవుతోంది. ‘అద్భుతం జరిగితే తప్ప, వినాశనం తప్పదు’ అంటూ ఆయన ఇచ్చిన
సంకేతం ఇరాన్‌ను లొంగిపోవాలని హెచ్చరించడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికల వెంటనే కార్యాచరణ మొదలైంది. ఇరాన్ ఆర్థిక వెన్నెముకగా భావించే ఖర్గ్ ఐలాండ్ ఇప్పుడు అమెరికా బలగాల దాడులతో మంటల్లో చిక్కుకుంది.
ముంచుకొస్తున్న ముప్పు..
ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ ఈ పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పౌర మౌలిక సదుపాయాలపై దాడులు చేయడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని గుర్తు చేశారు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మాత్రం తాను ‘యుద్ధ నేరాల’ గురించి
అస్సలు ఆందోళన చెందడంలేదని కుండబద్దలు కొట్టారు.
ఇరాన్ తన పంతం వీడకపోతే, దేశంలోని ప్రతి విద్యుత్ కేంద్రం, వంతెన మరియు కీలక మౌలిక సదుపాయాలను నామరూపాల్లేకుండా చేస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సైతం ‘మా పని పూర్తయింది, ఇక చావో రేవో తేల్చుకోవాల్సింది ఇరానే’ అని సంకేతాలిచ్చారు. మంగళవారం రాత్రి 8 గంటలు (అమెరికా కాలమానం ప్రకారం) దాటిన తర్వాత పశ్చిమ ఆసియా మ్యాప్ ఎలా ఉండబోతుందోనని
యావత్ ప్రపంచం ఊపిరి బిగబట్టి చూస్తోంది.
ఓ సైకో బెదిరింపులకు భయపడబోం: ఇరాన్
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఇరాన్ అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది. ‘‘అలెగ్జాండర్, మంగోలులు వంటి వారు దండెత్తి విధ్వంసం సృష్టించారు. అయినా ఇరాన్ ఇంకా సజీవంగానే ఉంది. ఒక సైకో బెదిరింపులకు మేం భయపడబోం’’ అని ఇరాన్ రాయబార కార్యాలయం ఘాటుగా స్పందించింది. పునర్నిర్మాణానికి వీల్లేనంతగా ఇరాన్ ధ్వంసం కానుంది. 47 ఏళ్ల ఇరాన్ అవినీతి, దోపిడీ, రక్తపాతానికి ఈ రాత్రితో ముగింపు పలుకుతాను.
- ట్రంప్
సైకో బెదిరింపులకు బెదరం.
అలెగ్జాండర్, మంగోలులు వంటి వారు దండెత్తి విధ్వంసం సృష్టించారు. అయినా ఇరాన్ ఇంకా సజీవంగానే ఉంది.
- ఇరాన్
