ఆరోగ్యశ్రీని కోమాలోకి నెట్టిన కేసీఆర్ : షర్మిల

ఆరోగ్యశ్రీని కోమాలోకి నెట్టిన కేసీఆర్ : షర్మిల

కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశాడని వైఎస్పార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. ఆరోగ్యశ్రీ మహానేత వైఎస్ఆర్ సృష్టించిన గొప్ప పథకంమని వైట్వీట్ చేశారు. పేదలకు ఏ రోగమొచ్చినా కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యం అందించాలని ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు. దీని ద్వారా లక్షల మంది ఉచితంగా వైద్యం, ఆపరేషన్లు చేయించుకున్నారన్నారు. ఈ పథకానికి నిధులు ఇవ్వకుండా పేదలకు కార్పొరేట్ వైద్యం అందించకుండా కేసీఆర్ కుట్ర చేస్తున్నాడని విమర్శించారు.

ఇప్పటికే గ్రామస్థాయిలో పేదలకు ఉచిత వైద్యం, మందులు అందించే 104 అంబులెన్స్ లను మూసేశారని వైఎస్ షర్మిల అన్నారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీకి ఎసరు పెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. "నీకు జ్వరం వేస్తే యశోద.. కంటికి నొప్పి వస్తే ఢిల్లీకి.. పోతావ్!.. పేదలు మాత్రం కార్పొరేట్ ఆసుపత్రులకు పోవద్దా?"  అని షర్మిల ప్రశ్నించారు. "నీ పార్టీ అకౌంట్లో వేల కోట్లు ఉంటయ్.. కమీషన్ల కాళేశ్వరానికి లక్షల కోట్లు ఉంటయ్.. బీఆర్ఎస్ ఆఫీసు కట్టుకోడానికి వేల కోట్ల పైసలు ఉంటయ్.. పేదల వైద్యానికి మాత్రం రూ.800కోట్లు లేవా దొర?" అని నిలదీశారు. ఆరోగ్యశ్రీని మూసివేయాలని ప్రయత్నిస్తే ఊరుకునేది లేదు. ఖబడ్దార్..! అంటూ షర్మిల హెచ్చరించారు.