- జీవో ఇచ్చినా విధివిధానాలు రూపొందించని సర్కారు
- ప్రతి వేదికపై నేతల గొప్పలు, అమలు మాత్రం లేదు
హైదరాబాద్ : నేత కార్మికుల బీమా పథకంపై రెండు నెలల క్రితం జీవో ఇచ్చిన సర్కారు.. విధివిధానాలు రూపొందించకుండా వదిలేసింది. దీంతో నేత కార్మికుల కుటుంబాలు బీమా సాయం అందక ఇబ్బంది పడుతున్నాయి. మరో వైపు మంత్రులు, లీడర్లు మాత్రం స్కీమ్అమలు చేస్తున్నామంటూ ప్రతి వేదికపై గొప్పలు చెప్పుకుంటున్నారు. రైతు బీమా తరహాలో రాష్ట్రంలోని నేత కార్మికులకు రూ. 5 లక్షల బీమా సదుపాయాన్ని కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రమాదవశాత్తు, ఆత్మహత్యలు సహా ఏ కారణాల వల్ల చనిపోయినా ఈ స్కీమ్ కింద పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. గత బడ్జెట్‌లో ఈ పథకానికి ప్రీమియం కింద రూ.50 లక్షలను సర్కారు కేటాయించింది.
అప్రూవల్‌తోనే సరి
2021 జూలైలో సిరిసిల్లలో జరిగిన ఓ కార్యక్రమంలో రూ.5 లక్షల ఉచిత బీమా పథకాన్ని రెండు మూడు నెలల్లో తీసుకొస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. బడ్జెట్‌లోనూ ప్రతిపాదించారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌లో నేతన్న బీమా అమలుకు రాష్ట్ర సర్కార్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఇచ్చింది. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ ఉత్తర్వులు జారీ చేశారు. బీమా పరిధిలోకి వచ్చే నేత కార్మికుడు దురదృష్టవశాత్తు చనిపోతే రూ. ఐదు లక్షల క్లెయిమ్‌ను కుటుంబ సభ్యులకు (నామినీకి) అందించనున్నట్లు అందులో పేర్కొన్నారు. 18 నుంచి 59 సంవత్సరాల వయసున్న వారు నేతన్న బీమాకు అర్హులు. దాదాపు 55, 072 మంది ఉంటారని, ఇందుకోసం రూ.29.88 కోట్లు అవసరం పడతాయని అంచనా వేశారు.
విధివిధానాలు ఉత్తమాటే..
బీమాపై ఏప్రిల్‌లో ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు.. ఆ తర్వాత పథకాన్ని పట్టించుకోలేదు. స్కీమ్‌కు సంబంధించిన పూర్తి గైడ్‌లైన్స్ త్వరలోనే విడుదల చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నా.. రెండు నెలలు దాటినా దాని ఊసే ఎత్తడంలేదు. ఇప్పటిదాకా ఎలాంటి విధివిధానాలు రూపొందించలేదు. ఉత్తర్వుల్లో బీమా అర్హులు 55,072 మంది ఉంటారని సర్కారు అంచనా వేసింది. కానీ అంతకు డబుల్ ఉంటారని చేనేత కార్మిక సంఘాల నేతలు అంటున్నారు. గైడ్‌లైన్స్‌కే ఇన్ని రోజులు పడితే.. ఇక స్కీమ్ ఎప్పుడు అమలు చేస్తారని వారు మండిపడుతున్నారు.
మాటలేనా.. చేతలుండవా?
ఎప్పట్నుంచో కొట్లాడితే నేతన్నల బీమా పథకానికి జీవో తీసుకొచ్చిన్రు. రెండు నెలలైనా విధివిధానాలు తీసుకురాలే. నాయకులు మాత్రం స్కీమ్ తెచ్చేశామని గొప్పగా ప్రచారం చేస్తున్నరు. సర్కారువి ఉత్తమాటలే తప్ప చేతలు ఉండడం లేదు. చేనేత వృత్తిలో కొనసాగుతున్న కార్మికులందరికీ ఈ పథకం వర్తింపజేయాలి.
- దాసు సురేష్, నేతన్నల ఐక్య కార్యచరణ కమిటీ చైర్మన్
దయనీయంగా చేనేత ఫ్యామిలీలు
రాష్ట్రంలో పూట గడవని స్థితిలో చేనేత కార్మికుల కుటుంబాలున్నాయి. అప్పుల బాధతో అనేక మంది ఇప్పటికే ఆత్మహత్యలు చేసుకున్నారు. పెద్ద దిక్కును కోల్పోతున్న కుటుంబాలు ఆసరా కోసం చూస్తున్నాయి. బీమా పథకం త్వరగా అమలైతే ఇటువంటి కుటుంబాలకు మేలు జరుగుతుంది.
