బతకడం గొప్ప కాదు. నిజాయితీగా బతకడం గొప్ప

బతకడం గొప్ప కాదు. నిజాయితీగా బతకడం గొప్ప

నమ్మకం, గౌరవం, ప్రాణం – ఈ మూడు ఒకసారి పోతే తిరిగిరావు. అందుకే ‘బతకడం గొప్ప కాదు. నిజాయితీగా బతకడం గొప్ప’ అని మన సనాతన ధర్మం చెప్తోంది. ఒక వ్యక్తి... ఇతరులకు తన పట్ల నమ్మకాన్ని, గౌరవాన్ని సంపాదించుకోవటం చాలా కష్టం. సంపాదించుకున్న దానిని నిలబెట్టుకోవటం మరింత కష్టం.

రామాయణంలో...

రామలక్ష్మణులు ఒకరిపై ఒకరు నమ్మకాన్ని, గౌరవాన్ని కలిగి ఉన్నారు. శ్రీరామచంద్రుడు పద్నాలుగు ఏండ్లు అడవులకు వెళ్లి అరణ్యవాసం చేయాలని కైకేయి కోరుకుంది. ఆ ప్రకారమే రాముడు నారవస్త్రాలతో అరణ్యాలకు బయల్దేరాడు. ఆ వెంటే లక్ష్మణుడు తానూ వస్తానని బయల్దేరాడు. అన్నగారంటే అంత గౌరవం లక్ష్మణుడికి. తమ్ముడి మాట కాదనలేక తన వెంట తీసుకెళ్లాడు. పద్నాలుగు ఏండ్లు అన్నగారి పట్ల గౌరవమర్యాదలతో ప్రవర్తించాడు. తమ్ముడి పట్ల విపరీతమైన నమ్మకం రాముడికి. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు లక్ష్మణుడు. కంటికి రెప్పలా కాపలా కాస్తూ అన్నావదినలను తల్లిదండ్రులుగా భావించాడు.

సీతాన్వేషణ చేసేటప్పుడు హనుమంతుడు తారసపడ్డాడు. హనుమ మాటతీరు గమనించిన రాముడు, ‘ఇంతటి వ్యక్తి నా వెంట ఉంటే, సీతమ్మ జాడ తెలుసుకోవటం సులభం’ అనుకున్నాడు. రాముడి నమ్మకాన్ని నిలబెట్టాడు హనుమంతుడు. లంక అంతా వెతికి, సీతమ్మను కనుగొన్నాడు. ఆమె పట్ల గౌరవంగా ప్రవర్తించాడు. తాను రామబంటునని సీతమ్మకు నమ్మకం కలిగించటం కోసం రాముడు ఇచ్చిన అంగుళీయకాన్ని సీతమ్మకు అందించాడు. ఆమె కూడా తన చూడామణిని హనుమకు ఇచ్చి, రాముడికి అందచేయమంది. చూడామణిని రాముడికి అందచేశాడు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఆ నమ్మకంతోనే హనుమంతుడి సాయంతో సముద్రం మీద వారధి నిర్మించి, రావణుడిని సంహరించాడు రాముడు.

భారతం విషయానికి వస్తే...

పాండవులలో అగ్రజుడైన ధర్మరాజు పట్ల గౌరవంతో మెలిగేవారు సోదరులు. వారి పరాక్రమం, ప్రవర్తనల పట్ల నమ్మకంతో ఉండేవాడు ధర్మరాజు. పాండవులను లక్క ఇంట్లో ఉంచి, ఆ ఇంటిని తగులబెట్టించాలి అనుకుంటాడు దుర్యోధనుడు. ఆ సమయంలో భీముడు...తన భుజబలంతో వారందరినీ లాక్షా(లక్క) గృహం నుంచి కాపాడాడు. తన శక్తిసామర్థ్యాలపై అన్నగారికి ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. అజ్ఞాతవాసం అప్పుడు విరాటరాజు కొలువులో మారువేషాలలో జీవనం గడిపారు. అజ్ఞాతవాసం ముగించుకున్నారు. ఇక కురుక్షేత్ర యుద్ధ సమయంలో వారివారి శక్తిసామర్థ్యాలు ప్రదర్శించి, యుద్ధంలో విజయం సాధించారు. ధర్మరాజుకి తమ భుజపరాక్రమాల మీద గల నమ్మకాన్ని నిలబెట్టుకుని, అన్నగారి పట్ల వారికున్న గౌరవాన్ని ప్రదర్శించారు. అలాగే... శ్రీకృష్ణుడి పట్ల కూడా వీరికి విపరీతమైన గౌరవం. శ్రీకృష్ణుడు సలహాలను పాటించారు. ఆయనకు తమ పట్ల ఉన్న అవ్యాజ అనురాగానికి ఆనందించారు. ఆయనను సాక్షాత్తు తమ దైవంగా భావించారు. ప్రతికార్యంలోనూ విజయం సాధించారు.

మన కుటుంబ వ్యవస్థలో తల్లిదండ్రులు, పిల్లలు, తాతలు, మనవలు అందరూ కలిసిమెలిసి ఉంటారు. ‘తల్లిదండ్రులను, గురువులను గౌరవించాలి. అలాగే పిల్లల మీద విశ్వాసం ఉండాలి’ అని భారతీయ సనాతన ధర్మం చెప్తోంది. పెద్దలను గౌరవించిన వారిని విజయలక్ష్మి అతి సులువుగా వరిస్తుందని మనకు వినాయకవ్రత కల్పం చెప్తుంది. గణాధిపత్యం కోసం విఘ్నేశ్వరుడు, కుమారస్వామిలకు పరమేశ్వరుడు పరీక్ష పెడతాడు. పుణ్యనదులలో స్నానం చేసి ఎవరు ముందుగా వస్తారో.. వారికే  గణాధిపత్యం అని చెప్తాడు. కుమారస్వామి తన నెమలి వాహనం మీద బయలుదేరతాడు. వినాయకుడు దీనవదనంతో తల్లిదండ్రుల ముందు చేతులు కట్టుకుని నిలబడతాడు. అప్పుడు పార్వతీపరమేశ్వరులు... ‘తల్లిదండ్రులను మించిన దైవం లేదు. వారి పట్ల గౌరవం ఉంటే చాలు’ అని చెప్పటంతో, వారి చుట్టూ ప్రదక్షిణ చేయటం ప్రారంభిస్తాడు. ఆశ్చర్యంగా కుమారస్వామికి తాను ఏ నదిలో స్నానం చేస్తున్నా, అక్కడ తన కంటే ముందుగానే వినాయకుడు స్నానం చేసి రావటం కనిపించింది. అది ఎలా సాధ్యమో అర్థం కాలేదు. నదీ స్నానాలు ముగించుకుని, తల్లిదండ్రుల దగ్గరకు చేరేసరికి వినాయకుడు అక్కడ కనిపించాడు. తన సందేహాన్ని తల్లిదండ్రుల ముందు ఉంచాడు కుమారస్వామి. అప్పుడు ఆ ఆదిదంపతులు... ‘నాయనా తల్లిదండ్రుల పట్ల గౌరవం ఉండాలి. వారి మాట మీద నమ్మకం ఉండాలి. వినాయకుడు అదే నమ్మాడు. పోటీలో గెలుపు సాధించాడు’ అని పలికారు. పెద్దల పట్ల గౌరవంగా ఉంటూ, వారి మాటలను నమ్మి, ఆచరిస్తే, విజయం సాధించగలరని ఈ కథ మనకు చెప్తోంది.
నమ్మకం, గౌరవం ఒకసారి పోగొట్టుకుంటే తిరిగి సంపాదించుకోలేం. అలాగే ప్రాణం కూడా ఒకసారి పోయిందంటే మళ్లీ తిరిగిరాదు.
-  డా. వైజయంతి పురాణపండ ఫోన్: 80085 51232