ఎంపీలు,ఎమ్మెల్యేలే టార్గెట్​

ఎంపీలు,ఎమ్మెల్యేలే టార్గెట్​
  • ఆర్థిక శాఖలో డిప్యూటీ సెక్రటరీనంటూ పరిచయాలు
  • ముషీరాబాద్​ ఎమ్మెల్యే, భద్రాచలం మాజీ ఎమ్మెల్యేల కుమారులపై ట్రాప్​
  • వాళ్ల ఫిర్యాదులతో నిందితుడిని అరెస్ట్​ చేసిన సీసీఎస్​ పోలీసులు

 హైదరాబాద్, వెలుగు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీఎమ్మెల్యేలు.. వీళ్లే అతడి టార్గెట్​. జనాన్ని మోసం చేస్తే ఏమొస్తుందని అనుకున్నాడో ఏమో, ఏకంగా ప్రజాప్రతినిధులకే సూటి పెట్టాడు. ఆర్థిక శాఖలో డిప్యూటీ సెక్రటరీనంటూ నమ్మించి డబ్బులు వసూలు చేశాడు. చేసిన తప్పులు ఎప్పుడైనా బయటపడక తప్పదు కదా. హైదరాబాద్​ సైబర్​ క్రైమ్  పోలీసులు అతడి ఆట కట్టించి అరెస్ట్​ చేశారు. ఆ వివరాలను జాయింట్​ కమిషనర్​ సీసీఎస్​ అవినాశ్​ మహంతి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్​ తూర్పుగోదావరి జిల్లా, పెద్దాపురానికి చెందిన తోట బాలాజీ నాయుడు (40) కాకినాడ జేఎన్​టీయూలో బీటెక్​ చదివాడు. ఎన్టీపీసీలో అసిస్టెంట్​ ఇంజనీర్​గా ఉద్యోగమూ చేశాడు. కానీ, ఈజీ మనీ ఆలోచన వచ్చిన అతడు, ఏపీ, తెలంగాణ ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీగా అవతారమెత్తాడు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పేరిట మోసాలకు దిగాడు.

ఎమ్మెల్యేలు, ఎంపీలు ట్రాప్​

తన మోసాలకు ఎంపీలు, ఎమ్మెల్యేలనే టార్గెట్​ చేసుకున్నాడు బాలాజీ. పార్టీ కార్యాలయాల నుంచి వాళ్ల ఫోన్​ నంబర్లను తీసుకున్నాడు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి పీఎంఈజీపీ పథకం కింద కోట్ల రూపాయలు మంజూరయ్యాయని నమ్మించేవాడు. అర్హులైన ఎస్సీ, బీసీ, ఓసీ, మైనారిటీ అభ్యర్థుల లిస్టును పంపించాల్సిందిగా చెప్పేవాడు. లిస్టు పంపాక, అభ్యర్థులకు లోన్​ మంజూరు అయిందని, అవి విడుదల కావాలంటే 5 శాతం డబ్బును డిపాజిట్​ చేయాలని నమ్మించేవాడు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో 60 మంది ప్రజాప్రతినిధులను బాలాజీ మోసం చేశాడు. ఈ క్రమంలోనే ముషీరాబాద్​ ఎమ్మెల్యే ముఠా గోపాల్​ కుమారుడు జయసింహను బాలాజీ ట్రాప్​ చేశాడు. ఎప్పట్లాగే తాను ఆర్థిక శాఖ ఢిప్యూటీ సెక్రటరీ ఎ.మల్లారెడ్డి అని పరిచయం చేసుకున్నాడు. సెక్రటేరియట్​లోని డీ బ్లాక్​ మూడో అంతస్తులో తన ఆఫీసు అని చెప్పాడు. ఎస్సీ, బీసీ, ఓసీ, మైనారిటీల లోన్ల కోసం దరఖాస్తు చేయాలని చెప్పి నమ్మించాడు. డాక్యుమెంట్లు పంపించాక లోన్​ మంజూరుకు అందులో ఐదు శాతం జమ చేయాల్సిందిగా సూచించాడు. బాలాజీ చెప్పినట్టే జయసింహ ₹2.5 లక్షలను అతడి అకౌంట్​లోకి ట్రాన్స్​ఫర్​ చేశారు. మార్చి 1న ఆయా అభ్యర్థులను సెక్రటేరియట్​లో మల్లారెడ్డిని కలవాల్సిందిగా చెప్పి పంపించారు జయసింహ. కానీ, అక్కడికి వెళితే ఆ పేరుతో ఎవరూ లేరని తేలింది. అక్కడే డీఈవోగా మల్లారెడ్డి పేరుతో ఇంకొకరున్నారని తెలుసుకున్నారు. దీంతో మార్చి 3న హైదరాబాద్​ సీసీఎస్​ పోలీసులకు జయసింహ ఫిర్యాదు చేశారు. ఇదే తరహాలో భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజ సత్యవతి కుమారుడు సంతోష్​ కుమార్​నూ బాలాజీ మోసం చేశాడు. ఆయనకు దాసరి అనిల్​ కుమార్​గా పరిచయమయ్యాడు. కేంద్ర ప్రభుత్వ పథకం కింద ₹25 లక్షలు మంజూరు చేయిస్తానని, అందుకు ₹1.25 లక్షలు డిపాజిట్​ చేయాలని సూచించాడు. దీంతో మొదటి విడతగా సంతోష్​ ₹50 వేలు పంపించారు. ఆ తర్వాత అతడి ఫోన్​ స్విచాఫ్​లో ఉండడంతో ఆరా తీస్తే, అసలు అనిల్​ కుమార్​ అనే వ్యక్తే లేరని తేలింది. మార్చి 2న ఆయన సీసీఎస్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఇద్దరి ఫిర్యాదుల ఆధారంగా నిందితుడిని పోలీసులు అరెస్ట్​ చేశారు.